స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి

Mon,January 21, 2019 12:15 AM

బీబీపేట్(దోమకొండ): స్వయం ఉపాధి రంగాల్లో యువత రాణించాలని హైదరాబాద్ యూత్ అసెంబ్లీ వైస్ చైర్మన్ అఖిల్ సూచించారు. గ్రామీణ ప్రాంత యువత, స్త్రీలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని మార్కెటింగ్‌తో అద్భుత విజయాలు సాధించవ్చని అన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని గోశాలలో ఆదివారం హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి రంగాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. అనంతరం ఆనంద్ భవన్‌లో జేల్ వ్యాక్సిన్, క్యాండిల్స్, జ్యూట్ బ్యాగ్స్ తయారీ విధానం, మార్కెటింగ్, లాభాలు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యూత్ అసెంబ్లీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. గ్రామీణ యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, పనుల కొరతను దూరం చేసుకోవాలన్నారు. మహిళలు వ్యవసాయం, బీడీ పరిశ్రమల్లో పనులు చేస్తూ రోగాల బారిన పడుతున్నారని, వారు సులువైన ఉపాధి రంగాలను ఎంచుకొని ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు కుటుంబాలను స్వశక్తితో పోషించుకోవాలని సూచించారు. వస్తువులను మార్కెటింగ్ చేసే విధానంతో నాలుగోవంతు లాభాలు గడిస్తూ పురుషులతో సమానంగా రాబడిని పొందవచ్చని తెలిపారు. గ్రామీణ మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు పేదరికాన్ని ఎదుర్కోవడం, చదువు ప్రాముఖ్యత, ఉద్యోగ రంగాల్లో రాణించడంపై వివరిస్తున్నట్లు తెలిపారు. పిల్లలను బాల్యంలో చదివిస్తే వారికి బంగారు భవిష్యత్తు అందుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గురుకుల పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వంద శాతం అక్షరాస్యతతో దేశాభివృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో యూత్ అసెంబ్లీ సభ్యులు, ప్రసాద్, గణేశ్, వినయ్, మహిళాలు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles