మోగిన నగారా...

Sun,April 21, 2019 12:25 AM

- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
- మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ
- 6,02,752 మంది ఓటర్లు
- మే 27న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాల వెల్లడి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నగారా మోగింది. అందరూ ఊహించినట్లే మూడు విడతలుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అచ్చంగా గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే షెడ్యూల్ విడుదలైంది. పంచాయతీ పోరు జరిగిన తీరులోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. బ్యాలెట్ రూపంలో రాజకీయ పార్టీల గుర్తులతో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. వరుసగా అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసిన జిల్లా ఎన్నికల యంత్రాంగం పరిషత్ పోరును కూడా అదే స్ఫూర్తితో విజయవంతంగా పూర్తి చేసేందుకు సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల పని విభజన ప్రక్రియ, శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయి. గతానికి భిన్నంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను మండల కేంద్రాల్లోనే స్వీకరించనున్నారు. ఎంపీటీసీల కోసం 96 మంది రిటర్నింగ్ అధికారులు, జడ్పీటీసీల కోసం 24 మంది రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తైంది. షెడ్యూల్ విడుదలవ్వడంతో ఈ నెల 22న తొలి విడత నామినేషన్లకు నోటిఫికేషన్ జారీ కావడంతో పాటుగా అదే రోజు నామినేషన్ల ఘట్టం ఆరంభం కానుంది.

మండలాల్లోనే నామినేషన్ల స్వీకరణ
మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎన్నికలు ఈసారి భిన్నంగా జరుగనున్నాయి. గతంలో నామినేషన్ల స్వీకరణ జిల్లా పరిషత్ కార్యాలయంలోనే కొనసాగేది. దూర భారాన్ని దృష్టిలో పెట్టుకుని మండల స్థాయిలోనే జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసేలా వెసులుబాటు కల్పించారు. దీని కోసం నామినేషన్ల స్వీకరణకు ప్రతీ మండలానికి ఒక రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. మూడు ఎంపీటీసీ స్థానాలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తున్నారు. జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 24 మంది రిటర్నింగ్ అధికారులు, 24 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పని చేయనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు 96 మంది రిటర్నింగ్ అధికారులు, 96 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు విధుల్లో ఉంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లాలో మూడు విడతలుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, జోనల్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది విషయంలో అవసరమైన ప్రతిపాదనల్ని పూర్తి చేశారు. మూడు విడతల్లో కలిపి జిల్లాలో దాదాపుగా 4,500 వేల మంది మంది ఉద్యోగుల సేవల్ని వినియోగించుకునే చర్యలు తీసుకుంటున్నారు. వీరే కాకుండా రక్షణ సిబ్బంది సహా ఇతర సహాయకుల విభాగంగా మరో మూడు వేల మంది వరకు అవసరమని అధికారులు గుర్తించారు.

ఈ ఎన్నికల్లో పాల్గొనబోయే ఓటర్లు 6,02,752 మంది
కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల్లోని 526 గ్రామ పంచాయతీ పరిధిలో నమోదైన పల్లె ఓటర్ల సంఖ్య భారీగానే నమోదైంది. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల జాబితాలను ఇప్పటికే ప్రచురించగా జిల్లా మొత్తం ఆరు లక్షల మంది ఓటర్లున్నట్లుగా స్పష్టమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనబోయే ఓటర్ల వివరాలు తాజా జాబితా ప్రకారం 6,02,752 మందిగా ఉన్నారు. ఈ మొత్తం గ్రామీణ ఓటర్లలో 2,91,203 మంది పురుషులున్నారు. అత్యధికంగా 3,11,517 మంది మహిళా ఓటర్లుండగా, 32 మంది ఓటర్లు ఇతరులున్నారు. మండలాల వారీగా వివరాలు పరిశీలిస్తే అత్యధికంగా మద్నూర్ మండలంలో 34 గ్రామ పంచాయతీల్లో 42,973 మంది ఓటర్లున్నారు. ఆ తర్వాత బిచ్కుందలో 38,540 మంది, భిక్కనూర్‌లో 37,129 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా పెద్ద కొడప్‌గల్‌లో 16,349 మంది, కామారెడ్డి మండలంలో 17,467 మంది, బీర్కూర్‌లో 18,738 మంది ఓటర్లున్నారు.

అమల్లోకి ఎన్నికల కోడ్
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. లోక్‌సభ ఫలితాల వరకూ కోడ్ ఉండగా అంతలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో మరో కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తానికి కోడ్ మీద కోడ్ అమల్లోకి రావడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆటంకం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ ఏడో తేదీనాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారుతో కోడ్ అమలై డిసెంబర్ 13 నాటికి ముగిసింది. సరిగ్గా నెల రోజులు కూడా కాకమునుపే జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలైంది. నూతన సంవత్సరం ఆరంభం నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసే దాకా కోడ్ కొనసాగగా... ఇంతలోనే మార్చి నెలలో సార్వత్రిక సమరంతో మరో సారి కోడ్ కూసింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో కోడ్ కొనసాగడం తప్పనిసరిగా మారింది. ఎన్నికల కోడ్ మే 27 వరకు అమల్లో ఉంటుంది.

68
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles