ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

Wed,April 24, 2019 01:24 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు, సీనియర్ ఐజీ అభిలాష బిష్త్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియను ఆమె కలెక్టర్ సత్యనారాయణతో కలిసి మంగళవారం పరిశీలించారు. కామారెడ్డి డివిజన్‌లోని కామారెడ్డి, తాడ్వాయి, రాజంపేట్‌లోని ఎంపీడీవో కార్యాలయాలను పరిశీలించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర అధికారులకు ర్యాండమైజేషన్ నిర్వహించారు. కామారెడ్డి డివిజన్‌లో 2201 మంది, ఎల్లారెడ్డిలో 1140 మంది, బాన్సువాడలో 2057 మంది మొత్తం 5398 మందికి ర్యాండమైజేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ అభిలాష బిష్త్ మాట్లాడుతూ... ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్లు డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా వినియోగించుకోవాలని కోరారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఖర్చుపై నోడల్ అధికారి అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తాడ్వాయి మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ పత్రాలను పరిశీలించారు. కామారెడ్డి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కేంద్రం, ఎంపీటీసీల కేంద్రాలను చిన్నమల్లారెడ్డి-1,2, నర్సన్నపల్లి, గర్గుల్, క్యాసంపల్లి, శాబ్దిపూర్, కౌంటర్లను సందర్శించారు.
కలెక్టర్ మాట్లాడుతూ... 3వ ర్యాండమైజేషన్ మే 4న నిర్వహించనున్నట్లు తెలిపారు. 400 మంది ఉన్న ఓట్లరకు 39 పోలింగ్ కేంద్రాలు, 600 వరకు ఉన్న ఓటర్లకు 84 పోలింగ్ కేంద్రాలు, 800 వరకు ఉన్న ఓటర్లకు 71 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 22 జడ్పీటీసీ స్థానాలకు, 236 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి దఫా 9 మండలాలకు, రెండో దఫా 7 మండలాలకు, మూడో దఫా 6 మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. 6 లక్షల 7 వేల 719 మంది ఓటర్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ఎన్నుకోనున్నట్లు చెప్పారు. నామినేషన్ల అనంతరం కామారెడ్డిలోని 4 ప్రింటింగ్ ప్రెస్‌ల ద్వారా బ్యాలెట్ పత్రాల ముద్రణ త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. చెక్‌లిస్ట్‌ను సీరియల్ నంబరు ప్రకారం సరిచూసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జేసీ యాదిరెడ్డి, సీపీవో శ్రీనివాస్, డీపీవో సాయన్న, నోడల్ అధికారులు రఘునాథ్, నోడల్ అధికారులు, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles