ఒక్క ఛాన్స్ ప్లీజ్!

Mon,April 22, 2019 11:46 PM

- పరిషత్ పోరు... ఆశావహుల జోరు
- అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేల కసరత్తు
- జనరల్ స్థానాల్లో పోటా పోటీ
- టీఆర్‌ఎస్ పార్టీ బీ-ఫారం కోసం ఎదురుచూపు
- తొలి విడత టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి
- నేడు ప్రకటించే అవకాశం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: స్థానిక సంస్థల పోరు ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. నామినేషన్ల ఘట్టం ఆరంభం కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను దక్కించుకునేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు వందలాది మంది వరుస కట్టడంతో సరైన అభ్యర్థుల ఎంపిక నేతలకు సైతం కత్తిమీది సాములా మారింది. తొలి విడత నామినేషన్లకు బుధవారంతో ముగియనుండడంతో త్వరగా ఈ ప్రక్రియ తేల్చేసే పనిలో నిమగ్నం అయ్యారు. మరోవైపు రెండు, మూడో విడతకు సైతం సమయం ఆసన్నం అవుతుండడంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అభ్యర్థుల ఎంపికపై సీరియస్‌గా దృష్టి సారించారు. తొలి విడతలో 9 మండలాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో కామారెడ్డి నియోజకవర్గంలోని మొత్తం మండలాలున్నాయి. మిగిలిన మూడు మండలాలు ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోనివి. ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాగా గులాబీ పార్టీ అండతో నేడు మెజార్టీ సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఒక్క అవకాశం ప్లీజ్
ప్రాదేశిక పోరు జోరందుకుంటున్నది. అటు అధికారులు ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఆశావహులు టికెట్లు దక్కించుకుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చాలా మంది ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రతిపక్ష పార్టీల్లో కనీసం పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారే కరువయ్యారు. మొన్న హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశంలో బరిలో నిలిచే వారిని ఎంపిక చే యాల్సింది ఎమ్మెల్యేలే అని తేల్చి చెప్పడంతో ఆశావహులంతా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా పోటీ చేసే వారు... ఒక్క అవకాశం ఇవ్వమని శాసన సభ్యులను అడుగుతున్నారు. నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలవ్వడంతో తొలి విడత మండలాల్లో ఆశావహులు విశ్వప్రయత్నాలు చేస్తుండగా మిగతా చోట్ల ఎమ్మెల్యేల నుంచి గ్రీన్ సిగ్నల్ పొందితే ఢోకా ఉండదని భావిస్తున్నారు. ఈ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతాయి. దీంతో పార్టీలన్నీ స్థానిక పోరును చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కేసీఆర్ ఇప్పటికే శాసనసభ్యులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని జడ్పీ చైర్మన్ పీఠాలు, మండలాల్లో ఎంపీపీ పదవులన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలోకే రావాలని, అందుకు నాయకులు కలిసి కట్టుగా కసరత్తు చేయాలని సూచించారు. ఈ క్రమంలో జిల్లాలోని టీఆర్‌ఎస్ నాయకుల ఇళ్లు, క్యాంపు కార్యాలయాల వద్ద సందడి మొదలైంది. ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ల కోసం బరిలో నిలిచి భంగపాటు కలిగిన వారు, ద్వితీయ శ్రేణి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటీవల ఇతర పార్టీల నుంచి చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ క్రమంలో ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీళ్లందరినీ జల్లెడ పట్టి, తుది జాబితా ఎంపిక చేయడం సవాల్‌గా మారుతోందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ప్రాదేశిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారైనప్పటి నుంచే తమపై ఒత్తిడి పెరిగిందని వాపోతున్నారు.

జనరల్ స్థానాల్లో పోటాపోటీ
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు. పార్టీ పటిష్టతకు ఈ ఎన్నికలే కీలకం కావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. మండల స్థాయి పదవులపై ఆశలు పెట్టుకున్న అనేక మంది నేతలకు రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో ఆయా స్థానాల నుంచి కొత్త అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 22 జడ్పీటీసీ స్థానాల్లో 11 మహిళలకు కేటాయించడంతో ఆయా మండలాల్లో అభ్యర్థుల ఎంపిక పెద్ద సమస్యగా మారింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన నేతల్లో ఎక్కువ మంది స్థానిక పదవులు చేపట్టి పేరు గడించిన వారే కావడంతో నేటి తరం నాయకులంతా వీటిపై ఆసక్తి చూపుతున్నారు. పార్టీ పరంగా పైపదవులకు వెళ్లాలంటే స్థానిక ఎన్నికల్లో సత్తా చూపాల్సి ఉంటుంది. మహిళలకు కేటాయించిన స్థానాల్లో ఆయా మండలాల్లో పార్టీ పటిష్టతకు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో కృషి చేసిన నాయకుల కుటుంబ సభ్యుల్లో ఒకరిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. వారు ఆసక్తి చూపని పక్షంలో వేరే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నేతలు ఆలోచిస్తున్నారు. జనరల్ స్థానాల్లో పోటీ విపరీతంగా నెలకొంది. పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలను, ఆయా పార్టీ ప్రధాన నేతలను కలిసి తమ అభిమతాన్ని ప్రకటించారు.

పోరుకు కాంగ్రెస్, బీజేపీలు డీలా
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నగారా మోగడంతో తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నది. శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన గులాబీ పార్టీ ఎంపీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు గట్టి పోటీనిచ్చింది. ఇప్పుడు స్థానిక సంస్థల పోరులో మిగతా పార్టీలకు కంటిమీది కునుకు లేకుండా చేసేలా టీఆర్‌ఎస్ నేతలు ప్రణాళికలు రచించారు. తొలి విడత నోటిఫికేషన్ వెలువడిందో లేదో ఇప్పటికే గులాబీ పార్టీలో సందడి నెలకొనగా కాంగ్రెస్, బీజేపీల్లో కనీసం హడావిడే కనిపించడం లేదు. 236 ఎంపీటీసీ స్థానాలు, 22 జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున ఆశావహులు వరుస కడుతుండగా ఇతర పార్టీలకు కనీసం అభ్యర్థులు దొరకడమే గగనమైంది. వరుసగా పరాజయాన్ని మూట కట్టుకుంటోన్న ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీకి నాయకులెవ్వరూ ఉత్సాహం చూపడం లేదని విశ్లేషకులు అభివర్ణిస్తారు. శాసనభ, లోక్‌సభ ఎన్నికలు ఇటీవల జరగడంతో ఇప్పటి వరకు ఆయా పార్టీల తరఫున ప్రచారం చేసిన నేతలే స్థానిక సమరంలో పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో జరిగిన శాసనసభ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో పార్టీల వారీగా పడిన ఓట్లను బేరీజు వేసుకుని పార్టీ ప్రాబల్యం ఉన్న చోట గెలుపునకు అవకాశం ఉండే నేతలను బరిలో దింపేందుకు నేతలు పావులు కదుపుతున్నారు.

ఎంపీటీసీలకు 16.. జడ్పీటీసీలకు 3 నామినేషన్లు
కామారెడ్డి, నమస్తే తెలంగాణ: కామారెడ్డి డివిజన్‌లోని 9 మండలాల్లో సోమవారం తొలి రోజు ఎంపీటీసీలకు 16, జడ్పీటీసీలకు 3 నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. 88 ఎంపీటీసీ స్థానాలు, 9 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. భిక్కనూరు మండలంలోని 14 ఎంపీటీసీలకు గాను 2, బీబీపేట్‌లో 7 ఎంపీటీసీ స్థానాలకు ఒకటి, దోమకొండలో 9 ఎంపీటీసీ స్థానాలకు ఒకటి, కామారెడ్డిలో 6 ఎంపీటీసీ స్థానాలకు గాను 3, మాచారెడ్డిలో 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 5, రాజంపేట్‌లో 8 ఎంపీటీసీ స్థానాలకు గాను ఒకటి, రామారెడ్డిలో 10 ఎంపీటీసీ స్థానాలకు గాను ఒకటి, సదాశివనగర్‌లో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. తాడ్వాయిలో 9 ఎంపీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా రాలేదు. జడ్పీటీసీ స్థానాలకు బీబీపేట్‌లో రెండు నామినేషన్‌లు, కామారెడ్డిలో ఒకటి, మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. భిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, రాజంపేట్, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయిలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ నామినేషన్‌లు దాఖలు చేయడానికి బుధవారం చివరి రోజు.

పరిషత్ ఎన్నికల నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రారభం
గాంధారి(సదాశివనగర్): ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల్లో భాగంగా సోమవారం సదాశివనగర్ మండల కేంద్రంలో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సదాశివనగర్ మండలంతో పాటు, రామారెడ్డి మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం సదాశివగర్ ఎంపీటీసీ -2కు ఒక నామినేషన్, ధర్మారావు పేట్ ఎంపీటీసీ స్థానానికి ఒక నామినేషన్ వచ్చింది. దీంతో పాటు రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్ ఎంపీటీసీ స్థానానికి ఒక నామినేషన్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
సదాశివనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రెండు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాలను స్వీకరించే అధికారులు అభ్యర్థుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్వీకరించాలని సూచించారు.

69
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles