ఇదేం బ్రీత్ ఎనలైజర్

Tue,April 16, 2019 01:25 AM

పాత బాన్సువాడ : బాన్సువాడ ఆర్టీసీ డిపోలో బ్రీత్ ఎనలైజర్ సక్రమంగా పనిచేయడం లేదంటూ డిపో కార్మికులు సోమవారం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. నిజాంసాగర్ మండలం సుల్తాన్‌నగర్ గ్రామానికి చెందిన షర్ఫొద్దీన్ బాన్సువాడ ఆర్టీసీ డిపోలో 13 సంవత్సరాలుగా డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ విధులకు వచ్చినట్లుగానే సోమవారం రాగా... సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించారు. ఆల్కహాల్ 4 శాతంగా నమోదైందని సిబ్బంది తెలిపి డ్యూటీని అడ్డుకోవడంతో అతను అవాక్కయ్యాడు. తాను చిన్నప్పటి నుంచి మాంసం తినడం, మద్యం తాగడం అలవాటు లేదని ఆల్కహాల్ శాతం ఎలా నమోదైందని సెక్యూరిటీని ప్రశ్నించాడు. వారు సమాధానం ఇవ్వకపోడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వారి వద్ద ఉన్న బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించగా జీరోగా చూపింది. దీంతో తోటి కార్మికులతో కలిసి డిపో ఎదుట ధర్నాకు దిగారు. యాజమాన్యం కార్మికులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. డీఎం సాయన్నతో ఫోన్‌లో మాట్లాడగా 4 శాతం అంత ప్రామాణికం కాదని, తాను విధులకు వచ్చాక డ్యూటీ విషయం మాట్లాడుదామని పేర్కొన్నారు. విధులకు అనుమతి ఇవ్వకపోవడంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఒక్కొక్కరుగా విధులకు వస్తున్న కార్మికులు ఉదయం 5.30 గంటల నుంచి డిపో ముందు బైఠాయించారు.

కార్మికులతో మాట్లాడని డీఎం
నిబంధన ప్రకారమే తాము నడుచుకుంటామని కార్మికులు నిరసన మాని విధులకు హాజరు కావాలని డీఎం సాయన్న కోరగా కార్మికులు ససేమిరా అంటూ బైఠాయించారు. షర్ఫొద్దీన్‌ను, ఇప్పటివరకు బ్రీత్ ఎనలైజర్ తప్పుడు రిపోర్టుతో సస్పెన్షన్‌కు గురైన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తానని డీఎం అన్నారు. సస్పెన్షన్‌కు గురైన వారి విషయం డీవీఎం, ఆర్‌ఎం దృష్టిలో ఉందని ఉన్నతాధికారులు తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. డిపోలోని బ్రీత్ ఎనలైజర్‌ను మారుస్తామని హామీ ఇచ్చారు. షర్ఫొద్దీన్‌ను విధులకు తీసుకుంటామని తెలపడంతో కార్మికులు ఆందోళన విరమించగా బస్సులు రోడ్డెక్కాయి. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి మల్లయ్య, టీఎంయూ డిపో కార్యదర్శి గిరిధర్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు సాజిద్, యూసుఫ్ పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles