కల్తీని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు

Mon,January 14, 2019 01:39 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ: బాన్సువాడ డివిజన్ అన్ని గ్రామాలు, పట్టణాల్లో కల్తీ వ్యాపారులను, కల్తీ ప్రదార్థాల తయారీని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ డీఎస్పీ యాదగిరి హెచ్చరించారు. ఆదివారం ఆయన బాన్సువాడ పట్టణ పోలీస్ స్టేషన్ విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో శనివారం పట్టుకున్న కల్తీ నెయ్యి తయారీ ముఠా వివరాలను వెల్లడించారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని సంగమేశ్వర కాలనీలో రోడ్డు నంబర్ 4లో శంకర్ అనే వ్యక్తి ఇంట్లో కొంత కాలంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన పది మంది అద్దెకు దిగారని చెప్పారు. కొంత కాలంగా పామోలిన్ ఆయిల్, కొంత శాతం నెయ్యి, డాల్డా మిశ్రమాలను కలిపి ఉడికించి కల్తీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీసీఎస్ పోలీసులు కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా నివాసముంటున్న ఇంట్లో శనివారం దాడులు చేశారని చెప్పారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో నెయ్యి అవసరముంటుందని భావించి పెద్ద మొత్తంలో కల్తీనెయ్యి తయారీకి పూనుకున్నారని తెలిపారు. సంగమేశ్వర కాలనీలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ఇంట్లో దాడులు చేయడంతో 120కిలోల కల్తీ నెయ్యి దొరికినట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని లింగారావుపల్లికి చెందిన ముడావత్ శంకర్, ఇప్పన్నపల్లికి చెందిన కెతావత్ కందుకూరు మండలంలోని మురళినగర్ చెందిన ముడావత్ రాజు, కేశంపేట మండలంలోని మిర్దావెల్లి గ్రామానికి చెందిన మెగావత్ శేవ్య, శ్యాంరావు తండాకు చెందిన జర్పల లింగ్యాలు కలిసి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని తెలిపారు. వీరితో పాటు మరికొందరు ఈ కల్తీ దందా నడుపుతున్నారని వీరు పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. దాడుల్లో దొరికిన వారిని కల్తీ నిరోధక చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నామని తెలిపారు.

కిలో కల్తీ నెయ్యి తయారీకి కిలో పామోలిన్ ఆయిల్, కిలోడాల్డా, వంద గ్రాములు స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మిశ్రమాన్ని అత్యధి ఉష్ణోగ్రత వద్ద ఉడికించి కల్లీ నెయ్యి తయారు చేస్తున్నారని తెలిపారు. బాన్సువాడ డివిజన్ పరిసర గ్రామాల్లో పర్యటించి ప్రజలకు కిలోకు రూ.340 నుంచి రూ400 చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ, ప్రాణాలతో చెలగాటం ఆడే కల్తీ పదార్థాలను విక్రయించే ముఠాలు సంచరిస్తే నేరుగా పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలని సూచించారు.

అధిక లోడుతో ధాన్యం, చెరుకు తరలించొద్దు
గ్రామాల్లోని రైతులు పండించిన పంటలను లారీల్లో రవాణా చేస్తూ రోడ్డుపై వాహనాల్లో పెద్ద మొత్తంలో చెరుకు, వరిధాన్యం నింపుకొని వెళ్లడంతో రోడ్డుపై ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రైతులు సహకరించాలని డీఎస్పీ యాదగిరి సూచించారు. చెరుకును లారీలు, ట్రాక్టర్లలో అధిక లోడుతో రోడ్ల మీదుగా తీసుకెళ్లవద్దన్నారు. వాహనంలో ఎంత పడుతుందో అంతే లోడు నింపి తీసుకెళ్లాలని అన్నారు. అంతే కాకుండా మూడు నెలల్లో డివిజన్ అన్ని గ్రామాల్లో ప్రజల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. గ్రామానికి నాలుగు నుంచి ఎనిమిది సీసీ కెమెరాలు భిగిస్తామని, ఇందుకు ప్రజల సహకారం ఉండాలని కోరారు. సమావేశంలో సీసీఎస్ టీం సీఐ ముస్తాన్ అలీ, పట్టణ ఎస్ మహేశ్ గౌడ్, ఎస్సై సాయన్న, సందీప్, సీసీఎస్ టీం ఏఎస్ ఎండీ హుస్మాన్, సిబ్బంది రవికృష్ణ, నరేశ్, శంకర్ తదితరులు సిబ్బంది ఉన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles