కాసులు కురిపిస్తున్న కలప..!

Fri,January 11, 2019 01:15 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతుంటే కొంత మంది దుండగులు పచ్చని చెట్లను నరుకుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అడవులను నామరూపాల్లేకుండా గొడ్డలి వేటుతో చిన్నాభిన్నం చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇటు పోలీసులు, అటు అటవీ శాఖలకు చెందిన కొంత మంది సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా కలపను సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లాలో గాంధారి, మాచారెడ్డి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, రాజంపేట, నస్రుల్లాబాద్, జుక్కల్, నిజాంసాగర్ మండలాల్లో ఈ తరహా కలప రవాణా నిత్య కృత్యంగా మారింది. ఇటీవలి కాలంలో కలపను తరలించేందుకు అక్రమార్కులు ఏకంగా అడ్డ దారులు తొక్కుతున్నారు. నీళ్ల ట్యాంకుల్లో, ధాన్యం బస్తాల మాటున, భారీ వాహనాల్లో కలప తరలిస్తున్నారు. అడవులపై సంబంధిత అధికారుల నిఘా కొరవడంతో ఈ తరహా ఘటనలు రాత్రి వేళలో క్రమేణా పెరుగుతున్నాయని తెలుస్తోంది. అటవీ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అక్రమార్కులపై పీడీ యాక్టు సైతం ఉపయోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసిన జిల్లా అటవీ శాఖ అధికారులు ఏ రకంగా అడుగులు వేస్తారో వేచి చూడాల్సి ఉంది.

అటవీ శాఖ ఉదాసీనత
జిల్లాలో కలప అక్రమంగా తరలుతోంది. గుట్టు చప్పుడు కాకుండా సాగుతోన్న ఈ వ్యవహారంలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. అధికారుల పట్టింపులేని తనం, నిఘా వైఫల్యం కాస్తా దుండగులకు వరంగా మారుతోంది. దొడ్డిదారిన తరలుతున్న విలువైన వన సంపద ప్రకృతికి పరోక్షంగా విఘాతం కలిగిస్తోంది. ఓ వైపు హరితహారం పేరిట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మొక్కలు పెంచుతుంటే సంబంధిత శాఖే చెట్టంత నిర్లక్ష్యం వహించడం విమర్శలకు తావిస్తోంది. వాటి సంరక్షణకు నడుం బిగించేందుకు హరితహారం కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహిస్తుంటే మరోవైపు ధనార్జనే ధ్యేయంగా కొందరు చెట్లను నేలకూలుస్తున్నారు.
రాత్రికి రాత్రే భారీ దుంగలను సరిహద్దులు దాటించి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. జిల్లాలో కొనసాగుతున్న కలప దోపిడీపై అటవీ శాఖ అధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇందుకు జిల్లాలోని అటవీ శాఖ సిబ్బందే అక్రమార్కులకు వంత పాడుతున్నట్లుగా విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. బోసిపోతున్న అడవుల విస్తీర్ణాన్ని విస్తరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యంతో పని చేస్తుంటే సంబంధిత శాఖ అధికారుల తీరుతో జిల్లాలో అడవులు మసకబారుతున్నాయి. అడవుల సంరక్షణ అన్నదీ జిల్లా అధికారులకు ప్రాధాన్యత స్థాయిలో లేకపోవడంతో చెట్ల నరికివేత యథేచ్ఛగా సాగిపోతోంది. నవ్విపోదురు గాక నాకేంటి అన్న పద్ధతుల్లో వ్యవహరిస్తూ ప్రభుత్వ సంకల్పానికే కొంత మంది శాఖకు చెందిన వ్యక్తులు తూట్లు పొడుస్తున్నారు.

అక్రమ కలపతో భారీ వ్యాపారం
జిల్లాలో 868 చదరపు కిలో మీటర్లలో ఉన్న అటవీ విస్తీర్ణం క్రమంగా అంతరిస్తోంది. ప్రధానంగా అటవీ ప్రాంతానికి సమీప గ్రామాల నుంచి కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసు, అటవీ శాఖ అధికారుల నిఘా లోపంతో ఈ వ్యాపారం నానాటికీ హెచ్చు మీరుతోంది. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో ఎంత లేదన్నా రోజుకు పదుల సంఖ్యలో వాహనాల్లో కలప తరలుతోందని అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలే చెబుతున్నారు. ఒక్క లారీ విలువ సుమారుగా రూ.20వేలు నుంచి రూ.30వేలుగా చెబుతున్నారు. ఈ విధంగా నెలకు రూ.2కోట్లు నుంచి రూ.3కోట్లు మేర వ్యాపారం సాగుతోంది. జిల్లాలో కలప తరలింపునకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దొంగల ముఠాను పట్టుకోవడంలో విఫలం అవుతున్నారు. కలపను ఎక్కువగా జిల్లా సరిహద్దుల్లోని ఇటుక బట్టీలకు సైతం తరలిస్తున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా సుమారుగా వందలాది మంది వ్యాపారులున్నట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు వందలాది కట్టె కోత మిషిన్‌లకు నెలకు 20 నుంచి 30 ట్రాక్టర్ల కలప చేరుతోంది. జిల్లాలోని పలు గ్రామాల సరిహద్దు నుంచి రాత్రి వేళల్లో లారీలు, ట్రాక్టర్లలో దుంగలను తరలిస్తున్నారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకున్నా దర్జాగా అనుకున్న స్థావరానికి చేరుస్తున్నారు.

అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత
మాచారెడ్డి: మండలంలోని బోడగుట్టతండాలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నట్లు మాచారెడ్డి రేంజ్ అధికారి అంబర్‌సింగ్ తెలిపారు. గురువారం ఎల్లంపేట పరిసర ప్రాం తాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కలప దాచి ఉన్నదనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా 24 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటి విలువ దాదాపు రూ.15 వేల వరకు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న కలపను రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ దాడిలో డిప్యూటీ రేంజ్ అధికారి సుజాత, ఎఫ్‌బీవో గోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.

868 చదరపు కిలో మీటర్లలో అటవీ సంపద
అడవుల్లో భారీ వృక్షాలను, టేకు చెట్లను కలప అక్రమ వ్యాపారులు నేల కూలుస్తున్నప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువలా వినిపిస్తున్నాయి. పగలు, రాత్రి తేడాల్లేకుండానే భారీ టేకు దుంగలను వివిధ ప్రాంతాలకు తరలిస్తూ దుండగులు రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలో ఈ తతంగం భారీగా సాగుతోంది. మాచారెడ్డి, రాజంపేట, గాంధారి, లింగంపేట, బాన్సువాడ, నస్రుల్లాబాద్, నిజాంసాగర్, జుక్కల్ ప్రాంతాల్లో ఈ వ్యవహారం నిత్యం సాగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. జిల్లాలో సువిశాల అటవీ ప్రాంతం ఉండగా కబ్జాలు, చెట్ల నరికివేతలతో విస్తీర్ణం రోజురోజుకూ తగ్గుతోంది. గతేడాదిలో ఎన్విరాన్‌మెంట్ ప్రొడక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఈపీటీఆర్‌ఐ) వెల్లడించిన 2018 జనవరి నివేదిక ప్రకారం జిల్లాలో బాన్సువాడ రేంజ్‌లో 800 ఎకరాలు, ఎల్లారెడ్డి రేంజ్‌లో 47.5 ఎకరాలు, కామారెడ్డి రేంజ్‌లో 247.25 ఎకరాలు, గాంధారి రేంజ్‌లో 703.65 ఎకరాల మేర అటవీ ప్రాంతం నామరూపాల్లేకుండా పోయింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో 33 శాతానికి అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. మొక్కల పెంపకంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ హరిత ఉద్యమం చేస్తోంది. ఈ దశలోనే అక్రమ కలప రవాణాను అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ప్రస్తుతం 3,652 చదరపు కిలో మీటర్ల మేర భౌగోళిక కామారెడ్డి జిల్లాలో అటవీ ప్రాంతమే ఏకంగా 868 చదరపు కిలో మీటర్లలో విస్తరించింది. చెట్ల నరికివేతతో అడవి విస్తీర్ణం తగ్గిపోతున్నందున పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఇకనైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాము. అక్రమ కలప రవాణా చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాము. ప్రజల్లోనూ చెట్ల నరికివేతను నిరోధించడం, అడవులను సంరక్షించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాము. నిరంతరం దాడులు చేయడంతో పాటుగా కలప రవాణాపై నిఘా పెట్టేందుకు యాక్షన్ ప్లాన్ సైతం సిద్ధం చేస్తున్నాము.
- వసంత, జిల్లా అటవీ శాఖ అధికారి

117
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles