ఏటీఎం’ల మాయగాడి అరెస్టు

Sat,January 12, 2019 01:41 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజలకు మాయమాటలు చెప్పి ఏటీఎం కార్డులు మార్చి డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని పట్లవేడు గ్రామానికి చెందిన బత్తిని నాగేంద్రబాబు కొంత కాలంగా ఏటీఎం సెంటర్ల వద్ద మాటూ వేసి గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరక్షరాస్యులైన వారిని టార్గెట్ చేసుకున్నాడని పేర్కొన్నారు. ఇతని చేతిలో రాజంపేట్ మండలంలోని అరెపల్లి గ్రామానికి చెందిన కొమ్ము రమేశ్ మోస పోయాడన్నారు. రమేశ్ ఖాతానుంచి రూ.50 వేలను నాగేంద్రబాబు ఖాజేశాడని తెలిపారు. మూడు నెలల క్రితం హైదరాబాద్ నుంచి అతని స్నేహితుడి వెంట కారులో కిరాయి వారిని తీసుకొని నిజామాబాద్ వెళ్తున్నానని చెప్పి కామారెడ్డి పట్టణానికి చేరుకున్నాడని తెలిపారు. అక్కడ ఏటీఎంలు ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడని తెలిపారు. తరుచూ హైదరాబాద్ నుంచి కామారెడ్డికి చేరుకొంటూ నాగేంద్రబాబు డబ్బులు డ్రా చేస్తుండేవాడన్నారు. నెల రోజుల క్రితం రైలులో కామారెడ్డికి చేరుకొని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం వద్ద భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన నాగర్తి మల్లేశ్ ఏటీఎం నుంచి రూ.50 వేలు డ్రా చేశాడన్నారు. వారం రోజుల క్రితం మళ్లీ కామారెడ్డికి చేరుకొని భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రమేశ్ కార్డును మార్చి రూ.50 వేలు డ్రా చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పై మూడు కేసుల్లో మొత్తం రూ.47 వేలను నిందితుడి నుంచి రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఏటీఎం సెంటర్ల వద్ద కొంత కాలంగా పోలీస్ నిఘా ఏర్పాటుచేయడంతో నాగేంద్రబాబు బాగోతం బయటపడిందని పేర్కొన్నారు. సిరిసిల్లా రోడ్డులోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం వద్ద వలపన్ని హోంగార్డు నయీం నాగేంద్రబాబును పట్టుకొన్నారని పేర్కొన్నారు. హోంగార్డును అభినందించి రివార్డు అందజేశామన్నారు. ప్రజలు ఏటీఎం కార్డులను, పిన్ నంబర్లను ఎవరికీ చెప్పవద్దని, ఎవరికీ ఇవ్వొద్దని డీఎస్పీ సూచించారు. బ్యాంక్ అధికారులం అంటూ ఫోన్ చేసి ఏటీఎం వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు అడిగితే ఎవరికీ చెప్పొద్దన్నారు. లాటరీల పేరుతో మోసం చేస్తున్నారని, అటువంటి ఫోన్ కూడా నమ్మవద్దని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో పట్టణ సీఐ రామకృష్ణ, రూరల్ సీఐ భిక్షపతి, పట్టణ ఎస్సై రవికుమార్, మజార్ తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles