సమరోత్సాహం

Fri,March 15, 2019 12:58 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:ఎన్నికల శంఖారావాన్ని పూరించి ప్రతిపక్ష పార్టీల అంచనాలకు అందనంత ఎత్తునకు టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిజాంసాగర్ వేదికగా బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశం విజయవంతమై పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని రెట్టింపు చేసింది. 15 రోజుల ముందే ఖరారైన కేటీఆర్ పర్యటన కాస్తా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత జరగడంతో ప్రచారంలో భాగంగానే కలిసి వచ్చింది. 16 లోక్‌సభ స్థానాల్లో గెలుపుతో పాటు భారీ మెజారిటీనే ఎజెండాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మందస్తు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుండగా... సీఎం కేసీఆర్ సైతం ఈ నెల 19వ తారీఖున నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి సభను కరీంనగర్, ఆ తర్వాతి కార్యక్రమాన్ని ఇందూర్ నుంచే ప్రారంభించనున్నారు. వరుసగా కేసీఆర్, కేటీఆర్ సభలతో పార్టీలో ఉత్సాహం రెట్టింపు అవుతున్నది. టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమనే అభిప్రాయం అడుగడుగునా వ్యక్తం అవుతున్నది.

ఉరకలెత్తిన ఉత్సాహం..
లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన అనంతరం నిర్వహించిన కేటీఆర్ తొలి బహిరంగ సభ జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచే మొదలవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి జన స్పందన భారీగా ఉండడంతో టీఆర్‌ఎస్ పార్టీలో జోష్ రెట్టింపు అయ్యింది. సభకు వచ్చిన జనాన్ని చూసి ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకత్వంలో కొంగొత్త హుషారు కనిపించింది. కీలకమైన పార్లమెంట్ ఎన్నికల రణరంగంలో సైనికుల్లా కదిలి ప్రత్యార్థుల కుట్రలను ఛేదిస్తూ టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టే విధంగా శ్రమిస్తామమంటూ గులాబీ దండు శపథం చేసింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరాన్ని కార్యకర్తలకు నేతలు తమదైన శైలిలో దిశానిర్దేశం చేశారు. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడం, ప్రతిపక్ష పార్టీల కుట్రలకు సమాధానం చెబుతూ ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ పీఠాన్ని శాసించే అధికారం టీఆర్‌ఎస్ పార్టీకి దక్కాలంటే రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాల్లో గులాబీ జెండా ఎగురాలన్నదీ కేటీఆర్ ప్రసంగంలో స్పష్టమైంది.

2014 పునరావృతం అయ్యేలా..
కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమపార్టీకే ప్రజలంతా దీవెనలు అందించారు. తొలి ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం నమోదు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలిచి కంచుకోటను నిర్మించుకుంది. 2018, డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లోనూ అభివృద్ధిని చూసిన ప్రజలంతా కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కారే కావాలనుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లకు 8 చోట్ల గులాబీ జెండాను నిలబెట్టగా ఇప్పుడు ఆ రెండు లోక్‌సభ స్థానాలను తిరిగి పొందడంపై టీఆర్‌ఎస్ నేతల దృష్టి కేంద్రీకృతమైంది. కేసీఆర్ మార్గదర్శకత్వం, కేటీఆర్ సారథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి 16 సీట్లను కైవసం చేసుకోవాలన్న కసితో పని చేస్తోంది. లోక్‌సభ పోరులో గులాబీ గుబాళింపు ఖాయమన్నది పలు సర్వేలు ఇప్పటికే తేటతెల్లం చేస్తోన్న తరుణంలో భారీ మెజార్టీని సాధించడమే లక్ష్యంగా నేతలంతా పని చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, తాజా సర్పంచులంతా కలిసి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం కోసం సిద్ధంగా ఉన్నారు. గ్రామ, మండల స్థాయి కార్యకర్తలు, నాయకుల్లో కేటీఆర్ సభ రెట్టింపు ఉత్సాహం నింపడంతో పార్టీలో నూతనుత్తేజం కనిపిస్తోంది. నిజాంసాగర్ సన్నాహక సభ ద్వారా టీఆర్‌ఎస్ పార్టీలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల ఐక్యత స్పష్టమైంది.

ఊపందుకోనున్న ప్రచార పర్వం..
నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో బుధవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం ద్వారా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ప్రచారం ఊపందుకోనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నింపిన ఆత్మైస్థెర్యంతో కదనరంగంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు దూసుకుపోనున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు అందనంత దూరంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లనుంది. అసెంబ్లీ ఎన్నికల వలే లోక్‌సభ పోరులోనూ ఫలితాలు ఏకపక్షంగానే వెలువడే అవకాశం ఉందని నాయకులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ర్టానికి టీఆర్‌ఎస్ పార్టీయే శ్రీరామరక్షగా అభివర్ణిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రచారంలో పాలుపంచుకోనున్నారు. 17వ తేదీ నుంచే కేసీఆర్ సభలు ప్రారంభం కానుండగా 19వ తారీఖున నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీఎం సభకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలతో ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్ ఈ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు అనివార్యతను వివరించనున్నారని నాయకులు చెబుతున్నారు. రాష్ట్రం గాడిలో పడాలంటే అసెంబ్లీ తరహా ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేసేలా సన్నాహక సభ సక్సెస్ స్ఫూర్తితో గులాబీ దళం రంగంలోకి దిగనుంది.

54
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles