గులాబీ శ్రేణుల సంబురం..!


Thu,October 18, 2018 12:42 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కామారెడ్డి, రూరల్/విద్యానగర్: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సహా ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి, సంక్షేమాలతో టీఆర్‌ఎస్ నేతలు బేరీజు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో మున్ముందు ఇతర పార్టీలు ప్రకటించే మ్యానిఫెస్టోలు ఎలా ఉండనున్నాయో అనే చర్చల్లో భాగంగా సన్నిహితులతో వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేటలో ముందుండాలని భావిస్తుండగా కేసీఆర్ ప్రకటించిన హామీల ఎజెండాతో శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. తొలి ప్రభుత్వం హయాంలో చేసిన పనులను చెప్పడంతో పాటు కొత్తగా ఏమి చేస్తామనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించేందుకు ఈ పాక్షిక మ్యానిఫెస్టో దోహద పడుతుందనే ధీమా టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలు తేరుకోక ముందే ప్రజల్లోకి వీటిని తీసుకెళ్తామని శ్రేణులంతా కొండంత ఆశతో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

కర్షకులు, నిరుద్యోగ యువతకు అండగా నిలిచే ప్రకటనలు ఓట్లు తెచ్చిపెడతాయని ఆ పార్టీ శ్రేణులు విశ్వసిస్తుండగా, ప్రజలు మాత్రం కొత్తగా ఇచ్చిన హామీల తీరుపై ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఆసరా పథకంలో భాగంగా సాధారణ పింఛన్ రూ.వేయి నుంచి రూ.2016కు పెంచడం, దివ్యాంగుల పింఛన్ రూ.1500 నుంచి రూ.3,016కు పెంచడం, నిరుద్యోగుల భృతి రూ.3,016ల చొప్పున అందించాలని తీసుకున్న నిర్ణయంతో మంచి స్పందనే లభిస్తోంది. రైతుబంధు పథకం ద్వారా అందించే సాయాన్ని ఎకరాకు అదనంగా రూ.1000 పెంచడంతో ప్రతి పంటకు ఎకరానికి రూ.4 వేల స్థానంలో రూ.5 వేలు కర్షకుల చేతికి అందించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఇప్పటికే ఈ పథకం ద్వారా రైతుల విశ్వాసాన్ని చూరగొన్నామనే విశ్వాసంతో పార్టీ శ్రేణులున్నారు.

మ్యానిఫెస్టో జోష్...
నెల రోజుల్లో జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లో పర్యటిస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం చేసిన పనులను తెలియ జెప్పే క్రమంలో ఎదురైన అనుభవాలను అధిగ మించేందుకు ఈ పాక్షిక మ్యానిఫెస్టోలోని కొత్త విషయాలు ఉపయుక్తమనే భావన టీఆర్‌ఎస్ అభ్యర్థుల నుంచి వ్యక్తం అవుతుంది. ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమాల విషయంలో ఆదర్శనీయమైన పంథాని చూపించామని చెప్కుకుంటున్న గులాబీ నాయకులకు అదనంగా మరికొన్ని విషయాలు చెప్పే అవకాశం దొరికినట్లు అయ్యింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రకులాల్లోని పేద వారికి ప్రత్యేక నిధి కేటాయింపు సహా ఇతర ప్రయోజనాల్ని కల్పించడం ద్వారా తమకు అనుకూలంగా మార్చుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా పేదల సొంతింటి కల విషయంలో మరింత స్పష్టతను పెంచేలా ఎన్నికల హామీలున్నాయి.

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం విషయంలో మార్పులు చేర్పులు చేయడం, సొంత స్థలమున్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వడం అనే హమీ ఆయా వర్గాలకు చేరుకుంటోంది. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న పనులని కొనసాగించడం, పథకాలను యథావిథిగా అమలు చేయనున్నామని చెప్పడంతో ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. మున్ముందు వెల్లడించే పూర్తి స్థాయి మ్యానిఫెస్టో వస్తే అందులో మరిన్ని జనాకర్షక అంశాలు తప్పక ఉంటాయనేదీ పార్టీ వర్గాల విశ్లేషణ.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...