మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

Thu,March 21, 2019 12:31 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : మాతా శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రజా సంక్షేమ పథకాలకే కాకుండా విద్య, వైద్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో నిర్మిస్తున్న వంద పడకల మాతా శిశు దవాఖాన భవన నిర్మాణ పనులను, దవాఖాన నిర్మాణ ప్లాన్ మ్యాపును బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతోందన్నారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 7 మాతా శిశు వైద్యశాలలను మంజూరు చేసిందని, ఇందులో బాన్సువాడలో ఒకటి అని తెలిపారు. బాన్సువాడలో రూ. 17 కోట్ల వ్యయంతో దవాఖానను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 60 వేల స్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో రెండంతస్తుల భవనం నిర్మించి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. రక్తహీనతతో బాధపడేవారికి ఇబ్బందులు తలెత్తకుండా 70 లక్షల రూపాయలతో బ్లడ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ స్థలాన్ని వేలం వేసేందుకు ప్రయత్నించగా తాను అడ్డుకున్నట్లు గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, బాన్సువాడలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం, మందులు అందిస్తున్నట్లు తెలిపారు.

బాన్సువాడ ఒక వెలుగు వెలగాలి..
బాన్సువాడ పట్టణం పంచాయతీ నుంచి మున్సిపాలిటీ గా రూపాంతరం చెందిన అనంతరం ఒక వెలుగు వెలగాలని స్పీకర్ పోచారం అన్నారు. మున్సిపాలిటీలో మెయిన్ రోడ్డు మీదుగా నేషనల్ హైవే వెళ్లేందుకు కృషి చేశానని ఇందులో భాగంగానే పట్టణంలో ఇరువైపులా 50 ఫీట్ల రోడ్డును విస్తరింపజేశామని తెలిపారు. బాన్సువాడ పట్టణ ప్రజల వ్యాపారాలకు ఆటంకం కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతో బాన్సువాడ మీదుగా హైవే కోసం రోడ్డు విస్తరణ చేపట్టామని వివరించారు. మున్సిపాలిటీలో మదీనా కాలనీ, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్, హనుమాన్ కాలనీ తదితర కాలనీల్లో వర్షాకాలంలో ఇబ్బందులు కలుగకుండా రూ. 25 కోట్లతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట దేశాయిపేట్ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అలీమొద్దీన్ బాబా, దొడ్లె వెంకట్రామ్ రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, మహ్మద్ ఏజాస్, కొత్తకొండ భాస్కర్, బలరాం, తయ్యబ్ అర్బాస్, గులుపల్లి మొగులయ్య తదితరులు ఉన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles