శోభాయాత్రకు సర్వం సిద్ధం

Sat,September 22, 2018 12:02 AM

కామారెడ్డి నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా జరగనుంది. ఇప్పటికే పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా జరిగే శోభాయాత్రకు పక్కా ప్రణాళికతో అధికారులు ముందుకు వెళుతున్నారు. ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో శోభాయాత్రకు కావలసిన బందో బస్తును ఏర్పాటు చేశారు. కామారెడ్డి డీఎస్పీ ప్రసన్న రాణితో పాటు ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 25 మంది, కానిస్టేబుళ్లు 200 మంది, స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు 35 మంది, ఎన్‌సీసీ కెడెట్లు 57 మంది, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు 50 మంది, వలంటీర్లు 50 మంది, యువనేస్తం టీం 30 మంది పట్టణంలోని 300 గణేశ్ మండపాల వద్ద, ప్రధాన రూట్లలో వీరు బందోబస్తు సేవలు అందించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖాన వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి శనివారం 6 గంటల నుంచి స్టేషన్ రోడ్, సిరిసిల్లా రోడ్లకు ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు. ఎలాంటి అసత్యప్రచారాలకు పాల్పడినా చర్యలు తీసుకోనున్నారు. అత్యవసర సమాచారం కోసం 100 డయల్‌కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. శోభాయాత్రకు తిలకించడానికి వచ్చే ప్రజలు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రజలకు సమాచారం కోసం రైల్వేస్టేషన్ ఆవరణలో ఒక కంట్రోల్ రూం, టేక్రియాల్ చెరువు వద్ద ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

గత శోభాయాత్రలో అత్యుత్సాహం...
గత ఏడాది గణేశ్ శోభాయాత్రలో జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు శోభాయాత్ర కొనసాగడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి భిన్నంగా ఎస్పీ శ్వేతారెడ్డి ఒకే రోజులో శోభాయాత్రను పూర్తి చేయాలని గణేశ్ మండపాల నిర్వాహకులను ఆదేశించడంతో పాటు రోడ్లపై నృత్యాలు చేస్తున్న యువతను బలవంతంగా తరలిస్తూ పోలీసు స్టేషన్‌లో ఉంచి హంగామా సృష్టించారు. కామారెడ్డిలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. దీనికి నిరసనగా అన్ని పార్టీల నాయకులు గణేశ్ మండపాల నిర్వాహకులు, ఏబీవీపీ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కామారెడ్డి బంద్ నిర్వహించడంతో పాటుగా నిజాంసాగర్ చౌరస్తా వద్ద గంటల తరబడి రాస్తారోకో నిర్వహించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో మరోసారి భారీ గణపతిని నెలకొల్పి ప్రత్యేక శోభాయాత్ర నిర్వహించాలనే వరకు వెళ్లింది. ఈ సారి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారా.. పాత ఆన వాయితీని కొనసాగిస్తారా అనే అంశంపై జనం చర్చించుకుంటున్నారు. గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలని అన్ని శాఖల అధికారులు ప్రజలను, గణేశ్ మండపాల నిర్వాహకులను కోరుతున్నారు.

శోభాయాత్ర జరిగే తీరు...
- కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన యువజన సమాఖ్య మండలి గణేశ్‌కు ధర్మశాల ఎదురుగా ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను నిర్వహిస్తారు.
- రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక వాహనంలో అలంకరించిన గణనాథుని ప్రత్యేక బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా వెళ్తారు.
- అక్కడి నుంచి మొదలై శని,ఆది రెండు రోజులు పాటు పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగుతుంది.
- బ్యాండ్ మేళాలతో యువత కేరింతల మధ్య శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహిస్తారు.
- సిరిసిల్లా రోడ్ నుంచి మొదలైన శోభాయాత్ర స్టేషన్‌రోడ్, సుభాష్‌రోడ్, గడీరోడ్,పెద్ద బజార్ మీదుగా రైల్వే కమాన్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా టేక్రియాల్ చెరువు వరకు సాగుతుంది.
- టేక్రియాల్ చెరువులో గణేశ్ నిమజ్జనం చేస్తారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం...
గణేశ్ శోభాయాత్రకు సర్వం సిద్ధం చేశాం. ప్రశాంతంగా గణేశ్ శోభాయాత్ర జరుపుకోవాలి. ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో బందో బస్తు నిర్వహిస్తున్నాం. వీరితో పాటు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వ లంటీర్లు, యువనేస్తం క్యాడర్ 200 మంది బందోబస్తులో పాల్గొంటున్నారు. రెండు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయడం జరిగింది. పుకార్లను నమ్మ వద్దు, ఏదైనా అత్యవసరం ఉంటే 100 డయల్‌కు ఫోన్ చేయాలి.
- ప్రసన్న రాణి, డీఎస్పీ

126
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles