పోలింగ్ సిబ్బందికి తొలి అవకాశం

Mon,March 18, 2019 01:37 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సాధారణంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు నేరుగా ఓటేసే అవకాశం ఉండదు. విధుల్లో పాలుపంచుకుంటుండడంతో వారికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రయోగాత్మకంగా సంస్కరణలు చేపడుతున్న ఎన్నికల కమిషన్ ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధతినే తీసేసింది. అందుకు బదులుగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్‌ను జారీ చేయనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రెవెన్యూ డివిజనల్ అధికారుల ద్వారా జారీ చేసిన ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్‌తో నేరుగా ఓటేసే వీలుందని కలెక్టర్ ఎన్.సత్యనారాయణ తెలిపారు. ఈ అవకాశం ఉద్యోగులకు ఎంతగానో లాభిస్తుందని, పోస్టల్ బ్యాలెట్‌లో వేసిన ఓట్లపై నెలకొన్న ఆందోళనకు ఇకపై చెక్ పడినట్లేనని చెప్పారు. ఈ నెల 22న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో కలెక్టర్ పలు వివరాలు వెల్లడించారు.

నమస్తే తెలంగాణ: భారత ఎన్నికల కమిషన్ నవ్య పంథాలో సాగుతున్నది. ప్రతీ ఎన్నికల్లో ఏదో ఒక సంస్కరణను ప్రవేశపెడుతున్నది. ఈసారి ఎలాంటి ప్రయోగం చేపట్టబోతున్నది?
కలెక్టర్: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఈ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా పని చేస్తున్న చోటనే ఓటు వేసే సదావకాశం కల్పించబోతున్నాం. భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఆదేశాల మేరకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగులు తాము విధుల్లో నిర్వహించే పోలింగ్ బూత్‌లోనే ఓటేసే వీలుంది. గతంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తే అది సరైన సమయంలోపు చేరుతుందో లేదో అన్నదీ సందేహంగా ఉండేది. తమ ఓట్లు పరిగణలోకి తీసుకున్నారా లేదా అన్న దానిపైనా ఆందోళన ఉండేది. ఇప్పుడీ నూతన అవకాశం ద్వారా ఉద్యోగులకు వెంటాడిన ఆందోళన సమసిపోనున్నది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే విధానానికి స్వస్తి పలికినట్లే.

ఉద్యోగులకు ఈ సదవకాశం ఎలా వర్తించనున్నది?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే వారి వివరాలు మా వద్ద ఉంటాయి. వారికి కేటాయించిన పోలింగ్ బూత్‌ల వివరాల ఆధారంగానే బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఉద్యోగుల వివరాలు సైతం నమోదు చేస్తాం. అక్కడే సహాయ రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వర్తించే స్థానిక ఆర్డీవోలు ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగానే సాధారణ పౌరుల మాదిరిగా విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సైతం నేరుగా ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయొచ్చు.

ఎమ్మెల్సీ ఎన్నికల తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయి? ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్‌లను ఉపయోగిస్తాం. వీటిపై అభ్యర్థుల పేర్లు మాత్రమే పొందుపర్చబడి ఉంటాయి. పేర్లకు చివరన ఓటర్లు తమ ప్రాధాన్యతను అంకెల రూపంలో చూపించి ఓటెయ్యాల్సి ఉంటుంది. అది కూడా పోలింగ్ అధికారి ఇచ్చే సిరా పెన్నుతో మాత్రమే బ్యాలెట్ పత్రంపై అంకెను రాయాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా ఓటర్లు వెంట తెచ్చుకునే పెన్నులకు అవకాశం ఉండదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మంది బరిలో ఉన్నారు. పట్టభద్రులు, టీచర్స్ ఓటర్లకు జిల్లాలో పోలింగ్ బూత్‌లను ఏ విధంగా ఏర్పాటు చేశారు?
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం స్థానం నుంచి 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్థులున్నారు. కామారెడ్డి జిల్లాలో 11,776 మంది పట్టభద్రుల ఓటర్లుండగా, ఉపాధ్యాయ ఓటర్లు 1900 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి. జిల్లా మొత్తం 50 పోలింగ్ కేంద్రాలుండగా 40 కేంద్రాలను ఉమ్మడిగా ఏర్పాటు చేశాము. 8 కేంద్రాలు పట్టభద్రులకు, 2 కేంద్రాలను టీచర్స్ ఓటర్లకు విడిగా పోలింగ్ బూత్‌లున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కరీంనగర్ నియోజకవర్గం ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నాం. పోలీసుల ద్వారా గట్టి బందోబస్తు సైతం నిర్వహించబోతున్నాం. 50 పోలింగ్ బూత్‌లలో వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ బూత్‌లు లేవు.వరుసగా ఎన్నికలు జరుగుతున్నందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లకు సిరా చుక్కా ఎక్కడ వేస్తారు?గడిచిన మూడు నెలలుగా వరుసగా ఎన్నికలు రావడంతో ఓటేసిన వారికి సిరా చుక్క వేయడంలో ఎన్నికల కమిషన్ సూచనలను పాటిస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలు, పంచాయతీ పోరులో ఎడమ చేతి మధ్య వేలికి సిరా చుక్క వేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుడి చేతికి వేయబోతున్నాం. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓట్లు ఉన్న వాళ్లకు కుడి చేతికి రెండు వేళ్లకు వేయాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎడమ చేతికి సిరా చుక్క పడే వీలుంది.

94
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles