కన్నుల పండువగా..

Tue,January 15, 2019 04:57 AM

బీర్కూర్: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో గోదా రంగనాథుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ధనుర్మాసోత్సవాల్లో వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో నెల రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన కల్యాణానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగాయి. గోదా రంగనాథుల కల్యాణోత్సవంలో 30 జంటలతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. బీర్కూర్ గ్రామానికి చెందిన కర్ణకంటి విమల-వీరయ్య గుప్తా దంపతులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

రూ.13 కోట్లతో ఆలయాభివృద్ధి..
తెలంగాణ తిరుమల దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతోందని, రూ. 13 కోట్లతో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. గోదాదేవి-రంగనాథ స్వామి కల్యాణంలో పాల్గొన్న ఆయన ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదా రంగనాథుల కల్యాణాన్ని వైభవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని భగవంతుడిని వేడుకున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలయాన్ని దర్శించుకొని రూ. 13 కోట్ల నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆ నిధులతో ప్రాకారం, మాఢ వీధులు, రాజగోపురాలు, గాలిగోపురాలు నిర్మిస్తున్నట్లు వివరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన కొలనులో భక్తులు షికారు చేసేందుకు బోటు సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. ఆలయాన్ని చిన్న జీయర్ స్వామి సూచించినట్లు తెలంగాణ తిరుమల దేవస్థానం పేరు సార్థకమయ్యేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పరిగె శంభురెడ్డి, పోచారం సురేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్‌రావు, ద్రోణవల్లి సతీశ్, భోగవల్లి అప్పారావు, ద్రోణవల్లి అశోక్, రాంబాబు, ఆకుల మురళి, కిరణ్, నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles