‘తనిఖీ తర్వాతే పోలింగ్ కేంద్రంలోకి అనుమతి’

Sat,January 12, 2019 01:41 AM

లింగంపేట: పంచాయతీ ఎన్నికల సందర్భంగా పకడ్బందీగా తనిఖీలు చేసిన తర్వాతే పోలీంగ్ కేంద్రంలోకి పంపనున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం లింగంపేట మండల కేంద్రంలోని సెర్ప్, గ్రామ పంచాయతీ, ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం సెర్ప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్నందున పోలింగ్ కేంద్రంలోకి తాగునీరు, టీ, స్కెచ్ పెన్నులు, మార్కర్లు తీసుకువెళ్లరాదని సూచించారు. ఓటర్లను పోలీసు సిబ్బంది తనిఖీ చేస్తారని వెల్లడించారు. మహిళా కానిస్టేబుళ్లు అందుబాటులో లేనిచోట మహిళా సంఘ సభ్యులు, ఎన్ వలంటీర్లు తనిఖీ చేస్తారని తెలిపారు. మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నందున నామినేషన్ల ఉప సంహరణ రోజు ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులు, సర్పంచుల వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. ఉప సంహరణ తర్వాత ఓటర్ల ఫొటోతో కూడిన ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అత్యవసర లైట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మొదటి విడుతలో నిర్వహిస్తున్న 164 సర్పంచ్ స్థానాలకు గాను 976 నామినేషన్లు, 1,508 వార్డులకు గాను 3,769 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రామేశ్వర్, ఎంపీడీవో మల్లికార్జున్ సూపరింటెండెంట్ వెంకటేశం, సుభాష్, ఈవో ప్రభాకరాచారి తదితరులు ఉన్నారు.

132
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles