ప్రజల చెంతకు పాలన..!

Thu,October 11, 2018 01:18 AM

- కొత్త జిల్లాలో అధికార వికేంద్రీకరణ ఫలాలు
- గ్రామాల్లో కలియ తిరుగుతోన్న జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం
- నూతన జిల్లా ఆవిర్భావంతో మారిన స్థితిగతులు
- సీఎం కేసీఆర్ ఆశించిన సుపరిపాలన దిశగా పయనం
- మూడో వసంతంలోకి కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కామారెడ్డి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నప్పుడు కామారెడ్డి ప్రాంతంలో సౌకర్యాలు అంతంత మాత్రమే. జిల్లాకు కలెక్టర్‌గా ఎన్.సత్యనారాయణ నియామకం జరిగి, 2016వ సంవత్సరం దసరా పర్వదినం రోజు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ భారీ సవాళ్లు ముందు నిలిచాయి. మైనార్టీ గురుకుల భవనాన్ని పరిపాలన కేంద్రంగా మలవడం, కామారెడ్డి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందించడం, సమీకృత వ్యవస్థగా కలెక్టరేట్‌ను తీర్చిదిద్దడం అన్నీ సవాళ్లే. అయితే, ఏడాది కాలంలోనే జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నింటినీ అధిగమించి పరిపాలనను గాడిలో పెట్టించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి సలహాలు, సూచనలతో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రత్యేకతను నిలుపుకుంది. జిల్లా ఎస్పీ కార్యాలయం ఏర్పాటు నుంచి ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రాంతంలో చక్కగా పని చేసే విధంగా వాతావరణం కల్పించడంలో కలెక్టర్ సత్యనారాయణ విశేషంగా కృషి చేశారు. జిల్లా ఏర్పడిన తొలి రోజుల నాటికి రెండేళ్ల జిల్లా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితికి అనేక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దూరం... దగ్గరగా...
ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే వారంతా గతంలో తీవ్రంగా ఇక్కట్లు ఎదుర్కొనేది. ఉమ్మడి జిల్లా నుంచి తరలి వచ్చే వందలాది మందితో కలెక్టరేట్ కిటకిటలాడేది. దీంతో ఉన్నతాధికారులు కొంత మందితోనే నేరుగా మాట్లాడే అవకాశం దొరికేది. ఇప్పుడలా కాదు... కొత్త జిల్లాలో ఫిర్యాదుల క్రమం గతంతో పోలిస్తే తగ్గినా... ప్రతీ వారం సగటున వంద ఫిర్యాదులు ప్రజావాణిలో నమోదు అవుతున్నాయి. వందమందితోనూ జిల్లా కలెక్టర్, జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారితో పాటు ఆర్డీవోలు, ఆయా శాఖల అధికారులంతా నేరుగా మాట్లాడి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. గతంలో మూస పద్ధతిలో జరిగిన కార్యక్రమం ఇప్పుడు భిన్నంగా సమస్యల పరిష్కారానికి వేదికగా మారుతోంది. గతంలో తమ ఆర్జీలు ఏమయ్యాయో తెలియక, సమస్య పరిష్కారం అవుతుందో లేదో అర్థం కాక అనేక మంది ప్రతీ వారం వచ్చి పోవడం తంతుగా మారేది. ఇప్పుడలా కాదు... ఫిర్యాదుదారులకు రసీదులు సైతం అందిస్తున్నారు. వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. నూతన జిల్లాలో ప్రతీ ఫిర్యాదుకు కచ్చితత్వం పెరిగింది. ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వస్తోన్న ప్రజలకు నూతన జిల్లాలో ఊరట కలుగుతోంది. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను అప్‌డేట్ చేయడం, వాటిని పరిష్కార అంశాలను ఆర్జీదారులకే తెలపడం వల్ల ప్రభుత్వ సేవలపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు జిల్లా కేంద్రానికి రావడం ఇబ్బందికి మారుతుండటం వల్ల జిల్లా కలెక్టర్ ప్రజల చెంతకే ప్రజావాణిని తీసుకు కెళ్లారు. నెలలో ఒక రోజు బిచ్కుంద మండలంలో ప్రజావాణి నిర్వహించడం వల్ల అక్కడి ప్రజలకు దూర భారాన్ని తగ్గించగలిగారు. ఇలా వినూత్న ఆలోచనలకు కొత్త జిల్లా వేదికవ్వడంతో పాటుగా ప్రభుత్వం తీసుకు వచ్చిన అనేక పథకాలు, కార్యక్రమాలు వేగంగా జనాల చెంతకు చేరేలా ఉపయుక్తమైంది.

155
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles