ధాన్యం కోనుగోలుకు 205 కేంద్రాలు

Wed,September 19, 2018 01:30 AM

-మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి
కామారెడ్డి, నమస్తే తెలంగాణ: ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో 205 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో ఉమ్మడి జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై అధికారులతో కార్యచరణ ప్రణాళిక, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో లక్షా 725 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని, మొత్తం 3 లక్షల 2వేల 175 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రూ. 424 కోట్లతో 2లక్షల 50వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 19 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 28 లక్షల బ్యాగులు రానున్నట్లు వివరించారు.

టార్పాలిన్లు, ధాన్యం శుద్ధి చేసే యంత్రాలు, కాంటాలు, హమాలీలు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ధాన్యం ప్రాసెసింగ్ కోసం జిల్లాలో 88 రైస్ మిల్లులను ఎంపిక చేసినట్లు చెప్పారు. కనీస మద్దతు ధర ఏ-గ్రేడ్ క్వింటాలు ధాన్యానికి రూ. 1770, సాధారణ రకానికి రూ. 1750 నిర్ణయించినట్లు వెల్లడించారు. ధాన్యం రవాణాకు వాహనాలు సమకూర్చుకోవాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా కొనుగోలు చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలని సూచించారు. మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాల్ మొక్క జొన్నకు రూ. 1700, పెసర్లకు రూ. 6975 మినుములకు రూ. 5600 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ఉండేందుకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో 205 కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 50 కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 143, మిగతావి ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కొండల్ రావు, మార్క్‌ఫెడ్ డీఎం చంద్రశేఖర్, జిల్లా వ్యవపాయ శాఖ అధికారి నాగేంద్రయ్య, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles