పల్స్ పోలియోపై విస్తృత ప్రచారం చేయండి

Sat,January 19, 2019 12:04 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించి అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాల్లోపు చిన్నారులందరికీ చుక్కల మందు వేసేలా కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. కలెక్టరేట్‌లోని జనహిత హాల్‌లో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫొర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3న పల్స్‌పోలియో బూత్‌ల ద్వారా 4, 5 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేయాలన్నారు. ఐసీడీఎస్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో, డీఈవో ఆధ్వర్యంలో విద్యార్థులకు, గ్రామీణాభివృద్ధి శాఖ, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

నిరంతర విద్యుత్తు సరఫరా, రవాణా ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీల్లో ప్రచార బ్యానర్ల ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్ శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మెప్మా శాఖలు పల్స్ పోలియోపై నిరంతర అవగాహన చర్యలు చేపడుతూ కొత్తగా ఎన్నిక కాబోయే సర్పంచ్, వార్డు మెంబర్లు పాల్గొనేలా చూడాలన్నారు. రిపబ్లిక్ డే రోజు పల్స్ పోలియో శకటం రూపొందించాలని, గ్రామాల్లో ఊరేగింపు ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ హతుల్ నిగమ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది కేవలం ఒక్కసారే పల్స్‌పోలియో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చెరుకు కార్మికులు, వలస కార్మికులు ఉండే హైరిస్క్ ప్రాంతాల్లో విసృత్త ప్రచారం నిర్వహించాలని సూచించారు. 2023 నాటికి పోలియో రహిత ప్రపంచంగా ప్రకటించేందుకు డబ్ల్యూహెచ్‌వో చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గల్ఫ్, పాకిస్తాన్ తదితర పొరుగు దేశాల నుంచి పోలియో వైరస్ దేశంలోకి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, డాక్టర్ అజయ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles