అధికారులు పనితీరు మార్చుకోవాలి

Sun,March 24, 2019 12:26 AM

బీర్కూర్ : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని, పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని శనివారం ఆయన దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు నత్తనడకన సాగడంతో కాంట్రాక్టర్లు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పనులు చేస్తే వచ్చే బ్రహ్మోత్సవాల వరకు కాదు కదా.. ఆరేండ్లయినా మీరు పనులు పూర్తి చేయరని మండిపడ్డారు. పనులు చేతకాకుంటే మానుకోండని, వేరే వారితో పనులు చేయించుకుంటామని అసహనం వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులపై దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడారు. ఆలయానికి కింది భాగంలో ఉన్న చెరువును కోనేరుగా మార్చాలని, ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.

బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులతో మాటామంతీ...
మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో చదువుకునే విద్యార్థులు శనివారం కావడంతో వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చారు. అప్పుడే అక్కడికి వచ్చిన స్పీకర్ పోచారం వారిని పలుకరించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారని, ఎన్నో తరగతి చదువుతున్నారని అడగగా బీసీ హాస్టల్‌లో చదువుకుంటామని తెలిపారు. హాస్టల్‌లో అందిస్తున్న విద్య, భోజనం, వసతులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుంటున్నామని, వసతులు బాగున్నాయని తెలుపడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు...
మండలంలోని భైరాపూర్ గ్రామంలో ఉన్న విఠలేశ్వర ఆలయంలో చివరి రోజు అఖండ హరినామ సప్తాహ కార్యక్రమాల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ద్రోణవల్లి సతీశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త స్పీకర్ పోచారాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భైరాపూర్ గ్రామం భక్తి మార్గం కలిగిన గ్రామమన్నారు. తెలంగాణలో ఇంత గొప్ప విఠలేశ్వరుని ఆలయం ఎక్కడా లేదన్నారు. గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. భైరాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, పనులు త్వరగా పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

భైరాపూర్ గ్రామాన్ని మరువను...
బాన్సువాడ నియోజకవర్గంలో తనకు అత్యధిక మెజార్టీ అందించిన భైరాపూర్ గ్రామాన్ని తాను ఎన్నడూ మరువనన్నారు. భైరాపూర్, మల్లాపూర్, సంబాపూర్ గ్రామాల్లోని పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందజేస్తామన్నారు. నియోజకవర్గంలో 5 వేల ఇండ్లను నిర్మిస్తున్నామని, వాటిలో కొన్ని ఇండ్లు పూర్తి చేశామన్నారు. కార్యక్రమాల్లో విఠలేశ్వర ఆలయ ధర్మకర్త ద్రోణవల్లి సతీశ్, టీటీడీ ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్‌రావు, భోగవల్లి అప్పారావు, పెర్క శ్రీనివాస్, మారుతి, సర్పంచులు రామకుమారి, గుమ్మ లక్ష్మి, కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సుశీల, సొసైటీ చైర్మన్ రాజప్ప, ఇందూరి గంగాధర్, అవారి గంగారాం, నర్సరాజు, పండరి పటేల్, హన్మంత్‌రావు, లక్ష్మణ్ యాదవ్, పసుపుల రమేశ్, రామకృష్ణాగౌడ్, గుమ్మ లక్ష్మణ్, మురళి, శ్రీనివాస్, నర్రా సాయిలు పాల్గొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles