పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

Thu,January 17, 2019 02:16 AM

బాన్సువాడ రూరల్ : జిల్లాలో మొదటి, రెండో విడతతో పాటు మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మండలంలోని కొల్లూర్ గ్రామపంచాయతీలో నామినేషన్ కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఎన్నికల నామినేషన్ పత్రాల జారీ, నామినేషన్ స్వీకరణపై రిటర్నింగ్ అధికారితో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ మేరకు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తున్నామని, మొదటి, రెండో విడతల నామినేషన్ పత్రాల స్వీకరణ పూర్తయిందని తెలిపారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 164 గ్రామ పంచాయతీలకు, 1,508 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా... 31 పంచాయతీలు, 452 వార్డులు ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు. రెండో విడతలో 192 పంచాయతీలకు గాను 1,622 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా... 35 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మూడో విడతలో 170 పంచాయతీలకు, 1512 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయని వివరించారు. మూడోవిడతకు సంబంధించిన నామినేషన్ పత్రాల స్వీకరణ ఈ నెల 16, 17 తేదీల్లో కొనసాగుతోందని తెలిపారు.

ఈ నెల 21, 25, 30 తేదీల్లో విడతల వారీగా పోలింగ్ జరిపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను పోటీలో పాల్గొంటున్న ప్రతి అభ్యర్థీ పాటించాలని, పరిమితికి మించి ఖర్చులు చేయరాదని సూచించారు. అభ్యర్థి ఎన్నికల ఖర్చు లావాదేవీలను తన బ్యాంక్ అకౌంట్ ద్వారానే జరపాలని సూచించారు. మొదటి, రెండో విడత నామినేషన్ ప్రక్రియలో భాగంగా 66 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు చేశారని, వాటిపై ఎలాంటి ఫిర్యాదులూ రాలేవని చెప్పారు. ఆయా తేదీల్లో పోలింగ్ అనంతరం మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ ప్రారంభించి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికైన వార్డు సభ్యులతో కోరం ఏర్పాటు చేసి ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. సర్పంచ్ అభ్యర్థి రిటర్నింగ్ అధికారి అనుమతితో ఒక వాహనం ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీడీవో యావర్ హుస్సేన్ సూఫీ, ఈవోపీఆర్డీ బషీరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles