మేలు కొనండి

Fri,March 15, 2019 12:56 AM

కామారెడ్డి డెస్క్:మార్కెట్‌లో కల్తీ సరుకులు కలవరపెడుతున్నాయి. నాణ్యత లేని వస్తువులు నష్టం చేకూరుస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా వినియోగదారుడిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ వినియోగదారుడు ప్రతిచోట ఏదో స్థాయిలో మోసపోతూనే ఉన్నాడు. ఉదయం లేచింది మొదలు వినియోగించే టూత్ పేస్టు నుంచి నిత్యావసరాలైన పాలు, చక్కెర సహా ఔషధాలు, ఇతరత్రా వస్తు, సామగ్రి వెరసి చాలా వరకు నాణ్యత లేక వ్యాపారుల మోసపూరిత చక్రవ్యూహంలో నష్టపోతూనే ఉన్నాడు. వినియోగదారుల హక్కుల రక్షణ కోసం చట్టాలు ఎన్ని ఉన్నా ఆధునిక జీవనంలో నష్టపోయిన వినియోగదారుడికి సమయం, ఓపిక లేక నష్టపరిహారం కోసం కేసులు వేయలేని పరిస్థితి దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు, డీలర్లు కూరగాయలు, పండ్లు, అన్ని రకాల ఔషధాలను కూడా కల్తీ చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అక్షరాస్యత ఎంత పెరిగినా వివిధ అంశాలపై గ్రామాల్లో కూడా కొంత చైతన్యం కనిపించినా వినియోగదారుల హక్కులు, చట్టాలు గురించి అవగాహన లేకపోవడం గమనార్హం. ఈ దిశగా యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు మరింత అవగాహన పెంపొందించాల్సి ఉంది. వస్తువు, సేవ, నాణ్యతలో తేడా వస్తే నష్టపోయిన దానికి, కోర్టు ఖర్చులకు కూడా పరిహారం ఉంటుందనే విషయం వినియోగదారులు తెలుసుకోవాలి. భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల కోసం ప్రత్యేక చట్టాన్ని చేసింది. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలో రీడ్రసల్ ఫోరమ్స్‌ను ఏర్పాటు చేసింది. నష్టపోయిన వినియోగదారుడు ఈ ఫోరంలలో ఫిర్యాదు చేస్తే కమిటీ విచారణ జరిపి న్యాయం చేస్తుంది. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

ఒక వ్యాపారస్తుడు లేదా డీలర్ ద్వారా వినియోగదారుడు నష్టపోయి ఉంటే సదరు వ్యక్తిపై, సంస్థపై ఫిర్యాదు చేయవచ్చు. వస్తువులో లేక ప్రొడక్ట్‌లో ఒకటి లేక అంతకంటే ఎక్కువ లోపాలు ఉన్నప్పుడు సర్వీస్ విషయంలో డీలర్ అశ్రద్ద చేసినపుడు, అసలు రేటు కంటే ఎక్కువ మొత్తం సదరు డీలర్ వసూలు చేసినప్పుడు ఫిర్యాదు చేయవచ్చు. కొనుగోలు చేసిన వస్తువు, పొందిన సేవల్లో లోపాలు ఉన్నట్లయితే తెల్ల కాగితంపై పూర్తి వివరాలు రాసి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. న్యాయవాది కూడా అవసరం లేదు. ఫిర్యాదుదారుడు లేక ఏజెంటు అయినా ఫోరంలో స్వయంగా ఇవ్వవచ్చు. లేకపోతే పోస్టుకార్డు ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులో చిరునామా, నష్టపోయిన వస్తువుకు సంబంధించిన ఆధారాలు అందించాలి. ఏ విధంగా నష్టపోయిందీ వివరించాలి. డాక్యుమెంట్లు, రసీదులు, ఇతర వివరాలు ఏవైనా ఉంటే జిరాక్స్ ప్రతులతో పూర్తి సమాచారంతో ఫిర్యాదు చేయాలి. కేసు విచారణకు వచ్చినపుడు ఒరిజినల్స్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి. వస్తువు, సేవల్లో లోపంతో నష్టపరిహారం రూ.లక్ష వరకైతే కోర్టు ఫీజు రూ.100, నష్ట పరిహారం రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు ఉంటే ఫీజు రూ.200, రూ.పది లక్షల వరకు నష్టపరిహారం పొందగోరితే రూ. ఫీజు రూ.400, రూ.10లక్షలకు పైగా పరిహారానికి రూ.500 నామమాత్ర ఫీజు చెల్లించాలి. నష్టపరిహారం రూ.20లక్షల విలువ వరకు జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయాలి. నష్టం రూ.20లక్షల విలువ నుంచి రూ.కోటి వరకు ఉంటే రాష్ట్ర కమిషన్‌లో, నష్టం రూ.కోటి పరిహారానికి మించిన పక్షంలో జాతీయ కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి.

51
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles