నేడు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ

Tue,March 19, 2019 02:18 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఇందూరు మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతున్నది. ఈ వేదికగా సీఎం కేసీఆర్ మరోమారు సింహగర్జన చేయనున్నారు. తన విశ్వరూపాన్ని చూపనున్నారు. పార్ల మెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభల ద్వారా జన జాగృతం చేసేందుకు సంకల్పించిన కేసీఆర్.. కరీంనగర్ నుంచి పొలికేక ప్రారంభించి రెండో సభ నిజామాబాద్ నుంచి యావత్ తెలంగాణ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఆర్ అండ్‌బీ, రవాణా, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నీతానై ఈ సభ ఏర్పాట్ల బాధ్యతను తీసుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన జనసమీకరణ చేసే క్రమంలో కావాల్సిన రవాణా సదుపాయాలను సమకూర్చారు. సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎండతీవ్రత తగ్గిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి జనాలను తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి సెగ్మెంట్ నుంచి 30వేల నుంచి 40వేల మంది వరకు సభకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 2లక్షల నుంచి 2.5లక్షల మంది జనం ఈ సభకు తరలివచ్చే అవకాశం కనిపిస్తున్నది.

ఇది వరకు ఇదే ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించిన కేసీఆర్ భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జనప్రభంజనానికి కేసీఆర్ ఫిదా అయ్యారు. ఇదే వేదికగా మళ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ సభ నేడు జరుగనున్నది. ఈ సభను ఇందూరు గులాబీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎంపీ కవిత ఎప్పటికప్పుడు సభ ఏర్పాట్ల పర్యవేక్షణను సమీక్షిస్తున్నారు. ఇది వరకు రెండు పర్యాయాలు మంత్రి వేములతో కలిసి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభాస్థలిని పరిశీలించారు. కావాల్సిన ఏర్పాట్లు చేయడం కోసం శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌తో కలిసి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పది రోజులుగా సభ ఏర్పాట్ల లో నిమగ్నమయ్యారు. ఎండతీవ్రత దృష్ట్యా సాయంత్రం జనాలను సభకు తరలించడంతో పాటు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ సభ సక్సెస్ కావడం.. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇదే వేదికగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనడం.. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయడం భవిష్యత్ శుభాపరిణామంగా భావిస్తున్నారు. దీన్ని సెంటిమెంట్‌గా తీసుకున్న గులాబీ శ్రేణులు సభ గ్రాండ్ సక్సెస్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ కవిత అన్ని నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో సోమవారం భేటీ అయ్యారు. అంతకుముందు బోధన్, ఆర్మూర్, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల నాయకులతో సమావేశమై కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించే బాధ్యతను ఆయా ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా భావించడంతో విజయవంతం కోసం ప్రతి ఎమ్మెల్యే శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ వచ్చిన నేపథ్యంలో దీనికి రెట్టింపు మెజార్టీని కవితకు వచ్చేలా క్షేత్రస్థాయిలో గులాబీశ్రేణులను కార్యో న్ముఖుల్ని చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. సీఎం కేసీఆర్ సభ తర్వాత జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల కోసం దూసుకెళ్తుండగా ప్రతిపక్షాల్లో నిస్తేజం నెలకొన్నది. కేసీఆర్ సభ టీఆర్‌ఎస్ శ్రేణులకు వెయ్యేనుగుల బలాన్ని ఇవ్వనున్నది.

63
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles