ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం

Sat,March 23, 2019 12:18 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉపాధ్యాయులు, పట్టభద్రుల శాసనమండలి కరీంనగర్ నియోజవర్గం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 50 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు సాగింది. ఎండ వేడితో ఓటర్లంతా మధ్యాహ్నం 12 గంటల్లోపే ఎక్కువ శాతం తరలివచ్చి ఓటేశారు. ఆ తర్వాత మందకొడిగానే ఓటర్లు పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఏక కాలంలో జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యాయ ఓటర్లు సత్తా చాటారు. చాలా మంది స్వచ్ఛందంగా తరలివచ్చి అమూల్యమైన ఓటును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. పట్టభద్రుల ఓటర్ల నుంచి స్పందన అంతగా లేకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పట్టభద్రులంతా చాలా మంది స్థానికంగా ఉండకపోవడం, మండల కేంద్రాల్లో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయడం, ఎండ వేడిమి వంటి కారణాలతో సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు ముఖం చాటేసినట్లు స్పష్టం అవుతున్నది. జిల్లాలో 11,777 మంది పట్టభద్రులు ఉండగా 7,737 మంది ఓటేశారు. 65.70 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 1,906 మంది ఉపాధ్యాయ ఓటర్లలో 1,653 మంది ఓటెయ్యడంతో అత్యధికంగా 86.73 శాతం మేర రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది.

పట్టింపులేని పట్టభద్రులు
ఓటు హక్కు బాధ్యతపై అక్షరాస్యత కలిగిన పట్టభద్రుల తీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మరోమారు స్పష్టమైంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపుగా 35 శాతం మంది ఓటర్లు గడప దాటి బయటకు రాలేకపోవడం చర్చనీయాంశం అవుతున్నది. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో చాలా మంది పట్టభద్రులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా ఓటేసింది మాత్రమే తక్కువ మందే కావడం విశేషం. జిల్లాలో 11,777 మంది పట్టభద్రుల ఓటర్లుండగా శుక్రవారం జరిగిన పోలింగ్‌లో పాల్గొన్నది మాత్రం 7,737 మంది మాత్రమే. నమోదైన పోలింగ్ శాతం 65.70 ఉండడం గమనార్హం. పట్టభద్రుల ఓట్లు అత్యధికంగా ఉన్న కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో 6,911 ఓట్లుండగా ఓటు హక్కును వినియోగించుకున్న వారు కేవలం 64.85 శాతం అంటే 4,482 మంది మాత్రమే. బాన్సువాడలో 3,227 మంది పట్టభద్రులకు 67.34 శాతం అంటే 2,173 మంది ఓటేశారు. ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో 1,645 మంది ఓట్లకు 66.02 శాతం అంటే 1,082 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం దాదాపుగా సాధారణ ఎన్నికలను తలపించగా పట్టభద్రుల ఎన్నికకు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో అభ్యర్థులు విఫలమైనట్లుగా స్పష్టం అవుతోంది. ఓటు హక్కును నమోదు చేసుకున్న వారిలో ఎక్కువ మంది ఓటేసేందుకు సుముఖత చూపలేకపోయారు.

కదం తొక్కిన ఉపాధ్యాయ ఓటర్లు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఓటర్లు కదం తొక్కారు. పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటెయ్యడంతో భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు అయ్యింది. ఈసారి హోరాహోరీగా సాగిన అభ్యర్థుల ప్రచారానికి తోడుగా కీలకమైన ఉద్యోగ సంఘాల నాయకులే తలపడడంతో పోరు రసవత్తరంగా మారింది. బరిలో నిలిచిన ఏడుగురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రమైన కృషి చేయడంతో గెలుపు ఎవరిదన్నదీ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులకే ఎక్కువ శాతం గెలుపు అవకాశాలు ఉంటాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఈ స్థానాన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో పాటు మాజీ ఎమ్మెల్సీలు, కీలక సంఘాల సారథులే పోటీలో నిలవడంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక రక్తి కట్టించింది. పోటాపోటీగా ప్రచారాలతో పాటుగా సోషల్ మీడియాల్లోనూ పెద్ద ఎత్తున ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఓటు హక్కు పొందిన వారి వివరాల్ని, వారి ఫోన్ నెంబర్లను సేకరిస్తూ వారికి మెసేజ్‌ల రూపంలోనూ ఓట్లు అభ్యర్థించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో 1,182 మంది ఉపాధ్యాయ ఓటర్లకు 1,043 మంది ఓటెయ్యడంతో 88.24 శాతం పోలింగ్ నమోదైంది. బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌లో 497 మందికి 411 మంది ఓటెయ్యడంతో 82.70 శాతం పోలింగ్ జరిగింది. ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో 227 మంది ఉపాధ్యాయ ఓటర్లకు 199 మంది ఓటెయ్యడంతో 87.67శాతం పోలింగ్ నమోదైంది. కామారెడ్డి జిల్లా మొత్తం 1,906 మంది ఉపాధ్యాయ ఓటర్లకు 1,653 మంది ఓటెయ్యడంతో రికార్డు స్థాయిలో 86.73 శాతం పోలింగ్ నమోదైంది.

బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటరు తీర్పు
అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. వరుసగా మూడు పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులు విజయకేతనం ఎగురవేస్తుండడంతో ఈసారి కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమని అంతా భావిస్తున్నారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలైనప్పటికీ అన్ని పార్టీలు తమ మద్దతుదారుల్ని రంగంలోకి దింపేలా ముందస్తు వ్యూహాల్ని పక్కాగా అమలు చేశాయి. నోటిఫికేషన్ జారీకి రెండు, మూడు నెలల ముందు నుంచే ముమ్మర ప్రయత్నాలను కొనసాగించిన ఆశావహులంతా బరిలో నిలిచి తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రచారానికి గడువు తక్కువే ఉండడంతో నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని లక్షలాది మంది పట్టభద్రులను కలవడంలో అభ్యర్థులు వెనుకడుగే వేశారు. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండడంతో పోటీలో నిలిచిన అభ్యర్థులంతా హోరాహోరీగా ప్రచారం నిర్వహించడం, సామూహిక సమావేశాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం వంటివి చేశారు. మొత్తానికి శుక్రవారం జరిగిన ఎన్నికలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అవ్వగా ఈ రెండు స్థానాల తీర్పు మార్చి 26వ తేదీ నాడు వెలువడనుంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే నిర్వహించనున్నారు.

66
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles