మిగిలింది మూడు రోజులే..!c

Tue,March 19, 2019 02:16 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల్లో కీలకఘట్టానికి తెర లేచింది. భారత ఎన్నికల కమిషన్ వెలువరించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు జహీరాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సంగారెడ్డి కలెక్టర్ హన్మంత్ రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. సోమవారం నుంచి ప్రారంభమైన నామినేనషన్ల ఘట్టం సరిగ్గా ఈ నెల 25వ తేదీ నాటికి ముగుస్తున్నది. సమయం వారం రోజుల పాటు ఉన్నట్లుగానే కనిపిస్తున్నప్పటికీ గురువారం హోలి పండుగ, నాలుగో శనివారం, ఆదివారాలు వరుసగా సెలవులు వస్తుండడంతో అభ్యర్థుల్లో ఆందోళన రేపుతున్నది. తక్కువ సమయం ఉండడంతో ఎప్పుడెప్పుడు నామినేషన్ వేయాలన్న ఆలోచనతో లోక్‌సభ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద ఐదు రోజులు పని దినాలు మాత్రమే అందుబాటులో ఉండగా అందులో మొదటి రోజు పూర్తైంది. రెండో రోజు మంగళవారం కావడంతో ఇక మిగిలింది మూడు రోజులే. ప్రచారానికి సైతం మూడు వారాల సమయమే మిగిలి ఉంది.

జహీరాబాద్ లోక్‌సభ వయా సంగారెడ్డి
జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో కామారెడ్డి జిల్లాలోని మొత్తం నాలుగు నియోజకవర్గాలు ఇదే నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. జహీరాబాద్, ఆంధోల్, నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానాలు సంగారెడ్డి జిల్లాలో... కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి అసెంబ్లీ సీట్లు కామారెడ్డి జిల్లాలో నెలకొన్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం సంగారెడ్డి జిల్లాలో ఉండడంతో ఇక్కడి ఎన్నికకు ఇక్కడి కలెక్టరే రిటర్నింగ్ అధికారిగా వ్యవహిస్తున్నారు. నామినేషన్ల ఘట్టంతో పాటుగా ఎన్నికల నిర్వహణలో కీలకమైన అంశాలు, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అంతా ఇక్కడి నుంచే వెలువడనుంది. సోమవారం నామినేషన్లకు నోటిఫికేషన్ వెలువడడంతో సంగారెడ్డి కలెక్టరేట్‌లో నామినేషన్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నామినేషన్ల దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే కలెక్టరేట్‌లోకి అనుమతించనున్నారు. అభ్యర్థితో మొత్తం నలుగురు మాత్రమే నామినేషన్ పేపర్లతో ఫెసిలిటేషన్ సెంటర్‌లోకి రావాల్సి ఉంటుంది. నామినేషన్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారాలు ఈ ఫెసిలిటేషన్ సెంటర్లో అందుబాటులో ఉంటాయి. నామినేషన్ దాఖలు చేసే వారు ముందుగా అధికారుల అనుమతి తీసుకుని వారికి కేటాయించిన సమయానికి నామినేషన్ ఫెసిలిటేషన్ సెంటర్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ నామినేషన్లను అధికారులు ముందస్తుగా పరిశీలిస్తారు. లోపాలుంటే అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్తారు.

నామినేషన్ల పర్వం ఇలా...
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఆరంభమైంది. పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించే సమయంలో పలు ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా పలు సర్టిఫికెట్లను జత చేయకుంటే నామినేషన్లను పరిశీలన దశలో తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో, జనరల్ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇటీవల తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ చేసిన కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను జత చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు డిపాజిట్‌ను చలానా రూపంలో చెల్లిస్తే సంబంధిత రశీదును లేదా నగదు రూపంలో చెల్లించాలి. భారతదేశంలో ఎక్కడ ఓటరుగా నమోదై ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించిన ఓటరు మాత్రం అతన్ని ప్రతిపాదించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఒకరు ప్రతిపాదించవచ్చు. స్వతంత్ర అభ్యర్థి అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించిన 10 మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. అభ్యర్థులు కొత్తగా ప్రారంభించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కలిగిన పాస్ బుక్, పాన్ కార్డు జిరాక్స్‌లను జత చేయాలి. గుర్తింపు కలిగిన న్యాయవాది నుంచి పొందిన అఫిడవిట్ జత చేయాలి. ఆ అఫిడవిట్‌లో అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, వాహనాలు, అభ్యర్థి కుటుంబ సభ్యుల ఆస్తులు, వాహనాలు, కేసుల వివరాలను అందులో పొందుపర్చాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఆ పార్టీ జారీ చేసిన బీ - ఫాంను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. పార్టీలకు సంబంధించిన టోపీ, కండువా, చొక్కా వేయకూడదు. తెలుపు రంగు చొక్కా ధరించిన ఫొటోలను మాత్రమే ఇవ్వాలి. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles