మహిళామణులు..!


Thu,October 11, 2018 11:56 PM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి జిల్లాలో జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు సంపూర్ణంగా ఉండగా బాన్సువాడ నియోజకవర్గం మాత్రం మూడు మండలాలతో నెలకొంది. ఈ మూడు మండలాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నిజామాబాద్ జిల్లా వాళ్లే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జరుగుతోన్న ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియ అంతా జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల వారీగానే కొనసాగుతోంది. ఈ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,05,320 మంది జనాభా ఉండగా ఇందులో పురుషులు 4,45,417 మంది, స్త్రీలు 4,59,903 మంది ఉన్నారు. అక్టోబర్ 12నాడు ఓటరు జాబితా వెలువరించనున్న నేపథ్యంలో అధికారులు కసరత్తు చేసిన గణాంకాల మేరకు పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. తాజా వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 5,66,319 మంది ఓటర్లున్నట్లుగా గుర్తించారు. ఇందులో పురుషులు 2,75,788 మంది కాగా, స్త్రీలు 2,90,481 మంది ఉన్నారు. జిల్లాలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లు ఏకంగా 14,693 మంది ఎక్కువగా ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటరు నమోదు ప్రక్రియలో మహిళలు భారీ ఎత్తున ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది.

మూడు నియోజకవర్గాల్లో..
జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్యలోనే కాకుండా మూడు నియోజకవర్గాల్లోనూ మహిళామణులు సత్తా చాటారు. జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలే భారీ ఎత్తున ఓటర్లుగా ఉన్నారు. పురుషులతో పోలిస్తే వీరి సంఖ్యే ఈ మూడు నియోజకవర్గాల్లో అధికంగా ఉంది. జుక్కల్ నియోజకవర్గంలో సుమారుగా 1,75,202 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 86,611 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు ఏకంగా 88,572 మంది ఉం డడం విశేషం. జుక్కల్ నియోజకవర్గం మొత్తం పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు దాదాపుగా 2వేల(1,961) మంది ఎక్కువగా ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 1,92,094 మంది మొత్తం ఓటర్లలో పురుషులు 92,549 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 99,531 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు దాదాపుగా 6,982 మంది అధికంగా ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారుగా 1,99,023 మంది కాగా పురుష ఓటర్లు 96,628 మంది కాగా, మహిళా ఓటర్లు 1,02,378 మంది ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోనూ భారీ ఎత్తున పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే సుమారుగా 6వేల మంది(5,750) మంది ఎక్కువగా ఉండడం విశేషం. కామారెడ్డి జిల్లాలో ఈసారి ట్రాన్స్‌జెండర్స్ ఓటర్లు 50 మంది నమోదయ్యారు. అత్యధికంగా జుక్కల్ నియోజకవర్గంలో 19 మంది, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 14 మంది, కామారెడ్డి నియోజకవర్గంలో 17 మంది ఉన్నారు.

ఓటరు తుది జాబితాకు సర్వం సిద్ధం...
రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలతో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. శాసనసభ రద్దు అయిన చోట్ల ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనను అనుసరించి చకచకా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఓటరు నమోదుకు షెడ్యూల్ ప్రకటించిగా అక్టోబర్ 8వ తేదీ నాడు తుది జాబితాను ప్రకటించాలని మొదట నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ తుది జాబితా ప్రకటన తేదీని మార్చింది. అక్టోబర్ 12వ తేదీ నాడు తుది ఓటరు జాబితా ప్రకటనకు నిర్ణయం తీసుకోగా రాష్ట్రంలో ఇటు జిల్లాలోనూ ఎన్నికల అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారంగా శుక్రవారం తుది ఓటరు జాబితాను ప్రకటించేందుకు సర్వం సిద్ధం చేశారు. తుది జాబితా అనంతరం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అనుబంధ జాబితాను సైతం వెలువరించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది. ఓటరుగా నమోదు చేసుకొని వారంతా ఎన్నికల రోజుకు పది రోజుల ముందు వరకూ ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...