చలో అందోల్ !

Sun,March 24, 2019 12:27 AM

- 3న జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ
- హాజరు కానున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్
- తరలనున్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని ప్రజలు, పార్టీ శ్రేణులు
- పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్
- ఏర్పాట్లు చేస్తున్న నాయకులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రణాళికలు రచిస్తోంది. భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ వెలువరించక ముందు నుంచే అప్రమత్తమైన గులాబీ పార్టీ అందుకు తగ్గట్లుగానే సన్నద్ధమైంది. అసెంబ్లీలో ఘన విజయం సాధించిన కారు పార్టీ అదే జోరును పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృతం చేసే దిశగా పట్టు బిగించేందుకు సిద్ధమైంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మార్గనిర్దేశనంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా ఉమ్మడి జిల్లాల్లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సభలను నిర్వహించి కార్యకర్తల్లో జోష్ నింపారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలంటూ ప్రజా ప్రతినిధులను, పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపారు. మార్చి 13వ తారీఖున జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సభ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాంతంలో అట్టహాసంగా సాగింది. సన్నాహక సభ విజయవంతం కావడంతో పాటుగా కార్యకర్తలు సైతం రెట్టింపు ఉత్సాహంతో కార్యక్షేత్రంలో దూకారు. ఇప్పుడు అధినేత కేసీఆర్ సైతం ప్రజలను నేరుగా కలుసుకునేందుకు సిద్ధమయ్యారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సభను ఏప్రిల్ 3న అందోల్ నియోజకవర్గంలో నిర్వహించనున్నారు. ఈ సభకు జిల్లా నుంచి ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వెళ్లనున్నారు.

3న అందోల్‌లో సభ
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సభల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హాజరవుతోన్న ప్రచార సభల రెండో విడత పర్యటన వివరాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ 17, ఏప్రిల్ 19న కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల ప్రచార సభలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ అభ్యర్థుల కసరత్తు, ప్రకటన అనంతరం సీఎం కేసీఆర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తన కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల సభను అందోల్ నియోజకవర్గంలో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 3న తలపెట్టిన సీఎం కేసీఆర్ సభ సాయంత్రం 4 గంటలకు, అదే రోజు సాయంత్రం 5.40 గంటలకు నర్సాపూర్‌లో నిర్వహించబోతున్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సభకు కేసీఆర్ హాజరవ్వనున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కామారెడ్డి జిల్లా మొత్తం వస్తుండడంతో కేసీఆర్ హాజరవ్వబోయే ఈ ఎన్నికల సభ బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులకు సైతం కీలకం కానుంది.

బీబీ పాటిల్ గెలుపే లక్ష్యంగా..
జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీబీపాటిల్ గెలుపుతో పాటుగా మరోమారు ఈ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగుర వేసేందుకు అధినేత కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్ల విజయమే లక్ష్యంగా ఆయన ప్రజా సభలతో జనాల చెంతకు వెళ్లనున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీ గట్టి ప్రణాళికలు రూపొందించనున్నారు. కామారెడ్డి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, సంగారెడ్డి జిల్లాలోని అందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, సర్పంచ్, ఎంపీపీలు, జడ్పీటీసీలతో పాటుగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా ఈ సభకు హాజరు కానున్నారు. సన్నాహక సభకు దీటుగానే సీఎం కేసీఆర్ ప్రచార కార్యక్రమాన్ని తలపెట్టనున్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో వారం రోజుల క్రితం జరిగిన పార్లమెంట్ స్థాయి సభల మాదిరిగానే ఏర్పాట్లు సాగనున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు, పంచాయతీ పోరులో గెలుపు తీరుతో క్షేత్ర స్థాయిలో బలపడిన టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఏడు అసెంబ్లీ స్థానాల పరిధి నుంచి లక్షలాది మందితో జన సమీకరణను చేపట్టనున్నారు.

57
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles