చలి ఉగ్రరూపం

Sun,January 13, 2019 01:33 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి వణికించేస్తోంది. గత నెలలో పెథాయ్ పెను తుఫాన్ ప్రభావంతో వరుసగా నాలుగు రోజుల పాటు ప్రజలను గజగజలాడించిన వాతావరణం ఇప్పుడు మళ్లీ విరుచుకు పడుతోంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు మంచుతెర జిల్లాను ఆవరించడంతో అంతా బెంబేలెత్తిపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో చలి బీభత్సం సృష్టిస్తోంది. పెరుగుతున్న శీతల గాలులతో చిన్నా, పెద్దా అంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డిసెంబర్ మాసం ప్రారంభం నుంచి తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న చలి గాలుల తీవ్రత జనవరి రెండో వారంలోనూ ప్రభావం చూపుతోంది. మధ్యలో కాసింత చలికి విరామం లభించినప్పటికీ మళ్లీ ఇప్పుడు పంజా విసురుతోంది. చలి మంటలతో చాలా చోట్ల జనాలు ఉపశమనం పొందాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా వ్యవసాయ పొలాలు, గుట్టలు, పట్టణ భవంతులపై ఆవరించిన మంచు తెరలతో ప్రజలు ఓ రకంగా ఆహ్లాదాన్ని పొందుతున్నారు.

వణికిస్తోన్న చలి..
శీతాకాలం ప్రారంభంలో వేసవి కాలాన్ని తలపించే ఎండలు జనాలను ఇబ్బందికి గురి చేశాయి. ఉదయం కొద్దిగా చలి తీవ్రత కనిపించినప్పటికీ ఉదయం 10 గంటల తర్వాత ఎండ వేడిమి గడగడలాడించింది. డిసెంబర్ మాసం ప్రారంభం నుంచి క్రమేణా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం మరోవైపు పెథాయ్ పెను తుఫాన్ రావడంతో చలి తీవ్రత పెరుగుతూ వచ్చింది. మంచు దుప్పటి భారీగా ఆవరించడంతో పాటుగా భారీగా పొగ మంచు మూలంగా ప్రజలు బయటకు వెళ్లాలంటే వెనుకా ముందు ఆలోచించాల్సి వస్తోంది. మరోవైపు ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి ప్రకృతి ప్రేమికులు ఒకింత సంభ్రాశ్చర్యాలకు గురవుతూ శీతల గాలులను ఆస్వాదించారు. కాని, ఏకధాటిగా ఎన్నడూ లేని విధంగా చలి వీయడంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పరిస్థితి తీవ్రరూపమై జనాలను ఇళ్లకు పరిమితం చేస్తోంది. మూడు రోజుల క్రితమే భిక్కనూరు మండలంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు కావడం విశేషం.

పొగ మంచుతో ఆనందభరితం..
ఆకాశమే నేలను ముద్దాడినట్లుగా తెల్లని మబ్బులు నేలను తాకుతూ పయనించే సన్నివేశాలు ఈ శీతాకాలంలో ప్రజలంతా కళ్లారా చూశారు. దట్టమైన పొగ మంచు అనేక మార్లు ఏర్పడటంతో ఈ పరిణామాలు ఈ మధ్య కాలంలో నిత్యకృత్యమయ్యాయి. గతంలో ఏనాడు కనిపించని సుందరమైన శీతల పరిస్థితులు జిల్లావ్యాప్తంగా ఆవరించి ఉండటంతో ప్రజలు హిమాలయ చలి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. రహదారులపై కమ్ముకున్న దట్టమైన పొగ మంచులో ఫొటోలు దిగుతూ హుషారుగా గడిపారు. అనేక మంది పర్యావరణ ప్రేమికులు ఈ దట్టమైన పొగ మంచుతో కూడిన స్వచ్ఛమైన వాతారవణాన్ని మనసారా ఆస్వాదించారు. ఉత్తరాది రాష్ర్టాలకే పరిమితమైన పొగ మంచు సన్నివేశాలను చూస్తూ ఉల్లాసం, ఉత్సాహంగా చలి గాలుల తీవ్రతను ఎదుర్కొంటూ ఆడుతూ పాడుతూ గడుపుతున్నారు. ఇక ఉద్యోగస్తులు, ఇతర పనులకు వెళ్లాల్సిన వారంతా తప్పని పరిస్థితుల్లో చలిని తట్టుకునేందుకు ఉన్ని దుస్తులు ధరించి ఉపశమనం పొందారు.

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles