టార్గెట్-16కు తారకమంత్రం

Thu,March 14, 2019 12:56 AM

- జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం సక్సెస్
- కొత్త జోష్ నింపిన కేటీఆర్ సభ
- పెద్ద ఎత్తున తరలివచ్చిన ఏడు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు
- పోలింగ్ శాతం పెంపుపై దృష్టి పెట్టాలని నాయకులకు కేటీఆర్ పిలుపు
- ఇంట గెలిచి రచ్చ గెలవాలని సూచన
- అసెంబ్లీ ఎన్నికల కన్నా ఫలితాలు మెరుగ్గా ఉండాలని హితబోధ


నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని నిజాంసాగర్ వేదికగా నిర్వహించిన గులాబీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హితోపదేశం చేశారు. ముఖ్యకార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ సమావేశం సక్సెస్ అయ్యింది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు తరలివచ్చారు. కేటీఆర్ దాదాపు 45 నిమిషాల పాటు చేసిన తన సుదీర్ఘ ప్రసంగం ద్వారా గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే అనివార్యత క్రమాన్ని ఉదాహరణలతో సహా వివరిస్తూ ప్రతిపక్షాలను ఎండగట్టారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం, పేదవారి బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండడాన్ని సోదాహరణంగా వివరించారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ కుట్రలను తుత్తునియలు చేస్తూ ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ సాధించుకున్న వైనాన్ని గుర్తు చేస్తూనే కేంద్రంలో ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా టీఆర్‌ఎస్ కీలకంగా మారే అనివార్యతను పార్టీ శ్రేణులకు వివరించారు. తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటాయని కాంగ్రెస్ నాయకులు భయపెడితే ఆరు నెలల కాలంలోనే కరెంటు కష్టాలను తీర్చి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిన వైనాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఈ వేదికగా కేటీఆర్ గులాబీ శ్రేణుల సమక్షంలో సమీక్షించారు.

ఓట్ల శాతం వివరాలను నియోజకవర్గాల వారీగా వివరిస్తూ, ఇది ఇంకా పెంచుకోవాల్సిన అవసరమున్నదని హితబోధ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆదర్శ పాలన కొనసాగుతున్న తరుణంలో సబ్బండవర్ణాలు టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నాయని, ఈ క్రమంలో అడిగిందే తడువుగా టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని సూచించిన కేటీఆర్ రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్న వారంతా తమతమ ప్రాంతాలకు పరిమితమై బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడంతో పాటు ఓట్లు అధికంగా పడేలా చేయాలని సూచించారు. పంతాలు పట్టింపులను పక్కనబెట్టి అన్ని వర్గాల ప్రజల ఓట్లను టీఆర్‌ఎస్‌కు దక్కేలా సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేర్వేరుగా జరిగే సమయంలో పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వానిదని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరిచి సుదూరాల్లో ఉన్న వారిని సైతం పిలిపించి ఓట్లు వేసేలా చేసిన మాదిరిగానే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంత పోలింగ్ శాతం పెరిగితే అంతా టీఆర్‌ఎస్‌కు లాభం చేకూరుతుందని, మెజార్టీ పెరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సభతో గులాబీ శ్రేణుల్లో నయాజోష్ వచ్చింది.

కేంద్రంలో కేసీఆర్ కీలకం కాబోతున్నారనే ప్రత్యక్ష, పరోక్ష సంకేతాలను ఈ వేదిక ద్వారా వెలువరించడంతో రెట్టించిన ఉత్సాహంతో గులాబీ శ్రేణులు కార్యరంగంలోకి సిద్ధమయ్యాయి. ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, రవాణా, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అప్పగించారు. వారం రోజులుగా నిరంతర పర్యవేక్షణ చేస్తూ మంత్రి అన్ని ఏర్పాట్లు చేయడంలో సఫలీకృతులయ్యారు. దీంతో సభ సక్సెస్ అయింది. ఎర్రటి ఎండలో కూడా ఎవరికి ఎలాంటి అసౌకర్యం, అంతరాయం కలగకుండా అన్నీ ఏర్పాట్లు సజావుగా చేసే క్రమంలో మంత్రి వేముల ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎమ్మెల్సీలు సుభాష్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, ఎండీ ఫరీదుద్దీన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్లమెంటరీ కేంద్ర పరిశీలికుడు భరత్, పోచారం భాస్కర్‌రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబ్, స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల పుల్వామా ఘటనలో మృత్యువాతపడ్డ అమరజవాన్ల కుటుంబాలకు పోచారం భాస్కర్‌రెడ్డి సోదరులు రూ.2లక్షల చెక్కును వారి సంక్షేమం కోసం కేటీఆర్‌కు అందజేశారు. సాయిచంద్ తన కళాబృందంతో సమావేశాన్ని ఉర్రూతలూగించారు.

సభ సైడ్‌లైట్స్
- టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి జుక్కల్ నియోజకవర్గానికి రావడంతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
- ఉదయం 12.25 నిమిషాలకు కేటీఆర్ హెలికాప్టర్‌లో గోర్గల్ గ్రామ సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.
- హెలిప్యాడ్ స్థలం నుంచి మాగి శివారులో ఏర్పాటు చేసిన సభాస్థలికి వరకు ర్యాలీగా వెళ్లారు.
- కేటీఆర్ 12.35 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
- కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ భారీ కటౌట్‌లు ఏర్పాటు చేశారు.
- సభ వేదిక ఎదుట కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో బెలూన్ ఏర్పాటు చేశారు.
- జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేసి భారీమెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
- సభ వేదికకు అభిమానులు, కార్యకర్తలు కేటీఆర్ ఫ్లకార్డులు, ఫొటోలతో ఉత్సాహంగా హాజరయ్యారు.

- సభ ప్రాంగాణాన్ని పోలీసు అధికారులు డాగ్‌స్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు.
- మహిళలు భారీగా హాజరై కేటీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.
- కొందరు కేటీఆర్ ప్రసంగాన్ని సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.
- సభకు వివిధ గ్రామాల నుంచి మహిళలు బోనాలు, బతుకమ్మలతో హాజరయ్యారు.
- నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని కేటీఆర్ ప్రకటించారు.
- 2.30 నిమిషాలకు సభ సమావేశం ముగిసింది. అనంతరం కేటీఆర్ భోజనం చేసి 2.50 నిమిషాలకు హెలీకాప్టర్లో వెళ్లారు.
- పిట్లం

సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
మద్నూర్ : నిజాంసాగర్ మండలంలోని మాగి వద్ద జరిగిన జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై కార్యకర్తలకు రాబోయే ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి 25 వేలకు పైగా కార్యకర్తలు తరలివచ్చారు. సభకు తరలివచ్చిన కార్యకర్తల కోసం తాగునీరు, మజ్జిగను ఏర్పాటుచేశారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పెద్ద పెద్ద కూలర్లను ఏర్పాటు చేశారు. సభతో కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది. జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేయడంతో సభ ప్రాంగణం మార్మోగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, సభకు వచ్చిన వాహనాల కోసం ఆయా రూట్లలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.

విందు.. పసందు..
మద్నూర్ : నిజాంసాగర్ సభలో కార్యకర్తల కోసం కమ్మనైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం మండలంలోని మాగి గ్రామ శివారులో జరిగిన టీఆర్‌ఎస్ జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరైన కార్యకర్తల కోసం మటన్, చికెన్‌తో పాటు కూరగాయలు, పెరుగు, మజ్జిగ చల్లని తాగునీటిని అందించారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన సుమారు 25 వేల మంది కార్యకర్తల కోసం వరుస క్రమంలో భోజనాలను వడ్డించారు. భోజన సమయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వలంటీర్లు పనిచేశారు. నాయకులు, కార్యకర్తలు సంతోషంగా భోజనం చేశారు. పెద్ద పెద్ద షామియాలను ఏర్పాటు చేసి, ఎండవేడిమికి తట్టుకునేవిధంగా కూలర్లను ఏర్పాటు చేశారు. తాగునీటి బాటిళ్లతో పాటు, వాటర్‌ప్యాకెట్ల ను అందజేశారు. జిల్లా నాయకులు బక్కి వెంకటయ్య ఏర్పాట్లను పర్యవేక్షించగా, సభ ప్రాంగణ ఏర్పాట్లు ఎమ్మెల్యే హన్మంత్‌షిండే దగ్గరుండి పరిశీలించారు.

59
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles