హస్తవ్యస్తం..

Thu,March 21, 2019 12:33 AM

- కాంగ్రెస్ పార్టీలో రాజుకుంటోన్న అసమ్మతి సెగ
- జహీరాబాద్ లోక్‌సభ పోరులో ఆదిలోనే కకావికలం
- తిరుగుబాటు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
- కాంగ్రెస్ పార్టీ మోసగించిందంటూ బాహాటంగానే ఆరోపణలు
- అసంతృప్త బాటలో మరికొంత మంది హస్తం నేతలు
- పార్టీ సైతం మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం..?

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అదే ఊపుతో లోక్‌సభ పోరులోనూ సత్తా చాటేందుకు సిద్ధం అవుతోంది. ఓ వైపు గులాబీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార సభల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు కూడా సుడిగాలి పర్యటనలతో ఇప్పటికే జిల్లాల పర్యటనలతో ఊపు తీసుకొచ్చారు. పార్టీ శ్రేణులు, ప్రజలతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ ఓటర్లను నేరుగా కలుస్తుండగా టీఆర్‌ఎస్ పార్టీలో గెలుపు ధీమా రోజురోజుకూ పెరుగుతోంది. అధికార పార్టీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుండగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మాత్రం అడుగడుగునా ఆదిలోనే హంసపాదు.. అన్నట్లుగా చతికిల పడుతోంది. జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా మదన్‌మోహన్ రావు పేరును ఖరారు చేసిన వెంటనే హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాలలు తారా స్థాయికి చేరాయి. మండలాల్లో కాంగ్రెస్ లీడర్లంతా కారెక్కుతుండగా... ముఖ్యమైన నాయకులు ఏకంగా అధిష్టానంపైనే నిప్పులు చెరుగుతుండడం గమనార్హం. ఈ పరిణామాలతో జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి.

కాంగ్రెస్ కకావికలం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దశాబ్ధ కాలంగా టీఆర్‌ఎస్ పార్టీ తనదైన శైలిలో సత్తా చాటుతోంది. మలిదశ ఉద్యమంలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతోన్న టీఆర్‌ఎస్ పార్టీ ఇక్కడి కాంగ్రెస్ కోటలను బద్దలు కొడుతోంది. ఆయా నియోజకవర్గాల్లో పాతుకుపోయిన హస్తం నేతల అడ్రస్‌ను గల్లంతు చేస్తోన్న కారు పార్టీ జోరుకు కోలుకోలేని విధంగా కాంగ్రెస్ పార్టీ దుస్థితి తయారైంది. మొత్తంగా పార్టీలో నాయకత్వలేమి, గ్రూపు రాజకీయాలకు తోడుగా చరిష్మా ఉన్న లీడర్లెవ్వరూ లేకపోవడంతో కకావికలం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకం తెచ్చిన మంట ఇంకా చల్లారక ముందే లోక్‌సభ సీట్ల కేటాయింపు మరింతగా ఆజ్యం పోసినట్లు అయ్యింది. చాలా రోజుల తర్వాత డీసీసీ నియామకం చేపట్టినప్పటికీ ఈ ప్రక్రియ సైతం జిల్లాలో పలువురు నేతలను అసంతృప్తికి గురి చేసింది. దీంతో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎదురీదుతోంది. హస్త రేఖలు అస్తవ్యస్తంగా ఉండటంతో వలస బాటల కారణంగా పార్టీలో అంతర్గత నిర్లిప్తత చోటుచేసుకుంటోంది.

హస్తంలో అస్తవ్యస్తం...
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీలో అసమ్మతి సెగలు అలుముకున్నాయి. పార్టీలో టిక్కెట్లు ఇవ్వడంలో జరిగిన నష్టంపై ఆశావహులు తమ నిరసన గళం విప్పుతున్నారు. మొదటి జాబితాలోనే జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడి పోయిన మదన్‌మోహన్ రావు పేరును ప్రకటించడంతో పార్టీ వర్గాలు పీసీసీ అధ్యక్షుడిపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల ఆశను చూపి ఇన్ని రోజుల పాటు చాకిరి చేయించుకున్నారంటూ పలువురు నేతలు ఏకంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి తన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో పిట్లం మండలంలో నిర్వహించిన సమావేశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో సుభాష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ తనను అన్నింట్లో మోసం చేసిందని ఆరోపించిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి ఈ లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్‌మోహన్ రావు ఓటమికి కృషి చేస్తానంటూ ప్రకటించడం కాంగ్రెస్‌లో అగ్గిరాజేస్తోంది.

పార్టీ మారనున్న కీలక నేతలు...?
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారంతా ఓటమి పాలవడంతో పాటుగా గెలిచిన ఎమ్మెల్యే కూడా ఎప్పుడు చేజారుతాడేమోనన్న భయాందోళనలో నేతలంతా కొట్టుమిట్టాడుతున్నారు. అంతర్గత కుమ్ములాటలు, పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీలో ఉన్న సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పలువురు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సర్కారు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆకర్షితులవుతోన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు వరుసగా గులాబీ పార్టీలో చేరుతున్నారు.

ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్యే అరుణతార, ఇతర ముఖ్య నాయకులంతా కాంగ్రెస్‌ను వీడడంతో హస్తం పార్టీ తన ఆదరణను కోల్పోతోంది. అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గుబాళించడంతో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నేతలంతా టీఆర్‌ఎస్‌లో వరుసగా చేరుతున్నారు. తాజాగా ఇదే పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా కారెక్కనున్నారన్న ప్రచారం జిల్లా వ్యాప్తంగా ఊపందుకోవడంతో చర్చనీయాంశం అవుతోంది.

91
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles