ముగిసిన ఎమ్మెల్సీ ప్రచారం..

Thu,March 21, 2019 12:32 AM

కరీంనగర్ ప్రతినిధి, కామారెడ్డి, నమస్తే తెలంగాణ : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో నిర్వహిస్తున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 4 గంటలతో ముగిసింది. ఈ నెల 22న ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రిటర్నింగ్ ఆఫీసర్, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టభద్రుల బరిలో 17 మంది, ఉపాధ్యాయ స్థానం నుంచి ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు..

రేపే ఎన్నికలు..
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకోసం 220 కామన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 156 పట్టభద్రుల స్థానాలకు, 33 ఉపాధ్యాయ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు మరో 63 అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. కామన్ పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు ఒకే పోలింగ్ కేంద్రాలు, ఒకే బ్యాలెట్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. లెక్కింపు రోజు వీటిని అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో వేరు చేసి లెక్కిస్తారు. పట్టభద్రుల బ్యాలెట్ పత్రాలు తెలుపు, ఉపాధ్యాయ బ్యాలెట్ పత్రాలు గులాబీ రంగులో ఉంటాయి.

15 జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలు..
పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు మొదట 313 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఎనిమిది కేంద్రాలు మార్పు చేశారు. ప్రతి 900 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో అదనంగా మరో 63 అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు 253 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 4 పోలింగ్ కేంద్రాలు మార్పులు చేశారు. ఈ నెల 22న ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను కంటెయినర్లలో తరలించి, కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపర్చేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు..

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సమాప్తం..
- ఎన్నికల అధికారి, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్‌అహ్మద్
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలు ఈ నెల 22న ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. పోలింగ్‌కు 48 గంటల ముందు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రచారం ముగిసిందని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి పోలింగ్ జరిగే శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ప్రచారం చేయడం నిషేధమని తెలిపారు. అలాగే, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారం చేయరాదన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల సహాయ ఎన్నికల అధికారులు తమ డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం జరుగకుండా చర్యలు తీసుకోవాలనీ, నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎన్నికల అధికారి హెచ్చరించారు.

101
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles