రథోత్సవంలో అపశ్రుతి లారీ ఢీకొని బాలుడు మృతి

Fri,April 19, 2019 11:58 PM

ఎల్లారెడ్డి రూరల్: మండల కేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. రథోత్సవం చూడడానికి వచ్చిన బాలుడిని లారీ ఢీకొనడంతో బాలుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం కొత్తాబాది గ్రామానికి చెందిన రొడ్డ రంజిత్ కుమార్, అతని భార్య నిర్మల, కుమారుడు రోహిత్(4)తో కలిసి రామనవమి పండుగకు అత్తగారిైల్లెన ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట్ గ్రామానికి వచ్చాడు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా గురువారం రాత్రి ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో నిర్వహించిన రథోత్సవం చూడడానికి రంజిత్, నిర్మల, రోహిత్, రోహిత్‌కు అత్తవరుస అయిన మరో మహిళతో కలిసి ఎల్లారెడ్డి రామాలయానికి వచ్చారు. రథోత్సవం జరుగుతున్న సమయంలో శుక్రవారం తెల్లవారు జామున రామాలయానికి కొంత దూరంలో ఉన్న దర్గా వద్ద నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనంపై చిన్నారి రోహిత్‌ను కూర్చుండబెట్టి రోహిత్ అత్తవరుస అయిన మహిళ రథోత్సవాన్ని చూస్తున్నది. రథోత్సవం కారణంగా ఎల్లారెడ్డి-బోధన్ ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేసే క్రమంలో వాహనాలు వరుసగా రథాన్ని దాటుకుంటూ వెళ్తున్నాయి. ఢిల్లీ నుంచి చెన్నైకి లోడుతో వెళ్తున్న పంజాబ్‌కు చెందిన ట్రక్ రోడ్డు పక్కనే ఆగి ఉన్న ద్విచక్ర వాహనానికి తగలడంతో బైక్ కిందపడిపోయింది. వాహనంపై కూర్చున్న బాలుడు సైతం ఒక్కసారిగా లారీ కింద పడ్డాడు.

అప్రమత్తమైన బాలుడి అత్త లారీ కిందినుంచి బాలున్ని లాగే ప్రయత్నం చేసేలోపే బాలుడిపై నుంచి లారీ వెళ్లడంతో బాలుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేశారు. మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మృతదేహంతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. బాలుడిని ఢీకొన్న లారీని పోలీసులు ఎల్లారెడ్డి గాంధీచౌక్ వద్ద పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆందోళన చేస్తున్న బాలుడి కుటుంబ సభ్యులను ఎస్సై కమలాకర్, కుమారరాజాలు సముదాయించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. దీంతో బాలుని ఆందోళన విరమించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

57
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles