పరిషత్ ఎన్నికలు మూడు విడతల్లో !

Sun,April 14, 2019 01:28 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అచ్చంగా గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఏర్పాట్లు చేసేందుకు సిద్ధం అవుతున్నది. బ్యాలెట్ ఆధారంగానే నిర్వహించే ఈ ఎన్నికల్లో పార్టీల గుర్తులతో పాటుగా స్వతంత్రులకు ఇతర గుర్తులను కేటాయించనున్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఇప్పటికే జిల్లా అధికారులకు అనుమతులు రావడంతో జిల్లా స్థాయిలోనే బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ఆర్డర్లు సైతం ఇచ్చేశారు. మూడు విడతల్లో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ తేదీలు మే 6, 10, 14న ఉండే అవకాశాలున్నాయి.

మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికలకు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల మాదిరిగానే పార్టీ గుర్తులతో పాటుగా ఇతరత్రా గుర్తులను కేటాయించబోతున్నారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నందున బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్యను బట్టి అధికారులు స్థానికంగానే ముద్రించనున్నారు.

పంచాయతీ ఎన్నికల మాదిరిగానే...
జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పరిషత్ పోరును మూడు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి నిర్ణయించడంతో అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ, జిల్లా పరిషత్ అధికార యంత్రాంగం ఈ ఏర్పాట్లలో తలమునకలైంది. ఇప్పటికే రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై స్పష్టతకు వచ్చిన అధికారులు తాజాగా ఎన్నికల నిర్వహణలో పాల్గొనే వారికి డ్యూటీలు వేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికారులు, ఎన్నికల సిబ్బందికి ఈ నెల 15, 16 తేదీల్లో శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుసగా వస్తున్న ఓట్ల పండుగతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎమ్మెల్యే ఎన్నికలను సక్సెస్ చేసినట్లుగానే జిల్లా ఎన్నికల యంత్రాంగం గ్రామ పంచాయతీ, ఎంపీ ఎన్నికలను శాంతియుతంగా పూర్తి చేసింది. అదే స్ఫూర్తితో పరిషత్ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది సిద్ధం అవుతున్నారు.

జిల్లాలోనే బ్యాలెట్ పేపర్ ముద్రణ...
గతంలో మాదిరిగానే పార్టీ గుర్తులపై బ్యాలెట్ ద్వారానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ స్థానాలకు గులాబీ రంగు, జడ్పీటీసీ స్థానాలకు తెలుపు బ్యాలెట్ పేపర్లను ఏర్పాటు చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య ఆధారంగా చేసుకుని బ్యాలెట్ పేపర్లు ముద్రిస్తారు. జిల్లా స్థాయిలోనే బ్యాలెట్ పేపర్లను ముద్రించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే ఆయా పార్టీల గుర్తులతోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ సమరం నిర్వహించబోతున్నారు. ఈవీఎం స్థానంలో బ్యాలెట్ పేపర్‌తో ఎన్నిక జరుగుతుంది. గతంలో జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వీకరించే వారు. ఈసారి ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ నామినేషన్లను మండల కేంద్రాల్లోనే స్వీకరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటి కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో వేర్వేరుగా ఎన్నికల అధికారులను నియమించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో 236 ఎంపీటీసీ స్థానాలకు 96 మంది రిటర్నింగ్ అధికారులను, 22 జడ్పీటీసీ స్థానాలకు గాను 24 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు.

మే 6, 10, 14న పోలింగ్...?
పార్లమెంట్ ఎన్నికల పర్వం ఇలా ముగిసిందో లేదో రాష్ట్రంలో మరో మారు ఓట్ల పండుగకు సన్నాహకాలు మొదలవుతున్నాయి. త్వరలో పదవీ కాలం ముగుస్తున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలుపడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటనకు సిద్ధం అవుతున్నది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని సర్కారు ప్రతిపాదించిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే తేదీలను ఖరారు చేస్తున్నారు. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 22న, రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 26న, తుది విడత నామినేషన్లు ఏప్రిల్ 30న ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణకు సమయం ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విత్ డ్రాలు పూర్తయ్యాక మే 6, 10, 14న దశల వారీగా ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లుగా తెలిసింది. వీటి ఫలితాలు మాత్రం భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు లోక్‌సభ ఫలితాల అనంతరమే వెలువడనున్నాయి.

102
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles