పేదల సొంతింటి కల సాకారమే ధ్యేయం

Sat,March 23, 2019 12:14 AM

బీర్కూర్ : పేదల సొంతింటి కల సాకారం చేస్తామని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ - మద్నూర్ మండలం కుర్లా గ్రామానికి మధ్యన మంజీరా నదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. వంతెన నిర్మాణ పనుల్లో జాప్యంపై ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడారు. కాంట్రాక్టర్‌తో నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెనకు ఇరువైపులా రోడ్లు వేయించి వాహన రాకపోకలకు మార్గం సుగమం చేయాలని ఎస్‌ఈకి సూచించారు. అనంతరం బీర్కూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసమని, అది నిజం చేసే వరకు కృషిచేస్తామన్నారు. తెలంగాణలోని సబ్బండ వర్ణాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. వచ్చే మార్చిలోగా కాళేశ్వరం నీటిని రైతుల పొలాలకు మళ్లిస్తామన్నారు. ఈ నీటితో ఏడాదికి రెండు పంటలు పండుతాయన్నారు. ఈ ఏడాది జూన్ నెలలోగా మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ చేరవేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అవారి స్వప్న, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, రఘు, సొసైటీ చైర్మన్ రాజప్ప, ఎంపీటీసీ సుధాకర్ యాదవ్, నాయకులు సాహెబ్‌రావు, లాయక్, అవారి గంగారాం, గాంధీ, శశికాంత్, రాజు, రఘు, మన్నాన్ పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయండి
పాత బాన్సువాడ : డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండని కాంట్రాక్టర్లను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బాన్సువాడ మండలం దేశాయిపేట్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం రాత్రి ఆయన పరిశీలించారు. ప్రతి కాంప్లెక్స్ కలియ తిరిగి నిర్మాణాల తీరును సర్పంచ్ శ్రావణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 50 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ పేదవాడి సొంతింటికల నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని, అందుకు అనుగుణంగా బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభాకర్‌రెడ్డి, రామకృష్ణ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles