కాళ్లు మొక్కినా.. కనికరించడం లేదు..

Wed,April 24, 2019 01:28 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ / లింగంపేట: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం సామాన్య రైతుల పాలిట శాపంగా మారుతోంది. వారసత్వంగా సంక్రమించిన భూమి కి, డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన భూములకు పట్టాదారు పాస్‌బుక్కులు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజ నం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలం క్రితం లింగంపేట మండలంలోని సజ్జన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు మూగురి లక్ష్మయ్య ఇల్లు కాలిపోవడంతో పట్టదారు పాసుపుస్తకాలు దగ్ధం అయ్యాయి. నూతన పట్టదా రు పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోగా తూతూ మం త్రంగా పాత పట్టదారు పుస్తకంలో నమోదు చేసి రైతు చేతికిచ్చారు. రైతుకు నూతన పట్టదారు పాసుపుస్తకంలో భూముల వివరాలు నమోదు చేసి అందివాల్సి ఉండగా గతంలో ఇతరులకు జారీ చేసిన పాసుపుస్తకానికే పేరు మార్పిడి చేసి బాధితుడికి అందించారు. నాటి నుంచి నేటి వరకు నూతన పట్టదారు పాసుపుస్తకం అందించలేదు. రికార్డుల ప్రక్షాళన సందర్భంగా గ్రామంలోని రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయి.

కానీ లక్ష్మయ్యకు మాత్రం నూతన పాసుపుస్తకం జారీ కాలేదు. పట్టాదారు పాసుపుస్తకం కోసం కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాళ్లు మొక్కినా, బతిమిలాడిన, ప్రాధేయపడినా రెవెన్యూ అధికారులు కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎల్లన్నగారి పోశయ్యకు సర్వే నంబరు 683/ఉ లో 1.21 గుంటలు, 792/ఊ లో రెండున్నర గుంటలు, 803/ఇ లో మూడుంపావు గుంటలు, 825/ఓ లో 11 గుంటలు, 830/2లో పదకొండున్నర గుంటలు, 856/ఇ/1లో 10 గుంటల భూమి ఉంది. కానీ, నూతన పట్టదారు పాసుపుస్తకంలో కేవలం 803/ఇలో ఉన్న మూడుంపావు గుంటలు మత్రమే నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేశారు. దీంతో పంట పెట్టుబడి కింద మూడు వందల రూపాయలు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. పాత రికార్డుల ప్రకారం 1బీ పహాణీలో ఉన్న భూముల వివరాలు నూతన పట్టాదారు పాసుపుస్తకంలో నమోదు చేయించాలని చెప్పులు అరిగేలా తిరిగినా అధికారులు కనికరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లెక్కలన్నీ తారుమారు...
లింగంపేట మండలంలోని సజ్జన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు మంత్రి పోశయ్యకు వారసత్వంగా 703/3 సర్వే నంబరులో మూడున్నర గుంటల భూమి, 770/ఆ3లో మూడు గుంటల భూమి, 781/ఆ/3లో ఒకటింపావు గుంట, 801/ఆ/3లో రెండుపావు గుంటలు, 825/అలో 21 గుంట, 825/ఆలో 20 గుంటలు, 932/7లో ఎకరం 10 గుంటలు, 136/698/1లో ఐదు గుంటలు, 988/5/699/1లో రెండున్నర గుంటల భూమి మొత్తం రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీటిలో 825/ఆలో ఉన్న 20 గుంటల భూమిని ఆదే గ్రామానికి చెందిన మూగూరి పోశయ్య పేరిట పట్టాదారు పాసుపుస్తకం జారీ చేశారు. తనకు ఇచ్చిన కొత్త పాస్‌బుక్కులో తన భూమికి సంబంధం లేని సర్వే నంబర్లు కేటాయించి నూతన పాసుపుస్తకం జారీ చేశారు. దీనిలో 825/అలో 20 గుంటల భూమి, 932/7లో ఉన్న ఎకరం 20 గుంటల భూమి పాసుపుస్తకంలో నమోదు చేయకుండా కేవలం 21 గుంటల భూమి ఉన్నట్లు పట్టాదారు పాసుపుస్తకం జారీ చేశారు.

మాసన్నగారి రాజవ్వ పేరిట సర్వే నంబరు 890/అలో 1.36 గుంటలు, 890/ఆలో 38 గుంటలు, 701/అ/1లో 14పావు గుంటల భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన రైతు వద్ద 38 గుంటలు, 14పావు గుంటల భూమి కొనుగోలు చేసినట్లు రైతు వెల్లడించారు. తాను కొనుగోలు చేసిన భూముల వివరాలు పట్టాదారు పాసుపుస్తకంలో నమోదు చేయడానికి స్థానిక వీఆర్వో రెండు వేల రూపాయలు లంచం అడిగితే ఇచ్చినట్లు రైతు వెల్లడించారు. అయినప్పటికీ పైసల్ తీసుకొని పని చేయలేదని ఆందోళన వ్యక్తం చేసున్నాడు. నూతన పట్టా పాసుపుస్తకంలో 890/అ సర్వే నంబరులో ఉన్న ఎకరం 36 గుంటలకు బదులుగా ఎకరం 25 గుంటల భూమి మాత్రమే ఉన్నట్లు నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేసినట్లు తెలిపాడు. దీంతో తనకు పంట పెట్టుబడి కూడా తక్కువగా వచ్చినట్లు రైతు వాపోయాడు. ఇలా గ్రామంలో 30 మందికి పైగా రైతులకు భూముల వివరాలు సక్రమంగా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్నున్నారు.

పైసల్ ఇచ్చినా పని కాలేదు..
ఊర్ల జరంత భూమి కొనుక్కున్నా. నా భార్య పేరు మీద పాసు పుస్తకంల పేరు ఎక్కియ్యనికి పట్వారీ రెండు వేల రూపాయలు లంచం అడిగితే పైసల్ ఎందుకని అడిగినా. పైసల్ ఇస్తేనా పాస్‌బుక్కులు వస్తాయన్నడు. పెద్ద సార్లకు పైసల్ ఇవ్వాలని నా వద్ద రూ.రెండు వేలు తీసుకపోయిండు. పాత పాస్ బుక్కుల ఉన్న భూమి వివరాలేవీ కొత్త బుక్కుల రాలేదు. ఆఫీసుకు పోతే జిరాక్స్ కాపీలు ఇయ్యుమన్నారు. ఇచ్చినా కానీ కొత్త పుస్తకంల భూమి రాలేదు. తహసీల్దార్ సార్‌ని కలిస్తే పట్వారీకి ఇచ్చి పో అంటుండే తప్ప పని చేస్తలేరు. పంట పెట్టుబడి నయా పైసా రాలేదు. ఇప్పటికే మస్త్ నష్టపోయా.
- మాసన్నగారి సిద్దయ్య, సజ్జన్‌పల్లి, మం: లింగంపేట

మా సమస్యలను పట్టించుకునే వారు లేరు..
ఏడాదిన్నర క్రితం నేను నివాసించే ఇల్లు కాలిపోయింది. అందులోనే నా భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు కాలిపోయాయి. నూతన పట్టదారు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకోగా పాత పట్టదారు పుస్తకంలో తాత్కాలికంగా వివరాలు నమోదు చేసి ఇచ్చిండ్రు. కేసీఆర్ సారూ ఇచ్చినటువంటి కొత్త పాస్ బుక్కు నా చేతికి రాలేదు. నాకు రైతుబంధు, రైతుబీమా పథకాలేవీ వర్తించడం లేదు. అసలు ఆఫీస్‌కు పోతే పట్టించుకోవడం లేదు.
- మూగురి లక్ష్మయ్య, సజ్జన్‌పల్లి, మం: లింగంపేట

66
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles