ప్రయోగాత్మకంగా.. తొలిసారిగా..!

Mon,March 25, 2019 12:40 AM

- పోస్టల్ బ్యాలెట్‌కు చెల్లు చీటీ
- ఈవీఎం ద్వారా నేరుగా ఓటు వేయనున్న ఎన్నికల సిబ్బంది
- విధుల్లో పాల్గొనేవారికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ: పది హేను సంవత్సరాలుగా ఈవీఎంలలో ఓటు వేసే భాగ్యం లేని ఉద్యోగులకు ఈ సారి తాము పనిచేసే పోలింగ్ కేంద్రంలోనే ఈవీఎం ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే వారు. మారిన పరిస్థితులు, కేవలం పార్లమెంటుకు మాత్రమే ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ద్వారా వారు పనిచేసే పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పించారు.

వందలాది మంది ఉద్యోగులు గతంలో పోస్టల్ బ్యాలెట్ తీసుకొని ఎన్నికలకు ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వారు. దీనికి భిన్నంగా ఏప్రిల్ 11న జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఉద్యోగులు అందరూ అక్కడే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

ఇక బహిరంగ ఓటింగ్ లేనట్లే
బ్యాలెట్ ఓట్లు ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని పార్టీల నాయకులు ఉద్యోగులపై ఒత్తిడి చేసి వారికి అనుకూలంగా ఓటు వేయించుకునే వారు. ఇప్పుడు ఉద్యోగులు సైతం ఈవీఎంలలో ఓటు వేసే అవకాశం ఉండడంతో ఉద్యోగులపై ఒత్తిడికి అవకాశం లేదు. కొంత మంది ఉద్యోగులు రాజకీయ నాయకుల మెప్పు కోసం బహిరంగంగా ఓటు వేసే వారు ఇప్పుడు వారికి అలాంటి చాన్స్‌లు ఉండవు. బ్యాలెట్ ఓట్లు ఉన్నప్పుడు వారికి నజరానాలు ప్రకటించిన సంఘటనలు ఉన్నాయి. వాటికి ఇప్పుడు అవకాశం లేకుండా పోతున్నది.

ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ల జారీ
ఎన్నికల రోజున వారు పని చేస్తున్న పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయాలనుకునే ఉద్యోగులు ముందుగానే ఈడీసీ తీసుకోవాలి. ఎన్నికల శిక్షణకు వచ్చిన సందర్భంగా ఉద్యోగులకు ఫాం12 ఏను అధికారులు పంపిణీ చేశారు. ఉద్యోగులు తమకు ఎక్కడ ఓటు హక్కు ఉన్నదో వాటి వివరాలను తెలియ జేస్తూ ఫాంను ఆర్డీవో కార్యాలయానికి పంపించాలి. ఆర్డీవో కార్యాలయ సిబ్బంది వాటిని జహీరాబాద్ నియోజకవర్గం ఎన్నికల అధికారికి పంపించి ఓటరు వివరాలను ధ్రువీకరించుకున్న తరువాత వారికి ఈడీసీని అందజేస్తారు. ఒక నియోజకవర్గంలోని ఉద్యోగులు మరో నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్నందున వారు పని చేసే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసినా అది ఒకే పార్లమెంటు నియోజకవర్గంలోకి వస్తున్నందున ఇలాంటి ఏర్పాట్లు కొత్తగా చేస్తున్నారు.

58
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles