భద్రంగా ఈవీఎంలు..

Sun,October 14, 2018 01:54 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో సీఈసీ ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను రూపకల్పన చేసింది. ఏ ఓట్లు ఎటు పడతాయనే అపోహాలు లేకుండా ఉండేందుకు ఈసారి ప్రత్యేకంగా మరో మిషన్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు ఎవరికి ఓటు వేస్తే వారికే పడతాయి. ఈ విషయంలో స్పష్టతను ఇచ్చేందుకు వీవీప్యాట్ అనే మరో యంత్రాన్ని ఈసారి సమకూర్చింది. వాస్తవానికి 1980లో ఈవీఎంలను తయారీకి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 20 ఏళ్ల తర్వాత సలహాలు, సూచనలతో మరింత మెరుగ్గా ఈవీఎమ్‌లను అందుబాటులోకి తెచ్చారు.

ఈవీఎంలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మన దేశంలో తయారు చేసిన యంత్రాల చిప్‌లు ఒకేసారి వినియోగిస్తున్నారు. ఒకేసారి చిప్‌లను వినియోగిస్తుండడంతో అక్రమాలకు తావు ఉండదు. ప్రస్తుతం కొత్తగా వీవీ ప్యాట్‌ల విధానం అమలు చేస్తున్నారు. ఏడు సెకన్ల వ్యవధిలో రసీదు వస్తుంది. ఓటరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈవీఎంలలో సాంకేతిక కారణాలు తలెత్తితే రసీదుల ఆధారంగా లెక్కింపు చేస్తారు. ఓటు వేసిన అభ్యర్థి కాకుండా మరొక అభ్యర్థి గుర్తు చూపెడితే సంబంధిత ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. ఒక వేళ వాస్తవం అయితే సరి చేస్తారు. లేని పక్షంలో సదరు ఫిర్యాదు దారుడిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు.

కంట్రోల్ యూనిట్‌లు 930, బ్యాలెట్ యూనిట్‌లు 1180...
జిల్లాలో 740 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి అదనంగా 10శాతం యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి. డిసెంబర్ 7వ తేదీ నాడు నిర్వహించబోయే ఎన్నికలకు సంబంధించి కంట్రోల్ యూనిట్‌లు 930, బ్యాలెట్ యూనిట్‌లు 1180, వీవీప్యాట్‌లు 1000 జిల్లాకు చేర్చారు. ఇందులో 911 కంట్రోల్ యూనిట్లు, 1171 బ్యాలెట్ యూనిట్లు, 909 వీవీ ప్యాట్‌లు పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. 19 కంట్రోల్ యూనిట్లు, 9 బ్యాలెట్ యూనిట్లు, 90 వీవీ ప్యాట్‌లు సాంకేతిక లోపాలు తలెత్తగా వీటి బదులుగా కొత్త యంత్రాలను తెప్పించనున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను నాలుగు దశల్లో తనిఖీలు చేశారు. జిల్లాకు చేరిన తర్వాత బీహెచ్‌ఈఎల్ ఇంజినీర్ల సమక్షంలో తనిఖీలు చేపట్టారు. యంత్రాలపై రాజకీయ పార్టీలకు పూర్తిగా అవగాహన కల్పించి, వీరందరి ఆమోదంతోనే వాటిని గోదాముల్లో భద్రపరిచి కలెక్టర్ సత్యనారాయణ సమక్షంలోనే తాళాలు వేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు భద్రపరిచిన ప్రాంతంలో నిత్యం పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.

విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు...
ఓటరు తుది జాబితా వెల్లడి కావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మొన్నటి వరకూ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా రెవెన్యూ యంత్రాంగమంతా ఓటరు నమోదు ప్రక్రియలో బిజీగా గడిపింది. 12వ తేదీ నాడు తుది జాబితా వెల్లడి కావడంతో ఓటరు నమోదు ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు మూడు నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఓటు హక్కు వినియోగం, వీవీప్యాట్ పనితీరుపై ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఊరూరా ఉద్యమ తరహాలో ప్రచారం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై సిబ్బంది చైతన్యం తీసుకు వస్తున్నారు. మొబైల్ యాప్, ప్రచార రథాలతో గ్రామాల్లో ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సమయం వరకు ఆయా గ్రామాల్లో ప్రచార వాహనాలు పర్యటించి ప్రజల్లో మరింత చైతన్యం తీసుకు రానున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ను పటిష్టవంతంగా అమలు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో పలు బృందాలు జిల్లా వ్యాప్తంగా సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయి. అభ్యర్థుల ప్రతి కదలికలను ఈ టీమ్‌లు పరిశీలిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
అత్యధిక ఓటర్లు కామారెడ్డి నియోజకవర్గంలోనే...

శుక్రవారం విడుదలైన ఓటరు తుది జాబితా ప్రకారం జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు కామారెడ్డి నియోజకవర్గంలోనే ఉన్నారు. ఇక్కడ 1,98,091 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,01,844 మంది ఓటర్లు కాగా, పురుషులు 96,230 మంది ఓటర్లున్నారు. జుక్కల్‌లో 1,74,588 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 86,326 మంది ఓటర్లు, మహిళలు 88,243 మంది ఓటర్లున్నారు. ఎల్లారెడ్డిలో మొత్తం ఓటర్లు 1,91,589 మంది ఉ న్నారు. పురుషులు 92,308 మంది ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 99,267 మంది ఉన్నట్లుగా తుది జాబితాలో వెల్లడైంది. కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారడంతో ఈసారి పట్టణంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కామారెడ్డి నియోజకవర్గం దాదాపుగా 2లక్షల మంది ఓటర్లకు చేరువవ్వడం విశేషం. జిల్లా మొత్తం మూడు నియోజకవర్గాలు కలుపుకొని మొత్తం ఓటర్లు 5,64,268 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 2,89,354 మంది మహిళా ఓటర్లు కాగా, పురుషులు 2,74,864 మంది ఓటర్లున్నారు. 50మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లు తేలింది. జిల్లా వ్యాప్తంగా ప్రవాస భారతీయుల ఓట్లు నమోదు కాలేదు.

126
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles