రెవెన్యూ తంటాలు

Thu,April 25, 2019 03:32 AM

- సమస్య గుర్తించినా పరిష్కరించరు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోరు
- పాస్‌బుక్కు కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు
- కనికరించాలని వేడుకుంటున్న మద్నూర్ వాసులు
- ఇదీ మద్నూర్ తహసీల్ కార్యాలయ దుస్థితి

మద్నూర్: మండలంలోని రైతులు, సామాన్యులు పాస్‌బుక్కుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను అధికారులు గుర్తించినా పట్టించుకోకపోవడంతో కనికరించాలని వేడుకుంటున్నారు. ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో తంటాలు పడుతున్నారు. ఇన్ని రోజులు కార్యాలయం చుట్టూ తిరిగినా పరిష్కారం దొరకకపోవడంతో తమగోడును ధర్మగంటతో చెప్పుకున్నారు.

అందని పట్టా పాస్‌బుక్కు
మద్నూర్ మండలంలోని పెద్ద తడ్గూర్ గ్రామానికి చెందిన రంజాన్‌షా, కాశీంషా ఇద్దరు అన్నదమ్ములు. కాశీంషా ఎనిమిది సంవత్సరాల క్రితం మృతి చెందారు. వీరికి వారసత్వం కింద సర్వే నెంబరు 111లో రెండు ఎకరాల ముప్పై గుంటల భూమి ఉంది. రంజాన్‌షాకు సంబంధించిన ఎకరం పదిహేను గుంటల భూమికి సంబంధించి కొత్త పాస్‌బుక్కు వచ్చింది. కాశీంషాకు సంబంధించిన పాస్‌బుక్ ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యుకు రాలేదు. కాశీంషా మృతి చెందినప్పటి నుంచి పాస్‌బుక్ కోసం రాంజాన్‌షా ఎన్నిసార్లు తిరిగినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు. పాత పాస్‌బుక్‌లేదు... కొత్త పాస్‌బుక్ రాలేదు. ఎకరం పదిహేను గుంటలకు సంబంధించిన రైతుబంధు డబ్బులను వారు కోల్పోయారు. గ్రామ వీఆర్వో చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయారు. రేపు, ఎల్లుండి అంటూ తిప్పుకుంటున్నారు. తహసీల్ కార్యాలయంలో అధికారులను కలిస్తే తమకేమీ తెలియనది చెప్తున్నారు. ఎవరి వద్దకు వెళ్లాలో అర్థం కావడంలేదని రంజాన్‌షా వాపోతున్నాడు. తన తమ్ముని భూమికి సంబంధించి ఆర్వోర్ ఆర్డర్ కాపీ మాత్రమే రంజాన్‌షా వద్ద ఉంది. వృద్ధాప్యానికి చేరువైన రంజాన్‌షా ఎండలో తిరగలేక, ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నాడు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో పట్టపాస్‌బుక్ అందక, ప్రభుత్వ సాయానికి దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్ కార్యాలయానికి వస్తే వీఆర్వోకు కలువుమంటారు. వీఆర్వో దగ్గరికి వెళ్తే పట్ట్టించుకోరు. భూమికి సంబంధించి పాస్‌బుక్కు లేకపోవడంతో, ఎప్పుడు ఏమి జరుగుతుందో, తమ భూమి వేరేవారికి పోతుందేమోననే భయం బాధిత రైతును వెంటాడుతున్నది. వారసత్వం నుంచి వచ్చిన భూములున్నా, పాస్‌బుక్కులు లేక, రికార్డుల్లోకి ఎక్కక ఏండ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోతున్నది.

పేరు ఎంట్రీ చేసేందుకు ముప్పుతిప్పలు
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన బాబుమియా 2009లో మద్నూర్ శివారులో ఉన్న సర్వేనెంబర్ 51లో 11 గుంటల భూమిని కొనుగోలు చేశారు. గతంలో పాస్‌బుక్కు ఉన్నప్పటికీ కొత్త పాస్‌బుక్కులో ప్రస్తుతం పేరు ఎక్కించలేదు. దీంతో సదరు వ్యక్తికి రైతుబంధు సైతం రాలేదు. తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ నేడూ రేపు అని చెప్తున్నారు తప్ప కొత్త పాస్‌బుక్కులో పేరు ఎక్కించడంలేదు. స్థానిక వీర్వో వద్ద దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఎంట్రీ చేయలేదు. అధికారులు ఎన్నికలు, ఇతర పనుల్లో బిజీగా ఉన్నామని చెప్తున్నారు తప్ప కొత్త పాస్‌బుక్ కోసం మాత్రం నమోదు చేయడం లేదు. అక్కడి సర్వే నెంబరు భూములు ప్లాట్లుగా మారుస్తున్నారని, వాటికి పాస్‌బుక్కులు రావని, దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారు. పక్కనే ఉన్న 49, 50 సర్వే నెంబర్లలో ఉన్న భూములకు సైతం కొత్త పాస్‌బుక్కులు రాలేదు. భూప్రక్షాళన సమయంలో అందరి భూములకు సంబంధించి వివరాలను సేకరించి, అందరికీ కొత్త పాస్‌బుక్కులు వస్తాయని రెవెన్యూ అధికారులు చెప్పినప్పటికీ అవి ఇంతవరకూ రాలేదు. రెవెన్యూ అధికారుల తప్పిదంతో విలువనై భూములకు సంబంధించి పాస్‌బుక్కులు రాకపోవడం, ఎవరికైనా అమ్ముదామంటే రికార్డుల్లో నమోదు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. పేరుకు మాత్రమే భూమి కబ్జాలో ఉన్నప్పటికీ, వాటి ఆధారాలు లేక భయబ్రాంతులకు గురవుతున్నారు.

ఏడాది దాటినా ఇప్పటి వరకూ ఆన్‌లైన్లో వివరాలు నమోదు కాకపోవడంతో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నాలా కన్వెర్షన్ చేయనప్పటికీ రెవెన్యూ సిబ్బంది తప్పిందతో ఇప్పటివరకూ అక్కడి భూములకు పాస్‌బుక్కులు రాకుండా పోయాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో సైతం ఇక్కడి సిబ్బంది ఆదాయ వనరుగా మార్చుకున్నారు. తప్పు ఒప్పులను చూడకుండా వారికి కిష్టమైన రీతిలో రికార్డుల్లోకి ఎక్కించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో వారి పేరిట భూమి ఉన్నా రెవెన్యూ సిబ్బంది, రికార్డుల్లోకి మాత్రం ఎక్కించలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇప్పుడు వేరే పనులు ఉన్నాయని, తరువాత సమయం ఉన్నప్పుడు చూద్దామంటూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి రైతులందరి భూములకు సంబంధించి రికార్డులు సరిచేయాలని చూస్తే, సిబ్బంది మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వెంటనే కొత్త పాస్‌బుక్కు వచ్చే విధంగా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

నా సోదరుడి పట్టా ఇప్పించండి
నా సోదరుడు కాశీంషా మృతి చెందిన ఎనిమిదేండ్లు అవుతున్నది. భూ ప్రక్షాళనలో భాగంగా అధికారులు నాకు కొత్త పాస్‌బుక్కు అందించారు. కానీ నా సోదరుడు కాశీంషాకు సంబంధించి పట్టా బుక్కు రాలేదు. వీఆర్వో, తహసీల్దార్ చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా పని చేయడంలేదు. వృద్ధాప్యంలో ఉన్న నేను ఎండలో తిరగలేక పోతున్నాను. అధికారులు స్పందించి నా సోదరుడి పట్టాపాస్‌బుక్కు అందించి ఆదుకోవాలి.
- రంజాన్‌షా, పెద్దతడ్కోల్

సమస్య పరిష్కరించాలి
మద్నూర్ శివారులో ఉన్న సర్వేనెంబర్ 51లో 11 గుంటల భూమిని కొనుగోలు చేశాను. గతంలో పాస్‌బుక్కు ఉన్నప్పటికీ కొత్త పాస్‌బుక్కులో నా పేరు ఎక్కించలేదు. దీంతో రైతుబంధు సైతం రాలేదు. తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. రేపు, మాపు అన్ని తిప్పించుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పట్టాబుక్కులో నా పేరు ఎక్కించి సమస్య పరిష్కరించాలి.
- బాబుమియా, మద్నూర్

127
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles