టార్గెట్.. పరిషత్ !

Thu,April 18, 2019 12:11 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు జెండాను మరోమారు ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీ సిద్ధం అవుతోంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు, పంచాయతీ పోరు, పార్లమెంట్ ఎన్నికల్లాగా పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు గులాబీ దళం కదులుతోంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తదనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌లు వరుసగా పార్టీ లీడర్లతో వరుసగా భేటీ అయ్యారు. జిల్లాల్లో జడ్పీ పీఠాలను కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపైనా సలహాలు, సూచనలు చేస్తూనే వీటి బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఇలా వ్యూహాత్మకంగా పకడ్బందీ కార్యాచరణతో గులాబీ పార్టీ సత్తా చాటేందుకు దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం రెండు రోజుల్లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా నేడు హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్ల సమావేశం సైతం నిర్వహిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నేడు కలెక్టర్ల సమావేశం
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. సిబ్బందికి ఈ నెల 15, 16 తేదీల్లో శిక్షణ కార్యక్రమాలు సైతం పూర్తి చేశారు. త్వరలో పదవీ కాలం ముగుస్తున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలుపడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటనకు సిద్ధం అవుతోంది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని సర్కారు ప్రతిపాదించిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే తేదీలను ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగానే గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి నేతృత్వంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం జరుగనుంది. ఇందులో జిల్లా ఎన్నికల అధికారులకు పలు సలహాలు, సూచనలు చేయనున్నారు. సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే పరిషత్ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య పెరగడం మూలంగా పోలింగ్ బూత్‌లు సైతం పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషనర్ సూచనలు చేసే వీలుంది.

గెలుపు గుర్రాల కోసం వేట
అతి త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందన్న సమాచారంతో శాసనసభ్యులంతా గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు. జిల్లాలో జడ్పీటీసీల జాబితా సిద్ధం చేశాక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఒకసారి పరిశీలించాకే టికెట్ల ఖరారు ఉండే అవకాశం ఉంటుంది. టీఆర్‌ఎస్ తరపున జడ్పీ చైర్మన్ల పోటీలో ఎవరుంటారనేది కూడా ముందే నిర్ణయించి జాబితా సిద్ధం చేసే అవకాశం ఉంది. పార్టీలో చాన్నాళ్ల నుంచి పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు కల్పిస్తే, అసంతృప్తుల బెడద తగ్గించుకోవచ్చని భావిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు జడ్పీ పీఠాల కోసం జిల్లాలో కీలక నేతలు ఎదురు చూస్తున్నారు. బీసీ మహిళకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రిజర్వ్ కావడంతో కీలక నేతల భార్యలే రంగంలోకి దిగే వీలుంది. గెలుపు ఉత్సాహంతో ఉన్న టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టడానికి ప్రతిపక్షల పార్టీలు భయపడుతున్నారు. మండలాల్లో క్యాడర్ లేకపోవడంతో పాటుగా ప్రజల మద్దతు సైతం అంతంత మాత్రంగానే ఉన్నట్లుగా మొన్నటి ఫలితాలే తేలడంతో ఈ రెండు జాతీయ పార్టీలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామమాత్రపు పోటీతోనే సరిపెట్టబోతున్నాయి.

గులాబీ వ్యూహం...
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి దృష్టి కేంద్రీకరించింది. కామారెడ్డి జిల్లా పరిషత్ స్థానాల్లో గెలుపుతో పాటుగా జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ సిద్ధం అవుతోంది. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో టీఆర్‌ఎస్ నేతలు ఈ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఇటీవల సమావేశం కాగా ఆ తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ సైతం సోమవారమే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యత్వానికి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత మంత్రుల ఆమోదంతో ఇరువురు కలిసి అన్ని స్థానాలు గెలుచు కోవడమే కాకుండా జడ్పీ చైర్మన్, ఎంపీపీ స్థానాలు కైవసం

చేసుకోవాలని ఆదేశించారు. అందరికీ ఆమోదయోగ్యంగా, గెలుపు అవకాశాలున్న వ్యక్తులకే చోటు ఇవ్వాలని సూచించారు. ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జిలను నియమించడంతో వారితో ఎమ్మెల్యేలు చర్చించి తుది నిర్ణయం తీసుకునే వీలుంది. గెలుపు బాధ్యతలు ఎక్కువ శాతం ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకం కావడంతో వారిపైనే బాధ్యత ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

73
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles