30 గుంటల భూమి మాయం!

Sat,April 20, 2019 12:00 AM

- ఏమైందని అడిగితే సమాధానం చెప్పరు
- న్యాయం చేయాలని ఫిర్యాదు ఇస్తే పరిష్కారం చూపరు
- దోమకొండ మండలం అంచనూర్‌లో ఓ రైతు కుటుంబం ఆవేదన
- రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్న సామాన్యులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి సన్నకారు రైతు కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నది. ఎవరి జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసుకుంటున్న వారికి అనుకోని ఉపద్రవం మీద పడడంతో ఏడాది కాలంగా తంటాలు పడుతున్నారు. ఎండనక, వాననక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమకు జీవనాధారమైన భూమిపై హక్కులు తీసేయడంతో దిక్కుతోచక ఆగమాగం అవుతున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వందల సార్లు వెళ్లి తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. కనీసం ఫిర్యాదునైనా తీసుకోవాలని కోరారు. కానీ, అక్కడ ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలే కరువు. చేసేది లేక అధికారుల నిర్లక్ష్యంపై ఏడాదిగా ఆ కుటుంబం రోడ్డెక్కి న్యాయం కోరుతూనే ఉంది. అయినప్పటికీ చలనం లేకపోవడంతో బాధిత కుటుంబం నమస్తే తెలంగాణ ధర్మగంటను ఆశ్రయించింది. అధికారుల తీరుతో తాము ఏ విధంగా నష్టపోతున్నది సవివరంగా వివరించారు.

30 గుంటల భూమి మాయం
బైకరి లింగయ్యకు అంచునూర్ గ్రామంలో సర్వే నెంబర్లు 66/12/2లో 30 గుంటలు, 66/15/బి లో ఒక ఎకరం భూమి ఉంది. పాత పట్టాదారు పాసుపుస్తకంలో మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పాస్‌బుక్కుల్లోనూ 2018, జూన్ 19న లింగయ్య పేరిట 1.30 ఎకరాలుగా నమోదైంది. సర్కారు అందించిన తొలి విడత పంట పెట్టుబడి సాయం కింద బైకరి లింగయ్యకు తన వ్యవసాయ సాగు భూమి విస్తీర్ణాన్ని అనుసరించి రూ.7వేలకు చెక్కు మంజూరు అయ్యింది. తిరిగి యాసంగి సీజన్‌కు రూ.7 వేలు బదులుగా కేవలం రూ.4వేలు మాత్రమే నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమయ్యాయి. కొద్ది రోజులకు రైతుబంధు సాయం వివరాలను బ్యాంకులో సరి చూసుకోగా రూ.4వేలు పడడంపై అనుమానం కలిగింది. ఏం చేయాలో తెలియక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి బైకరి లింగయ్య ఆయన కొడుకు బైకరి రాజేశ్ వాకబు చేశారు. ఆన్‌లైన్ రికార్డుల్లో ఒక ఎకరమే నమోదై ఉన్నట్లుగా అధికారులు చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. ఇదేంటని అడిగితే ఎవ్వరూ సరిగా సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. ఫిర్యాదు ఇస్తామంటే తీసుకోరు. ఇలా ఆరు నెలల నుంచి తన 30 గుంటల భూమిపై పోరాటం చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ఇంత వరకు తహసీల్దార్ నుంచి గ్రామ రెవెన్యూ అధికారి వరకూ బైకరి లింగయ్య సమస్యను పరిష్కరించనే లేదు. తన పేరిట ఉన్న 1.30 ఎకరాల భూమిని తానే సాగు చేసుకుంటున్నప్పటికీ రికార్డుల్లో మాత్రం భూమి వివరాలు తక్కువ చేసి చూపడంతో రైతు కుటుంబం ఆందోళనకు గురవుతున్నది.

ఎవరూ స్పందించడం లేదు...
భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో నా తండ్రి పేరిట ఉన్న 1.30 ఎకరాల భూమి తక్కువగా చూపారు. పట్టాదారు పాస్‌బుక్కులో మాత్రం వివరాలు సరిగానే ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో తప్పుడు లెక్కలు చూపారు. ఫలితంగా రైతుబంధు డబ్బులు రూ.4 వేలు మాత్రమే వచ్చాయి. ఇదేంటని అడిగితే ఎవరూ స్పందించడం లేదు. ఆరు నెలల నుంచి తిరుగుతున్నాము. నేను హైదరాబాద్‌లో ప్రైవేటు జాబ్ చేసుకుంటాను. లీవులు పెట్టి మరీ ఊరికి వస్తే ఇక్కడ పని కావడం లేదు.
- బైకరి రాజేశ్, రైతు లింగయ్య కొడుకు

సామాన్య రైతు కుటుంబానికి తిప్పలు
రైతులకు ఏ పాపం తెల్వదు. రెవెన్యూ చట్టాలంటే అవగాహన ఉండదు. వాళ్లకు తెలిసిందల్లా తెల్లారితే పొలానికెళ్లి పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడమే. అయితే ఇల్లు లేకపోతే పొలమే వారికి సర్వస్వం. అలాంటి రైతు కుటుంబాలకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నానా తంటాలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. దోమకొండ మండలంలోని అంచునూర్ గ్రామంలో బైకరి లింగయ్య అనే రైతుకు ఖాతా నెంబర్ 324లో 1.30 ఎకరాల సాగు భూమి ఉంది. ఇదే భూమిని నమ్ముకుని సదరు రైతు దశాబ్దాలుగా జీవిస్తున్నాడు. ఎకరన్నర భూమిపై వచ్చే ఆదాయంపైనే కుటుంబాన్ని వెళ్లదీస్తున్న వీరికి తహసీల్దార్ కార్యాలయంలోని కొంత మంది పెద్దల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర మనోవేదనకు గురి కావాల్సి వస్తున్నది. రెండేళ్ల కిందటి వరకూ పట్టాదారు పాసుపుస్తకంలో రికాైర్డెన ఒక ఎకరం 30 గుంటల భూమితో జీవిస్తోన్న బైకరి లింగయ్యకు భూ రికార్డుల ప్రక్షాళనలో గ్రామ రెవెన్యూ అధికారి వ్యవహరించిన తీరుతో సాగు భూమి విస్తీర్ణం ఒక ఎకరానికి కుదించించారు. ఇలా ఎందుకు జరిగిందో తెలియక, ఎవరు చేశారో అర్థం కాక ఆరు నెలల నుంచి బైకరి లింగయ్య కుటుంబం ఇబ్బందులకు గురవుతున్నది. అధికారులను కలిసినా ఫలితం లేకపోవడంతో విసిగి వేసారిపోతున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి...
మొదటి విడత రైతుబంధు రూ.7 వేలు వచ్చాయి. రెండో విడతలో రూ.4 వేలు మాత్రమే వేశారు. దీంతో నాకు అనుమానం కలిగింది. ఇదేంటని అడిగితే తప్పులు పడ్డాయంటున్నారు కానీ పరిష్కారం చూపడం లేదు. మా సమస్యను వినే వారు లేకుండా పోయారు. తహసీల్దార్ ఆఫీస్‌కు చాలా సార్లు పోయాను. వీఆర్వోను చాలా సార్లు కలిశాను. మా పట్ల ఉన్నతాధికారులు సానుభూతితో స్పందించి సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాము.
- బైకరి లింగయ్య, రైతు, అంచునూరు

76
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles