గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన బాలా గౌడ్

Sun,March 24, 2019 12:25 AM

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ: సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాడూరి బాలాగౌడ్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజా ప్రతినిధిగా ఎదిగి తనదైన ముద్ర వేశారు రాజకీయాల్లో. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన బాలాగౌడ్ వెనుకబడిన తరగతుల నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. గ్రామ పంచాయతీలో వార్డు సభ్యునిగా రాజకీయం ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఏదిగి రాష్ట్ర మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా, పార్లమెంటు సభ్యుడిగా, ప్రధాని ఇందిరా గాంధీకి సన్నిహితునిగా దేశంలోనే మంచి పేరు సంపాదించారు. ప్రజాప్రతినిధిగా ఆయన చేపట్టని పదవి లేదని, ఆయనకు బీసీల్లో ఎనలేని పేరు ప్రతిష్టలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైన ఆయన జీవితం చివరి వరకు ఆయన పార్టీ మారకుండానే ముగిసి పోయింది. పార్టీ పదవులు రాకున్నా, రాజకీయాలకు దూరంగా ఉన్నా ఏనాడూ కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించ లేదు.

వార్డు సభ్యుని పదవి నుంచి పార్లమెంటు సభ్యుని వరకు
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాడూరి బాలాగౌడ్ మొదట్లో కల్లు వ్యాపారం చేసుకునే వారు. 1970కి ముందు జరిగిన లింగంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచు పదవి కైవసం చేసుకున్నారు. సర్పంచు పదవితో ఆయన సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని పొందారు. తరువాత ఆయన 1982లో అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు భవనాల శాఖ మంత్రిగా, తరువాత భవనం వెంకట్రాం రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చక్కెర శాఖ కేబినెట్ మంత్రిగా సేవలు అందించారు. 1983 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి ఎల్.కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో బాలాగౌడ్ 1984లో నిజామాబాద్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ ఆయన నిజామాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపు సాధించారు. తరువాత మరోసారి జరిగిన 1989 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి రెండు సార్లు పార్లమెంటుకు వెళ్లారు.


బీసీల పక్షపాతి తాడూరి
చిన్న కుటుంబం నుంచి దేశ స్థాయి రాజకీయాలకు వెళ్లిన తాడూరి బాలాగౌడ్‌కు బీసీల పక్షపాతిగా పేరుంది. ఆయన మంత్రిగా పనిచేసిన తరువాత రాష్ట్రంలో బీసీ సంఘం ఏర్పాటు చేసి రెండు దశాబ్దాల పాటు అధ్యక్షుడిగా పని చేశారు. రాజకీయాల్లో ఉంటూనే వ్యాపారిగా ఆయన ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో మంచి పేరు సంపాదించారు. బీసీ సంక్షేమ సంఘం స్థాపించిన బాలాగౌడ్ వెనుక బడిన తరగతుల అభ్యున్నతి కోసం పలు చర్యలు తీసుకున్నారు. బాలాగౌడ్‌కు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీతో సన్నిహిత సంబంధాలు ఉండేవని ఆయన సమకాలీకులు చెబుతుంటారు. ఇందిరా గాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీతో బాలాగౌడ్ మంచి సంబంధాలు ఉండేవి. బాలాగౌడ్ మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇందిరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇందిరా గాంధీ ఎల్లారెడ్డికి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఎల్లారెడ్డిలోనే అసెంబ్లీ అభ్యర్థిగా బాలాగౌడ్‌ను ప్రకటించడంతో పాటు జుక్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోచె గంగారాంను ఆమె ఎన్నికల సభలో పరిచయం చేశారు.

55
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles