వలస ఓటర్లకు గాలం

Mon,January 21, 2019 12:14 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ఉపాధి, పైచదువుల కోసం వెళ్లిన వారిని ఓటింగ్‌కు రప్పించేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటములు స్వల్ప తేడాతో ఉండనుండడంతో ఎన్ని ఎక్కువ ఓట్లు వస్తే అంత మంచిదని భావిస్తున్నారు. దీంతో వలస ఓటర్లపై దృష్టి సారించారు. వారిని గ్రామాలకు రప్పించి ఓటు హక్కు వినియోగించుకోవాలని బతిమాలుకుంటున్నారు. ఊళ్లో ఉన్న ఓటర్లే కాదు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ఇక్కడా ఓటు ఉండి వేరే చోట ఉద్యోగం చేస్తున్న వారు ఇలా ప్రతి ఓటూ అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయనుంది. దీంతో సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు వలస వెళ్లిన ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. గ్రామంలో ఓటు ఉండి, ఇతర ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారని ఆరా తీస్తున్నారు. ఉద్యోగం, ఉపాధి, చదువు, వ్యాపారం కోసం కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్‌లతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారందరి ఫోన్ నెంబర్లు సేకరించి మరీ ఫోన్ చేస్తున్నారు.

రవాణా ఖర్చులు, భోజన వసతి..
పంచాయతీ ఎన్నికల ఫలితాన్ని శాసించే స్థాయిలో వలస ఓటర్లు ఉన్నారు. దీంతో ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు వలస ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో మొదటి విడత తొమ్మిది మండలాల్లో ఎన్నికలు జరుగనుండగా.. ఆయా గ్రామాల్లో దాదాపు 25 శాతానికిపైగా వలస ఓటర్లు ఉన్నారు. సోమవారం ఎన్నికలు జరుగనుండగా.. వలస ఓటర్లను తీసుకురావడానికి గ్రామాల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒకరు ఆటో ఏర్పాటు చేసుకుంటే ఇంకొకరు కారులో తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు ఎత్తకుపై ఎత్తులు వేస్తూ పోటీ పడుతున్నారు. హైదరాబాద్, ఇతర రాష్ర్టాల్లో స్థిరపడ్డ వారికి మాత్రం రవాణా ఖర్చులను సైతం ఇచ్చేందుకు ముందస్తుగానే వలస ఓటర్లతో మాట్లాడుకున్నారు. ఓటు వేయడానికి వచ్చే ఈ వలస ఓటర్లకు గ్రామాల్లో అన్ని వసతులను ఏర్పాట్లు చేస్తున్నారు. భోజన వసతితో పాటు ఆరోజు అక్కడే బస చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి కొంత మంది అభ్యర్థులైతే ఒక్క రోజు ముందుగానే వాహనాలను ఏర్పాటు చేసుకొని వలస ఓటర్లను వారి ఇండ్లలోకి రప్పించుకుంటున్నారు. ఇలా జిల్లాలో మొదటి విడతలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వలస ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

ఓటర్లకు ప్రలోభాలు..
జిల్లాలో మొదటి విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి బరిలో ఉన్న అభ్యర్థులు అన్ని విధాలుగా ప్రయత్నించారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. ఖర్చుకు వెనుకాడకుండా విజయం కోసం పరితపిస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో పోటీ తీవ్రంగా ఉంది. గెలుపు, ఓటములను శాసించే కుటుంబాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లోని పెద్ద కుటుంబాల వారిని మచ్చిక చేసుకుంటే గెలుపు తథ్యమని భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభం రోజు నుంచే గ్రామాల్లో విందుల హడావిడి మొదలైంది. కొన్ని గ్రామాల్లో ఇంటింటికీ మద్యం పంపిణీ చేశారు. శనివారం సాయంత్రం నుంచే మద్యం షాపుల్లో అమ్మకాలు నిలిపివేయగా, ముందస్తుగానే అభ్యర్థులు పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి రహస్య ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు వాటిని ఆదివారం ఓటర్లకు పంపిణీ చేశారు. కుల సంఘాలకు వంట సామగ్రి, టెంటు సామగ్రి కొనిస్తుండగా, దేవాలయాలకు మైక్‌సెట్‌లను అభ్యర్థులు అందజేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. మహిళల ఓట్లే కీలకం కావడంతో మహిళా సంఘాలపై దృష్టి పెట్టి కొంత నగదును అందజేస్తున్నట్లు తెలుస్తోంది.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles