కొంగొత్తగా !

Mon,April 15, 2019 12:48 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో గ్రామాల్లో పరిపాలన కొంగొత్త రీతుల్లో కొనసాగనుంది. కొత్త జీపీల ఆవిర్భావం, నూతనంగా ఏర్పడిన పంచాయతీ పాలకవర్గాలతో సందడిగా మారిన గ్రామ పంచాయతీలకు 436 మంది గ్రామ కార్యదర్శుల నియామకంతో పరిపాలన వేగం పుంజుకోనుంది. దశాబ్ద కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం కనుగొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల్లో కొత్త కాంతులు నింపేందుకు చర్యలు తీసుకున్నారు. ముందుగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకు వచ్చారు. ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను నియమించారు. ఆ వెంటనే ఖాళీగా ఉన్నటువంటి వేలాది సంఖ్యలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేశారు. గడిచిన కొద్ది కాలంలోనే పల్లె పరిపాలనపై సర్కారు పెట్టిన కృషితో గ్రామ స్థాయిలో పరిపాలనకు ఉత్తమమైన బాట ఏర్పడింది. ఇటు సర్పంచ్, అటు సెక్రటరీలతో పాత, కొత్త గ్రామ పంచాయతీలన్నీ నిండు కుండలా తొణికిసలాడుతున్నాయి.

ఇద్దరూ కీలకమే
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు ఇద్దరూ కీలకమే. దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమల్లో సమస్యల పరిష్కారం వీరిపైనే ఆధారపడి ఉంటుంది. ఇన్నాళ్లు కార్యదర్శుల కొరత కారణంగా గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేని దుస్థితి ఉండేంది. ఒక్కో కార్యదర్శికి పలు గ్రామాలకు బాధ్యతలుండడంతో సమస్యలు సకాలంలో పరిష్కారానికి నోచుకోలేదు. మరోవైపు జీపీలు సైతం విస్తీర్ణంలో పెద్దగా ఉండేవి. జిల్లాలో ఇది వరకు 323 పంచాయతీల్లో సగం గ్రామాలకే కార్యదర్శులు ఉండేవారు. వీరిలో ఒక్కో కార్యదర్శికి నాలుగైదు పంచాయతీల బాధ్యతలను చూసేవారు. ఫలితంగా ప్రజలకు అనుకున్నంత స్థాయిలో న్యాయం జరిగేది కాదు. జీపీల ఏర్పాటు, కార్యదర్శుల కొరతను రాష్ట్ర సర్కారు తీర్చడంతో ప్రస్తుతం పల్లెల్లో కొంగొత్త వాతావరణం ఏర్పడింది. 526 గ్రామ పంచాయతీల్లో 525 చోట్ల కొలువు దీరిన పాలకవర్గాలకు తోడుగా 436 మంది కార్యదర్శుల నియామకంతో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా 214 నూతన గ్రామ పంచాయతీల్లో జోష్ మరింతగా పెరిగింది.

మారిన భౌగోళిక పరిస్థితులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 36 మండలాలుండేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కామారెడ్డి జిల్లా 22 మండలాలతో ఆవిర్భవించింది. నస్రుల్లాబాద్, పెద్దకొడప్‌గల్, బీబీపేట్, రామారెడ్డి, రాజంపేట్ మండలాలు జనాభా ప్రాతిపదికన ఉద్భవించాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు అత్యధికంగా 59,002 మంది జనాభాతో మద్నూర్ తొలి స్థానంలో, 51,480 మంది జనాభాతో గాంధారి రెండో స్థానంలో, 50,458 మంది జనాభాతో బిచ్కుంద మూడో స్థానంలో ఉంది. ఇక గ్రామ పంచాయతీల పరంగా పరిశీలిస్తే మొదటి వరుసలో 23 గ్రామ పంచాయతీలతో మద్నూర్, 21 గ్రామ పంచాయతీలతో బిచ్కుంద, 19 గ్రామ పంచాయతీలతో జుక్కల్, సదాశివనగర్ మండలాలు నిలిచాయి.

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం - 2018 ప్రకారం జిల్లా వ్యాప్తంగా 214 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇందులో అత్యధికంగా గిరిజన జనాభా ఎక్కువగా విస్తరించిన గాంధారి, లింగంపేట, పెద్దకొడప్‌గల్, పిట్లం, రాజంపేట, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌లో పదికి పైగా గ్రామ పంచాయతీలు పురుడు పోసుకోవడం విశేషం. అత్యధికంగా జీపీలు ఏర్పడిన మండలాల్లో మొదటి మూడు స్థానాల్లో గాంధారి అత్యధికంగా 28, లింగంపేట 25, పెద్ద కొడప్‌గల్ 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతంలో 323 గ్రామ పంచాయతీల్లో 3306 వార్డులుండగా, 214 కొత్త పంచాయతీల ఏర్పాటుతో జిల్లాలో అదనంగా 1336 వార్డులు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు జిల్లాలో 526 గ్రామ పంచాయతీల్లో 4642 వార్డులు అందుబాటులోకి వచ్చాయి.

79
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles