టార్గెట్ రూ.10.65 కోట్లు..!

Fri,February 15, 2019 12:06 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రామాల్లో వంద శాతం పన్నులు వసూలైతే ఆ డబ్బులు పూర్తిగా సద్వినియోగమైతే పల్లెలు పచ్చగా ఉంటాయి. ప్రతీ గ్రామానికి మౌలిక వసతులు సమకూరుతాయి. మురుగు కాల్వలు, వీధి దీపాలు, నీటి పథకాల నిర్వహణ, మరమ్మతులు, రహదారుల నిర్మాణం తదితర పనులన్నీ చకచకా చేసుకోవచ్చు. అందుకే పంచాయతీల్లో ఇంటి పన్నులు, ఆస్తి, ఇతరత్ర పన్నుల వసూలుకు జిల్లా అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు పన్నులే కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్‌గా దృష్టి పెట్టింది. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహించే పంచాయతీ సెక్రటరీలపై కొత్త పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం చర్యలు తీసుకునే వీలుండడంతో వారంతా పన్నుల వసూళ్లకు పాటుపడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలతో సమావేశమై గ్రామాభివృద్ధికి పన్నులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.10.65 కోట్ల లక్ష్యం పూర్తి చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు.

వేగం అందుకుంటేనే...
జిల్లాలో గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లలో అక్కడక్కడ నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా బయటపడుతోంది. వంద రోజుల ముందు నుంచే వంద శాతం పన్నుల వసూళకు ప్రణాళికలు సిద్ధం చేసిన పంచాయతీ శాఖలో కొంత మంది పన్నుల వసూళ్లపై సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదు. తమ విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో నిర్ధిష్ట లక్ష్యానికి తగ్గట్లుగా పన్నుల వసూళ్లే పూర్తి కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చురుగ్గా పన్నుల వసూళ్ల పర్వం కొనసాగుతోంది. జిల్లాలోనూ ఈ ప్రక్రియకు వేగంగానే అడుగులు పడుతున్నా మిగతా జిల్లాలతో పోలిస్తే కాసింత వెనుకబాటులోనే కొట్టుమిట్టాడుతోంది. 15 రోజులకోమారు ఉన్నతాధికారులు స్వయంగా ఈ అంశంపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. పన్నుల వసూళ్లలో పరుగులు పెట్టించాలని జిల్లా పంచాయతీ అధికారికి, శాఖ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అయినా సరే, కింది స్థాయి సిబ్బందిలో మాత్రం స్పందన కనిపించడంలేదు. గతంలో గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులంతా కలిసికట్టుగా పన్నుల వసూళ్లకు పాటుపడాల్సి ఉన్నా... ఐక్యత లోపించిందన్న విమర్శలు వినిపించాయి. ఈసారి కొత్త పాలకవర్గం కొలువు దీరి నెల రోజులు పూర్తి కాలేదు. కొత్త పాలకవర్గం సహకారంతో లక్ష్యాన్ని సులువుగా చేరుకునేందుకు జిల్లా స్థాయిలో అధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles