దళిత రైతుకు ముప్పుతిప్పలు

Fri,April 19, 2019 02:30 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. పంట పెట్టుబడికి ఇక్కట్లు లేకుండా చూసేందుకు ప్రభుత్వమే పంటకు ఆర్థిక సాయం చేయడమే దీని ముఖ్యోద్దేశం. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న, చిన్న, మధ్య తరహా రైతులెందరికో మేలు చేకూరింది. ఈ పథకం అమల్లోకి వచ్చి ఏడాది గడుస్తోంది. రెండు పంట కాలాలకు ఇప్పటికే ఎకరాకు రూ.10 వేలు చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో జమైంది. అయితే, ఈ ప్రక్రియలో కొంత మంది రైతులకు ఏడాది గడుస్తున్నా పట్టా పాసుబుక్కులు ఇంత వరకూ మంజూరు కాలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే తహసీల్ కార్యాలయంలో జవాబే కరువైంది. మండల స్థాయి అధికారిని కలిసి విన్నవిస్తే గ్రామ రెవెన్యూ అధికారిని కలవమంటారు. వీఆర్వోను కలిస్తే తహసీల్దార్‌ను కలవమంటారే కానీ సమస్యను పరిష్కరించే పరిస్థితి కానరావడం లేదు. మాచారెడ్డి మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన ఓ దళిత రైతు దీన పరిస్థితిపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.

ఏడాదిగా తిప్పలు...
పాస్‌బుక్కులు చేతికి అందకపోవడంతో రెండింటికీ చెడ్డ రేవడు అన్నట్లుగా రైతుల పరిస్థితి తయారైంది. దశాబ్దాల కాలం నుంచి భూమిని నమ్ముకుని బతుకున్న కుటుంబాలకు కొంత మంది రెవెన్యూ అధికారుల తీరుతో తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. ఓ వైపు తనకు రావాల్సిన హక్కు పత్రాల కోసం పోరాటం చేయడం మూలంగా విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. అనవసరపు వ్యయ భారంతో చితికి పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. మాచారెడ్డి మండలంలోని అంతంపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు ఎర్ర బాల నర్సయ్యకు వారసత్వంగా గ్రామంలోనే ఎకరన్నర వ్యవసాయ భూమి సంక్రమించింది. తన తండ్రి సాగు చేస్తున్న కాలం నుంచి ఇదే పంట భూమిపై రుణాలు మంజూరయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోనూ పంట రుణ మాఫీ సైతం జరిగింది. ప్రస్తుతం కాస్తులో సైతం బాల నర్సయ్యనే ఉన్నప్పటికీ తెలంగాణ సర్కారు జారీ చేసిన కొత్త పట్టాదారు పాస్‌బుక్కులు నేటికీ మంజూరు కావడం లేదు. ఇదేంటని అడిగితే తహసీల్ కార్యాలయ అధికారులు కనీసం జవాబిచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా ఆ దళిత రైతు చెప్పులు అరిగేలా తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

ప్రొసీడింగ్స్ జారీ చేసినా...
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర బాలయ్యకు ముగ్గురు కొడుకులు. వీరికి వారసత్వం కింద తన ఆస్తిని వారసులకు పంచి ఇచ్చాడు. ఇందులో ముగ్గురు కుమారులకు సమానంగా భూములు విభజించగా పెద్ద కొడుకు బాల నర్సయ్యకు సర్వే నెంబర్లు 72/38, 72/39, 72/49ఎ, 72/53ఎ, 69, 70/ఎ లలో గల 1.32 ఎకరాల భూమి వర్తించింది. తన ఇద్దరు సోదరులకు ఎలాంటి వివాదాలు లేకుండానే తెలంగాణ సర్కారు జారీ చేసిన పాస్ బుక్కులు మంజూరు అయ్యాయి. కానీ, బాల నర్సయ్యకు మాత్రం పాస్‌బుక్కు రాకపోవడంతో ఏడాది కాలంగా రైతుబంధు, రైతుబీమా పథకాలకు అనర్హుడిగా నమోదు అవుతున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే అధికారుల నుంచి కనీసం స్పందన రాలేదు. గతంలో ఇక్కడే తహసీల్దార్‌గా పనిచేసి ఈ మధ్యే సస్పెన్షన్‌కు గురైన శ్యామల అనే అధికారిణి బాలనర్సయ్య పేరిట ఫిబ్రవరి 24, 2018న ప్రొసీడింగ్స్ ఆర్డర్ జారీ చేసినప్పటికీ గ్రామ రెవెన్యూ అధికారి పహాణీలో ఎంట్రీ చేయాల్సి ఉండగా కనీసం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఈ దళిత రైతు సమస్య ఇంత వరకూ పరిష్కారం కాకపోగా చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

జేసీ ఆదేశాలు బేఖాతరు...
తనకు జరిగిన అన్యాయంపై అంతంపల్లికి చెందిన దళిత రైతు ఎర్ర బాలనర్సయ్య మండల కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి వేసారి ఉన్నతాధికారులను సైతం కలిశారు. గతేడాది అక్టోబర్ 19న, ఈ ఏడాది జనవరి 30న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు, జేసీకి ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. 2019, ఫిబ్రవరి 15న కామారెడ్డి ఆర్డీవోకు జిల్లా సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించగా ఇప్పటికీ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. జేసీ ఆదేశాలు సైతం అమలు కాకపోవడంతో పాటుగా మండల స్థాయిలో తహసీల్దార్, వీఆర్వోలు స్పందిస్తోన్న తీరుపై రైతు బాల నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రైతులను చిన్నచూపు చూస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.

మానసిక క్షోభకు గురవుతున్నా...
మా తండ్రి నుంచి సంక్రిమించిన వారసత్వ భూమిపై నాకు పట్టాదారు పాస్‌బుక్కులు మంజూరు చేయడం లేదు. ఇదేంటని అడిగితే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తహసీల్దార్ కార్యాలయానికి వందల సార్లు తిరిగినాను. స్పందన లేకపోవడంతో కలెక్టరేట్‌కు కూడా పోయినాను. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. రైతులంటే అధికారులు చులకనగా చూస్తున్నారు. తహసీల్దార్, వీఆర్వోలు సరైన జావాబు ఇవ్వడం లేదు. వీరి నిర్లక్ష్యం మూలంగా ఏడాది కాలంగా రుణాలకు అర్హత సాధించలేక పోతున్నాను. పైగా సీఎం కేసీఆర్ తీసుకు వచ్చిన రైతుబంధు, రైతు బీమా వర్తించడం లేదు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నా సొంత భూమి ప్రస్తుతం నా కాస్తులోనే ఉంది. అయినప్పటికీ పాస్ బుక్కులు ఇవ్వరేందని అడిగితే సరైన సమాధానం రావడం లేదు.
- ఎర్ర బాల నర్సయ్య, బాధిత దళిత రైతు

విచారణ చేస్తున్నాము...
ఈ విషయం మా దృష్టికి వచ్చింది. సమగ్ర విచారణకు గాను స్థానిక వీఆర్వోను నియమించాను. ప్రస్తుతం విచారణ జరుగుతున్నది. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాము.
- నర్సింహులు, తహసీల్దార్, మాచారెడ్డి

65
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles