కంటి వెలుగు @ 100 రోజులు

Sat,January 19, 2019 12:06 AM

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : సర్వేంద్రియానాం... నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషికి ఉన్న అవయవాల్లో ప్రత్యేకమైనవి కళ్లు. వీటికి ఎలాంటి ఇబ్బంది కలిగినా తీరని లోటుగా ఉంటుంది. దృష్టిలోప రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం శుక్రవారం నాటికి వంద పనిరోజులు విజయవంతంగా పూర్తిచేసుకుంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం ఎంతో మంది వృద్ధులకు కంటివెలుగును ప్రసాదిస్తోంది. పట్టణాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోలేని పేదలకు, వృద్ధులకు ఈ పథకం ఎంతో మేలు చేకూరుస్తోంది. ఆరు పదుల వయసు దాటిన వేలాది మందికి దృష్టిలోపం ఉన్నా కంటి దవాఖానలో చూయించుకోలేని వారికి ఈ కార్యక్రమంతో ప్రయోజనం కలుగుతోంది. ప్రతి గ్రామంలో శిబిరాలు ఏర్పాటు చేసి గ్రామస్తులకు కంటి పరీక్షలు చేసి అవసరమున్న వారికి సరిపోయే అద్దాలు అందజేస్తున్నారు. దృష్టిలోపం ఎక్కువగా ఉన్న వారి కోసం ప్రత్యేక అద్దాల కోసం ఆర్డర్ చేసి తెప్పిస్తున్నారు.

ప్రతి గ్రామంలో కంటి వెలుగు శిబిరం...
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రామగ్రామాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కంటి వైద్య నిపుణులు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి శిబిరాల్లో వైద్యసేవలు అందిస్తోంది. ప్రతి గ్రామంలో ఉన్న వృద్ధులకు, ఇతరులకు పరీక్షలు చేసి కంటి శుక్లాలు ఉన్న వారిని గుర్తించి ఆపరేషన్లు చేయించడం, చూపు తక్కువగా ఉన్న వారికి వెంటనే అద్దాలు పంపిణీ చేయడం, దృష్టిలోపం ఎక్కువగా ఉన్న వారికి ప్రత్యేక అద్దాలు తయారు చేయించి పంపిణీ చేస్తున్నారు.

జిల్లాలో 7.32 లక్షల మందికి...
జిల్లాలో వంద రోజుల్లో కంటి వెలుగు కార్యక్రమంలో 7 లక్షల 32 వేల 307 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో 22 కంటి వెలుగు బృందాలు ఇప్పటివరకు 418 గ్రామాల్లో శిబిరాలు పూర్తి చేశాయి. ఇందులో కంటి సమస్యలు ఉన్న 36 వేల 45 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. పేర్లు నమోదు చేసుకున్న వారికి త్వరలోనే కాటరాక్ట్ ఆపరేషన్లు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దగ్గరి చూపు సమస్య ఉన్న 67 వేల 144 మందికి శిబిరంలో అద్దాలను పంపిణీ చేశారు. దూరం చూపు సమస్య ఉన్న వారికి అవసరమైన 48 వేల 955 అద్దాల కోసం ఆర్డర్ చేశారు. జిల్లాలో మరో 20 రోజుల్లో అన్ని గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తవుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

పలుచోట్ల వైద్యుల సంబురాలు
గాంధారి : అంధత్వం లేని సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమం శుక్రవారం నాటికి వంద పనిదినాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మండలంలోని గండివేట్ గ్రామంలో నిర్వహిస్తున్న కంటి శిబిరంల వైద్య సిబ్బంది శతదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డిప్యూటీ డీఎంహెచ్‌వో శోభారాణి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఇప్పటివరకు 27 గ్రామాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి 21,507 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. వీరిలో 2364 మందికి దృష్టిలోపం ఎక్కువగా ఉండడంతో శస్త్రచికిత్స కోసం రిఫర్ చేసినట్లు తెలిపారు. 2083 మందికి కళ్లజోళ్లను అందజేశామని, మరో 2300 అద్దాలకు ఆర్డర్ చేసినట్లు వివరించారు.ప్రోగ్రాం అధికారి ఇద్రీస్ గోరీ, నోడల్ అధికారి విఠల్‌రావు, వైద్యులు హరికృష్ణ, మనోజ్‌కుమార్, సిబ్బంది మమత, దేవి, నయీం, ప్రశాంత్, రాజ గంగారాం, శాంత, సంగీత, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.

గండివేట్‌లో 245 మందికి...
గాంధారి : మండలంలోని గండివేట్ గ్రామంలో శుక్రవారం కంటివెలుగు శిబిరం నిర్వహించారు. 245 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు వైద్యుడు మనోజ్ కుమార్ తెలిపారు.

లింగంపేటలో...
లింగంపేట : మండలంలోని సురాయిపల్లి తండాలో కంటి వెలుగు సిబ్బంది సంబురాలు నిర్వహించారు. వైద్య సిబ్బంది కేక్‌కట్ చేశారు. తండాలో 315 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 14 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. మరో 10 మందికి అద్దాల కోసం రిఫర్ చేయగా, ఆరుగురికి కంటి ఆపరేషన్లు అవసరమున్నట్లు గుర్తించామని వైద్యురాలు మమత తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యుడు సాయికుమార్, సిబ్బంది శ్రావణ్, యాదగిరి, సరస్వతి, భాగ్య, అనురాధ, రజనీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

227
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles