ప్రచారం షురూ..

Thu,January 17, 2019 02:17 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా అభ్యర్థులెవరన్నదీ తేలి పోవడంతో హోరా హోరీ ప్రచారం ప్రారంభమైంది. రెండో విడత నామినేషన్ల ఘట్టం పూర్తి కావస్తోంది. ఇక మిగిలిన తుది విడత నామినేషన్ల ప్రక్రియ సైతం ముగింపునకు చేరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ప్రకటించిన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అనుసరించి చకచకా అన్ని దశలు ఆరంభం కావడంతో ఎన్నికల ని ర్వహణపై జిల్లా యంత్రాంగమూ దృష్టి సారించింది. ఇ టు అభ్యర్థులు సైతం తమకున్న స్వల్ప కాలిక ప్రచార సమయాన్ని వాడుకునేందుకు ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. కర పత్రాలు, నమూనా బ్యాలెట్ పేపర్లను ముద్రించుకుంటూ ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతి పర్వ దినం సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన వారిని కలిసేందుకు ఆశావహులంతా ఆసక్తి చూపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా మళ్లీ ఓటేసేందుకు రావాల్సిందిగా విజ్ఞప్తులు సైతం చేశారు.

హోరాహోరీ ప్రచారం
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం షురూ అయ్యిం ది. ఒక్కో అభ్యర్థి రెండు, మూడు సార్లు ఓటర్ల గుమ్మం తొక్కుతున్నారు. ఎన్ని సార్లు ఓటర్లను కలుసుకుంటే అం త బాగా గుర్తుంచుకుంటారన్న భావనతో అభ్యర్థులు ప్ర చారం ముమ్మరం చేశారు. తొలుత దండం పెట్టడం, అ వసరమైతే బతిమిలాడడం, మరోలా మర్యాదలు చేయ డం, వరుసలు కలుపుకుని మాట్లాడటం, ఇంకనూ సరిపోకపోతే ప్రలోభాలతో ఓటర్లను లొంగదీసుకునేందుకు సైతం అభ్యర్థులు సిద్ధం అయ్యారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరెవరో తేలిపోవడంతో ఆయా గ్రామాల్లో ప్రచారం ఇప్పటికే ఊపందుకుంటోంది. సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు కలిసి రావడంతో ఇంటింటికీ వెళ్లిన అభ్యర్థులంతా ఏకంగా ఇటు పండుగ శుభాకాంక్షలను చెబుతూనే ఓట్లను అభ్యర్థించారు. ఈ నెల 21వ తేదీన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఐదు రోజుల ప్ర చార గడువు మాత్రమే ఉండడంతో గెలుపు కోసం వ్యూ హ, ప్రతి వ్యూహాలను రూపొందిస్తున్నారు. రెండో విడతకు నామినేషన్ల ఘట్టం ముగియనుండడంతో ఆయా గ్రామాల్లోనూ ప్రచారానికి ఆశావహులు పెద్ద ఎత్తునే సిద్ధం అవుతున్నారు. తుది విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లోనూ ఇప్పటి నుంచే ప్రచారం మొదలైంది.

ప్రచార సామగ్రి సిద్ధం
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు ప్రచార సామగ్రిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. నిన్న, మొన్నటి వరకూ నామినేషన్ల ఉపసంహరణలపై దృష్టి పెట్టిన అభ్యర్థులు బరిలో నిలిచిందెవరో తేలిపోవడంతో ప్రచార సామగ్రి ముద్రణ కోసం పరుగులు పెడుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులంతా ప్రచారానికి కావాల్సిన కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ప్లకార్డులు, జెండాలు, బ్యాలెట్ నమూనా పత్రాల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్‌లలో బారులు తీరుతున్నారు. ప్రచార సామగ్రి తయారైతే ఓటర్లకు అవగాహన కల్పించడంతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థి ఏ వరుస క్రమంలో ఉన్నాడో తెలియజేసేందుకు అనువుగా ఉంటుంది. ప్రచార సమయం అతి తక్కువ ఉండడంతో కుల సంఘాలు, యువకులు, మహిళా సంఘాలు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లపై అభ్యర్థులు దృష్టి సారించారు. సన్నిహితులతో సమాచారం అందిస్తూ మద్దతు తెలపాల్సిందిగా మర్యాదలు మొదలు పెట్టారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లకు సిద్ధం అవుతున్నారు. వరుసలు కలుపుతూ ప్రచారాన్ని ప్రారంభించారు. నామినేషన్ల పర్వానికి ముందు నుంచే కొంత మంది అభ్యర్థులు ఓటర్లను కలిసి మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు. కొంత మంది అభ్యర్థులైతే కేటాయించిన గుర్తుల బొమ్ములు, నమూనాలతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటా ప్రచారంతోనూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ నెల 21న తొలి విడత ఎన్నికలు
తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతోంది. మొత్తం 164 గ్రామ పంచాయతీలకు గాను 31 గ్రామాల్లో సర్పంచుల ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవం కావడంతో ఇక మిగిలిన 134 గ్రామాల్లోనే పోలింగ్ జరుగనుంది. ఆయా చోట్ల ఎన్నికల అధికారులు నిబంధనల మేరకు ఒకే నామినేషన్ వేసిన వారిని సర్పంచ్‌గానూ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి సర్పంచ్ స్థానాలకు మొత్తం 697 నామినేషన్లు, వార్డు స్థానాలకు 3,136 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా మాచారెడ్డి మండలంలో 22 గ్రామాలకు 142 మంది సర్పంచ్ ఆశావహులు పోటీలో నిలిచారు. తాడ్వాయిలో 17 జీపీలకు 89 నామినేషన్లు, రామారెడ్డిలో 16 జీపీలకు 85 నామినేషన్లు, సదాశివనగర్‌లో 19 జీపీలకు 75 నామినేషన్లు, భిక్కనూరులో 16 జీపీలకు 72 నామినేషన్లు వచ్చాయి. దోమకొండలో 10 గ్రామ పంచాయతీలకు 66 నామినేషన్లు, రాజంపేటలో 12 జీపీలకు 61 మంది పోటీలో నిలిచారు. బీబీపేటలో 9 జీపీలకు 55 నామినేషన్లు, కామారెడ్డి మండలంలో 13 జీపీలకు 52 నామినేషన్లు నమోదు అయ్యాయి.

226
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles