అనుభవానికి పట్టాభిషేకం..!

Fri,January 18, 2019 12:08 AM

- జిల్లాను వరించిన శాసన సభాపతి పదవి
- నిఖార్సైన రైతుబిడ్డ పోచారానికి అరుదైన గౌరవం
- కేసీఆర్ చేత లక్ష్మీపుత్రుడిగా గుర్తింపు పొందిన నేత
- ఊరి పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న ప్రజా నాయకుడు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: డెభ్బై ఏళ్ల వయస్సులోనూ యువకులతో పోటీ పడే మనస్తత్వం. తన నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఇట్టే వాలిపోయే దృక్పథం. ప్రజల కష్టాలను, కన్నీళ్లను తుడిచేందుకు రాత్రి, పగలు కష్టపడే తత్వం. వారంలో సగం రోజుల పాటు బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకే అందుబాటులో ఉండేలా కార్యాచరణ. ఎన్ని పదవులు అలంకరించినా జిల్లాకు వచ్చే సరికి అందరి నోట శీనన్నగా పిలిపించుకునే నైజం పోచారం శ్రీనివాస రెడ్డి సొంతం. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవంతో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన పోచారానికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రిగా పని చేసిన ఆయనకు రెండో దఫా సర్కారులో శాసనసభాపతిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఈ పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్ర రెండో ప్రభుత్వంలోనూ రెండో స్పీకర్‌గా చరిత్రకెక్కనున్నారు. విండో చైర్మన్ పదవి నుంచి అంచలంచెలుగా ఎదిగిన పోచారం శ్రీనివాస రెడ్డి అసలు పేరు పరిగె శ్రీనివాస రెడ్డి. పోచారం అనేది గ్రామం పేరు కాగా అదే ఇంటి పేరుగా మారిపోయింది. తనతో పాటుగా తన కుమారులకు సైతం పోచారమే ఇంటి పేరుగా కొనసాగుతోంది.

అలసట లేని వ్యక్తి పోచారం
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర పుటల్లో తమకంటూ పేజీలు లిఖించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. ఉద్యమ నాయకుడిగా తనదైన శైలిలో చరిత్రాత్మకమైన నిర్ణయాలను తీసుకుంటూ ఆంధ్రా పార్టీల మెడలు వంచారు. యూపీఏ సర్కారును ఒప్పించి, ఎన్నో త్యాగాలు, మరెన్నో పోరాటాలతో 2014, జూన్ 2 నాడు ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేశారు. సీఎం అడుగుజాడల్లోనే నడుస్తూ నూతన శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో నిలబెట్టడంతో పాటుగా తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా పోచారం శ్రీనివాస రెడ్డి తనదైన శైలిలో రాణించారు. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రాధాన్యతను ఇచ్చే పోచారం ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు నిర్వహించుకుంటూ వారిలోనూ ఉత్సాహం నింపారు. మొన్నీ మధ్యే మంత్రి పోచారం మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం ఇలా కోలుకున్నారో లేదో అసెంబ్లీ రద్దు తర్వాత ఎన్నికల ప్రచారంలో రాకెట్ వేగంతో దూసుకుపోయారు. గత ప్రభుత్వంలో అసెంబ్లీ రద్దుకు మునుపు తన కాళ్లకు ఆపరేషన్ జరిగితే బెడ్ మీద ఉంటూనే రైతుబంధు, రైతుబీమా పథకాలపై ఉన్నత స్థాయి సమీక్షలు చేయడం ఆయనకే చెల్లింది. దవాఖాన వేదికగా టెలీ కాన్ఫరెన్సులు, సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. పనిపట్ల తనకున్న నిబద్ధతకు ఈ సంఘటనలు మచ్చుతునకలు.

లక్ష్మీ పుత్రుడు పోచారం
గతేడాది అక్టోబర్ మూడో తేదీనాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో పోచారం శ్రీనివాస రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బిరుదును అందించారు. మొన్నటి వరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం చేసి మంచి పనులు, ఆయన శ్రమను గుర్తిస్తూ ఎన్నికల సభల్లో అనేక మార్లు పొగిడారు. నిఖార్సైన రైతు బిడ్డనే పోచారం శ్రీనివాస రెడ్డంటూ కేసీఆర్ తన ప్రసంగంలో అనేక మార్లు ప్రశంసించారు. రైతుబంధు, రైతుబీమా వంటి అద్భుతమైన పథకాల అమలులో క్రియాశీలకంగా వ్యవహరించిన పోచారంను లక్ష్మీ పుత్రుడిగా కేసీఆర్ అభివర్ణించారు. రైతు బిడ్డగా పంటలకు నీళ్లు లేక రైతులు విలవిల్లాడుతుంటే తనతో కొట్లాడి నిజాంసాగర్ నీళ్లను విడుదల చేయించుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అనేక మార్లు ప్రజలకు వివరించారు. నీటి తీరువ పన్నుల రద్దు, ఎర్రజొన్న రైతులకు బకాయిల చెల్లింపు, రైతుబంధు చెక్కుల పంపిణీ, రైతుబీమా వంటి పథకాలన్నీ పోచారం మంత్రిగా ఉన్నప్పుడే అమల్లోకి రావడం జిల్లాకు గర్వకారణమంటూ గుర్తు చేశారు. ఇలా లక్ష్మీపుత్రుడిగా నామకరణం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా అనేక మార్లు పోచారం చేసిన సేవలను గుర్తు చేశారు. లక్షలాది మంది ముందే లక్ష్మీపుత్రుడంటూ కొనియాడారు.

స్పీకర్ పదవికి ఏకగ్రీవ ఎన్నిక
పోచారం శ్రీనివాస రెడ్డి అందరివాడు అన్నదీ రాజకీయ వర్గాల్లో జరిగే చర్చ. అందుకే ఆయనను శాసనసభాపతి పదవికి సిఫారసు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించగానే ప్రతిపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. సభలో సీనియర్ ఎమ్మెల్యేగా, సీనియర్ మంత్రిగా విశేష సేవలు అందించిన పోచారానికి అన్ని పార్టీల్లోనూ మిత్రులున్నారు. సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ పంతానికి పోకుండానే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం లాంటి పార్టీలు సభాపతి పదవికి పోచారం శ్రీనివాస రెడ్డికే మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నాయి. తొలుత సీఎం కేసీఆర్ స్వయంగా పోచారం పేరును సభాపతి పదవికి సిఫారసు చేయగా ఆయా పార్టీల వారంతా సమ్మతం తెలిపారు. దీంతో స్పీకర్ పదవి ఎన్నిక ఏకగ్రీవమైంది. తొలి తెలంగాణ ప్రభుత్వంలో తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన పోచారం ఈ దఫా ప్రభుత్వంలో కీలకమైన పదవి చేపట్టబోతుండడం విశేషం. రెండోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన రెండో శాసనసభాపతిగా ఏకగ్రీవం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నిఖార్సైన రైతు బిడ్డ
బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో పరిగె పాపమ్మ, పరిగె రాజిరెడ్డి దంపతులకు జన్మించిన పోచారం శ్రీనివాస రెడ్డి పుట్టుకతోనే రైతు బిడ్డ. కష్టపడి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీర్ పూర్తి చేసిన ఆయన ఇటు వ్యవసాయ పనులు చేసుకుంటూనే చదువును కొనసాగించారు. తన ఇంజనీర్ చదువు పూర్తైన అనంతర కాలంలో తన స్వగ్రామంలోనే కుటుంబ వ్యవసాయ భూమినే సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. కొద్ది కాలానికే దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నిక కావడంతో రాజకీయ రంగ ప్రవేశం మొదలైంది. చిన్న పదవితో షురూ చేసిన రాజకీయ ప్రస్థానం అప్రహతిహతంగా నాలుగున్న దశాబ్దాల నుంచి కొనసాగుతుండడం విశేషం. ఓటమి, గెలుపును సమాన దూరంలో చూసే పోచారం శ్రీనివాస రెడ్డి... అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజా జీవితాన్ని వదల్లేదు. మధ్యలో ఎమ్మెల్యేగా ఓటమి చెందినప్పటికీ ప్రజల కష్టాలు తీర్చేందుకు రోడ్డెక్కి ధర్నాలు చేసిన వారే. అలా ప్రజల కోసం కష్టపడుతూ, ప్రజల కన్నీళ్లు తుడవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. తన నియోజకవర్గంలో నిత్యం కలియ తిరిగే పోచారం శ్రీనివాస రెడ్డి ఏకంగా ప్రతీ గ్రామంలో పదుల సంఖ్యలో పేరు పెట్టి పిలుస్తారంటే అతిశయోక్తి కాదు. తన అపార జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంటారు. ప్రజలు కోరిన పనులను పూర్తి చేయడం, వాళ్ల అవసరాలను గుర్తించడంలో తనదైన ప్రతిభను చాటుతారు.

వ్యక్తిగత వివరాలు...
పేరు : పరిగె శ్రీనివాస రెడ్డి
(పోచారం శ్రీనివాస రెడ్డి)
భార్య : పరిగె పుష్పమ్మ
తల్లిదండ్రులు : పరిగె రాజిరెడ్డి, పరిగె పాపమ్మ
విద్యాభ్యాసం : బీఈ
స్వగ్రామం : పోచారం, బాన్సువాడ మండలం
పుట్టిన తేది : 10-02- 1949
సంతానం : పరిగె రవీందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కూతురు అరుణ
ఇష్టమైన ఆహారం : పప్పుచారు
ఇష్టమై నాయకుడు : కేసీఆర్
నచ్చిన హీరో : ఎన్టీఆర్
నచ్చిన సిద్ధాంతం : మాటకు కట్టుబడి ఉండడం, క్రమిశిక్షణగా మెలగడం

రాజకీయ నేపథ్యం...
- 1976లో రాజకీయ అరంగేట్రం
- 1977లో దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు
- 1980లో బాన్సువాడ సమితికి ప్రెసిడెంట్‌గా పోటీ, ఓటమి
- 1984లో తెలుగుదేశం పార్టీలో చేరిక
- 1987లో నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్
- 1988లో టీడీపీ జిల్లా అధ్యక్ష్య పదవి
- 1989లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి అప్పటి ప్రత్యరి ్థబాలాగౌడ్ చేతిలో ఓటమి
- 1992లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు
- 1994లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు
- 1998లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారంకు దక్కిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పదవి
- 1999లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపు
- 1999లో భూగర్భ గనుల శాఖ మంత్రిగా విధులు

- 2000లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు
- 2002 లో మంత్రి పదవికి రాజీనామా
- 2004లో ఎమ్మెల్యేగా ఓటమి
- 2005-2007 వరకు జిల్లా టీడీపీ కన్వీనర్‌గా నియామకం
- 2009లో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
- 2011లో తెలంగాణ ఉద్యమ ఉధృతి దృష్ట్యా టీడీపీ ద్వంద వైఖరికి నిరసనగా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా
- 2011లో ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ పార్టీలో చేరిక, టీఆర్‌ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియామకం
- 2011లో ఉప ఎన్నికలో ఎమ్యెల్యేగా గెలుపు
- 2014లో స్వరాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ క్యాబినెట్‌లో తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు
- 2018లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభాపతి వంటి అత్యున్నత పదవిని అలంకరించారు.

90
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles