పరిషత్ పోరుకు సర్వం సన్నద్ధం

Mon,April 22, 2019 01:11 AM

-అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
-నేటి నుంచి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ
-అభ్యర్థులు నిబంధనలు పాటించాలి : కలెక్టర్ సత్యనారాయణ
-మద్యం, నగదు ప్రవాహానికి అడ్డుకట్ట : ఎస్పీ శ్వేతారెడ్డి
కామారెడ్డి, నమస్తే తెలంగాణ: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో కామారెడ్డి డివిజన్‌లో పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్నది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది.
ఓటింగ్ శాతం పెంపే లక్ష్యం
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెం చడానికి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి రెండు పోస్టులకు నామినేషన్‌లు దాఖలు చేసినా చివరికి విత్‌డ్రాలోపు ఉపసంహరించుకోకపోతే అనర్హుడిగా ప్రకటిస్తారు.
భారీ బందోబస్తు ఏర్పాటు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ బందోబస్తుకు పోలీసుశాఖ చర్యలు తీసుకుంటున్నది. గతంలో జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల తరహాలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు 2,100 మందిని బైండోవర్ చేశారు. బైండోవర్ చేసిన వారు గొడవలకు పాల్పడితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.
గుర్తుల కేటాయింపు
పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలుగు వర్ణమాల క్రమంలో బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థి పేరు, పార్టీ పేరు, పార్టీ చిహ్నాలు ముద్రిస్తారు. ఈ గుర్తులు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు, రిజిష్టర్ అయిన రిజర్వ్ గుర్తు కలిగిన పార్టీలు, రిజిష్టర్ రిజర్వ్ గుర్తు లేని పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయిస్తారు.

అభ్యర్థుల ఖర్చు వివరాలు ఇలా..
రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే జడ్పీటీసీ అభ్యర్థికి రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థికి రూ.లక్షా 50 వేలకు లోబడి ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఎన్నికల అనంతరం వ్యయానికి సంబంధించిన అన్ని బిల్లులను 45 రోజుల్లోపు ఎంపీడీవోలకు సమర్పించాలి. ఎంపీటీసీ అభ్యర్థులు సంబంధిత మండలంలో ఓటరుగా నమోదై ఉండాలి. జడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. మున్సిపాలిటీలో నమోదైన ఓటర్లు పోటీ చేసేందుకు వీలులేదు.
ఎన్నికల ప్రచారం
ఎన్నికలకు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం చేయాకూడదు. ఎన్నికల ప్రచార సమయంలో అభ్యర్థులు సంబంధిత అధికారి నుంచి ప్రచార అనుమతి తీసుకోవాలి. లౌడ్ స్పీకర్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి పొందిన బహిరంగ సమావేశాలు, రోడ్‌షోలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉపయోగించాలి. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ, ప్రైవేటతు ఆస్తులను ధ్వంసం చేస్తే సదురు వ్యక్తులు 3 నెలల జైలు శిక్ష, లేదా రూ.వేయి నుంచి 2 వేల వరకు జరిమానా విధిస్తారు.

ఎన్నికల నియమావళి
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అభ్యర్థులు స్నేహపూర్వక పోటీ వాతావరణంలో ప్రచారం నిర్వహించాలి. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే జిల్లా ఎన్నికల అధికారి సిఫార్సుపై అభ్యర్థి అభ్యర్థిత్వం రద్దు చేసే అవకాశముంది.
మొదటి విడుత లో..
కామారెడ్డి డివిజన్‌లోని భిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, కామారెడ్డి, రాజంపేట్, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, బీబీపేట్ మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
కామారెడ్డి, నమస్తే తెలంగాణ: జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని కలెక్టర్ సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 22వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో, జడ్పీటీసీ స్థానాలకు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లను అందించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 24వ తేదీ వరకు ఉంటుందని, 25వ తేదీన స్క్రూటీని, 25వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత లిస్ట్ ఆఫ్ వాలిడిట్ నామినేటెడ్ అభ్యర్థుల వివరాలు, 26వ తేదీ ఆపీల్స్‌కు సాయంత్రం 5 గంటల వరకు, 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు విత్ డ్రా, 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు చివరి విత్‌డ్రాలు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ అభ్యర్థుల వివరాలు వెల్లడి ఉంటుందని తెలిపారు. మే 6వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, మే 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుందని, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ మే 27వ తేదీన వెలువడుతుందని వివరించారు.

ఎన్నికల ధరావత్
జడ్పీటీసీకి పోటీ చేసే అభ్యర్థులు జనరల్ అయితే రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే రూ.2500, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు జనరల్ అయితే రూ.2500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే రూ.1250 చెల్లించి ధరావత్ చేసుకోవాలి. పరిశీలనలో తిరస్కరించిన నామినేషన్‌లపై ఆప్పీలు 5వ రోజు జడ్పీటీసీ అభ్యర్థులు కలెక్టర్, ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డీవోలకు ఆప్పీలు చేసుకోవచ్చు. 6వ రోజు ఆప్పీలుపై విచారణ, పరిష్కారం చేస్తారు. 7వ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ఫారం-బీని పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ సిరా సంతకంతో నేరుగా ఆర్వోకు సమర్పించాల్సి ఉంటుంది. అధీకృతం చేసిన వ్యక్తి, లేదా వ్యక్తులతో ఫారం-బీ సమర్పించాలి.

57
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles