చావేనా పరిష్కారం..?

Sun,April 21, 2019 12:24 AM

మాచారెడ్డి : ఇంటర్ పరీక్ష తప్పినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలిచివేస్తున్నది. శుక్రవారం రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఉస్కె రుచిత ఆత్మహత్య చేసుకోగా.. శనివారం మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దేవసోత్ నీరజ(17) బలవన్మరణానికి పాల్పడింది. ఈ రెండు ఘటనలతో బాధిత కుటుంబాల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పరీక్షలో ఫెయిల్ అయితే ఆత్మహత్య పరిష్కారం కాదని, భవిష్యత్తుపై భరోసాతో ముందుకెళ్లాలని పలువురు విద్యావేత్తలు అంటున్నారు.

విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి
పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఎంత చదివినా పరీక్ష బాగా రాయలేకపోయామనే దిగులు వారిని వెంటాడుతున్నది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై భారీ అంచనాలు పెట్టుకోవడం, మంచి మార్కులు సాధించాలని ఒత్తిడి తేవడంతో పిల్లలు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. చదవండి.. లేదా చావండి.. అన్న ధోరణి విద్యార్థుల్లో భయోత్పానికి కారణమవుతున్నది. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.. ఏం తక్కువ చేశాం.. అడిగినవన్నీ ఇస్తున్నాం.. అంటూ వారిపై లేని బాధ్యత మోపుతున్నారు. మార్కులు, ర్యాంకులు అంటూ తల్లిదండ్రులు పిల్లల వెంటపడుతున్నారు. పిల్లలు ఏమి ఆశిస్తున్నారో పెద్దలు గుర్తించలేకపోతున్నారు. పిల్లల ఆలోచనలకు విలువ ఇవ్వడంలేదు.

హరించుకు పోతున్న స్వేచ్ఛ
పరీక్షలు దగ్గర పడుతున్నా కొద్దీ పిల్లల కట్టడి మొదలవుతున్నది. ఎప్పుడూ చదువూ.. చదువూ.. అంటూ పిల్లలకు తీ రికలేకుండా చేస్తున్నారు. కనీసం ఒక గంట ఆడుకునే అవకాశం సైతం ఇవ్వడంలేదు. టీవీ చూసినా.. స్నేహితులతో బ యటకు వెళ్లినా.. ఆటలు ఆడినా.. కాపు కాసి వారిని కట్టి ప డేస్తున్నారు. పిల్లల స్వేచ్ఛను హరిస్తున్నారు. స్కూల్, కాలేజీ నుంచి వచ్చీ రాగానే ట్యూషన్లు అంటూ రాత్రి 9, 10 గంటల వరకు పిల్లలు ఇంటి ముఖం చూడడం లేదు. అలా వచ్చి ఇలా బెడ్‌పై వాలిపోగానే తెల్లారిపోతుంది. మళ్లీ ఉదయం నుంచి స్కూల్, కాలేజీకి వెళ్లే హడావుడి. దీంతో పిల్లలకు తీరిక లేకుండా అవుతున్నది.

ఆత్మహత్యకు దారితీస్తున్న అతినమ్మకం
పిల్లలపై అతినమ్మకంతో ర్యాంకులు, మార్కులు బాగా తెచ్చుకోవాలని తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. పెద్దల అతినమ్మకంతో పిల్లలు డిప్రెషన్‌లోకి వెళ్లేలా చేస్తున్నది. ఆశించిన మార్కులు రాకున్నా, ఫెయిల్ అయినా పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నామన్న ఆందోళనకు గురైన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

పిల్లల్లో మానసిక ైస్థెర్యం నింపాలి
ఓడిపోతే కుంగిపోకుండా పిల్లల్లో మానసిక ైస్థెర్యాన్ని నింపాల్సిన అవసరం ఉన్నది. వారిలో మానసిక దృఢత్వాన్ని పెంపొందించాలి. ఒత్తిడిని తట్టుకునేలా నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. రోజులో కొంతసేపైనా పిల్లలతో గడపాలి. అప్పుడే నీకు మేమున్నాం.. అన్న భరోసా పిల్లల్లో ఏర్పడుతుంది. చదువులో రాణించకపోయినా ఉన్నతస్థాయికి ఎదిగిన వారి విజయగాథలను పిల్లలకు వివరించాలి. పిల్లల ముందు ర్యాంకులు, మార్కులు అన్న ప్రస్థావనే తీసుకు రావొద్దు. అవే విజయానికి కొలమానం అన్నట్లు చూడకూడదు. ప్రతిభను మార్కులతో పోల్చొద్దు. తల్లిదండ్రులు సైతం తమ పంథాను వీడి పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది.

131
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles