తుది విడతకు సన్నద్ధం

Tue,January 15, 2019 04:57 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : జిల్లాలో మొదటి, రెండో విడత పంచాయతీ సర్పంచు ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. జిల్లాలోని ఏడు మండలాల్లోని 170 సర్పంచు పదవులకు, 1512 వార్డుస్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లాలో తుది విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్న బాన్సువాడలో 10 నామినేషన్ కేంద్రాల్లో 25 మంది సర్పంచ్ పదవులకు, బీర్కూర్ మండలంలోని 5 నామినేషన్ కేంద్రాల్లో 12 మంది సర్పంచ్, నస్రుల్లాబాద్ మండలంలోని 6 కేంద్రాల్లో 17 సర్పంచ్ పదవులకు, జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్‌లో 11 నామినేషన్ కేంద్రాల్లో 30 మంది సర్పంచ్ పదవులకు, బిచ్కుంద మండలంలో 9 కేంద్రాల్లో 27 మంది సర్పంచ్ పదవులకు, పెద్ద కొడప్‌గల్ మండలంలో 9 కేంద్రాల్లో 25 సర్పంచ్ పదవులకు, మద్నూర్ మండలంలోని 12 కేంద్రాల్లో 34 సర్పంచ్ పదవులకు తుది విడత నామినేషన్ల స్వీకరణ ఈ నెల 16న ప్రారంభం కానుంది. ఒక్కో నామినేషన్ కేంద్రంలో మూడు నుంచి నాలుగు గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఆయా మండలాల్లో తుది విడతలో ఈ నెల 30న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. తుది విడత ఎన్నికల్లో 3024 మంది అధికారులు విధుల్లో పాల్గొననున్నారు. ఏడు మండలాల్లో 114 మంది స్టేజ్ 1-అధికారులు, స్టేజ్ 2 -అధికారులు, 170 మంది అధికారులు సేవలు అందించనున్నారు.

జిల్లాలో ఏడు మండలాల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న వారంతా ఇప్పటికే తమ తమ గ్రామాల్లో పోటీకి సిద్ధమై నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని 20కి పైగా గ్రామాలు ఇప్పటికే గ్రామాల్లో ఏకగ్రీవం చేసుకుని స్వయం పాలన దిశగా అడుగులు వేసేందుకు గ్రామస్తులు అంతా ఏకతాటిపై నిలుస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఆశావహులు పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ గ్రామాల పెద్దలు ఒక్కరికే అవకాశం ఇచ్చేలా, మిగిలిన వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలు ప్రోత్సాహకం అంది చనుండడంతో పాటు, నియోజకవర్గ నిధుల నుంచి ఎమ్మెల్యే పోచారం రూ. 10 లక్షలు అందిస్తామని ప్రకటించడంతో కొన్ని గ్రామాల్లో ప్రజలు కలిసి కట్టుగా ఏకగ్రీవం చేసుకోవాలనే యోచనలో ఉన్నారు.

ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు...
తుది విడత సర్పంచు ఎన్నికలకు ఈ నెల 16 నుంచి నామినేషన్లు వేసే ప్రక్రియ మొదలుకానుంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, 20న ఫిర్యాదుల స్వీకరణ, 21న ఫిర్యాదుల పరిశీలన, 22న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ, 23న ఏకగ్రీవమైన గ్రామాల్లో ఎంపీడీవో, ఈవో పీఆర్డీ, ఎస్సై ఆధ్వర్యంలో విచారణ, చేపట్టనున్నారు. గ్రామాల్లో వచ్చిన నివేదికను కలెక్టర్‌కు సమర్పించి కలెక్టర్ ఆమోదంతో గ్రామ పంచాయతీ సర్పంచును ప్రకటించనున్నారు. పోటీల్లో ఉన్న సర్పంచు, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, 2 గంటల నుంచి బూత్ అధికారులు ఓట్ల లెక్కింపు చేపడతారు. గెలుపొందిన అభ్యర్థులకు పత్రాలు అందజేస్తారు.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles